మెల్బోర్న్ నగర వాస్తవ్యులు శ్రీ అనుమర్లపూడి అమరనాథ్ శర్మ గారు వ్రాసిన పుస్తకానికి సమీక్ష
శ్రీ ఆది శంకరాచార్యులు వారు మనకందించిన అద్వైతం ఈ పుస్తకానికి మూలం. ‘అద్వైతం’ అనగానే చాలామంది మనకి సులభముగా అర్ధమవుతుందా అనే భావనతో నిరుత్సాహము పడకుండా పండిత, పామర జనసామాన్యానికి అర్ధం అయ్యేలా సులభతరంగా దీని గురించి సవివరమైన ఉదాహరణలతో సహా వ్రాసి ఆనందామృతాన్ని అందించారు శ్రీ అనుమర్లపూడి అమరనాథ్ శర్మ గారు.
శ్రీ శర్మ గారు 1983 లో భారతదేశం నుండి ఆస్ట్రేలియా వలస వచ్చి మెల్బోర్న్ నగరంలో స్థిరపడ్డారు. ఆధ్యాత్మిక చింతనతో వ్రాసిన మొదటి పుస్తకం “శ్రీ అద్వైత విజ్ఞాన ప్రత్యభిజ్ఞ”.
ఇందులోని విషయం, పదజాలం, భావజాలం అద్భుతంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తకానికి ముఖచిత్రం కూడా అంతే అందంగా భావయుక్తముగా ఉండి ఆలోచింపజేసేదిగా ఉంది. ప్రతీ తెలుగువారు ఈ పుస్తకం చదివి అవలోకనం చేసుకొని అంతర్ముఖులై స్వస్వరూపాన్ని తెలుసుకోవడంలో కృతార్ధులు కాగలరని ఆకాంక్షిస్తున్నారు శ్రీ శర్మ గారు. పుస్తక ప్రతులు కావలసిన వారు contact@telugumalli.com ద్వారా సంప్రదించవచ్చు.
శీర్షిక వివరణ
” శ్రీ” విజయము, మేలు, లక్ష్మీదేవి, సర్వతోముఖాభివృద్ధి ఈ పుస్తక పఠనమువలన కలుగుతుందని తెలియచేయడమవుతున్నది.
” ప్రత్యభిజ్ఞ ” అంటే మరచిపోయిన విషయము తిరిగి గుర్తుకు తెచ్చుకొనడము.
ఏ విషయము మరచిపోవడము జరిగింది ? మనము మన స్వస్వరూపము మరచి పోయాము. ఏది మన స్వస్వరూపము?
“అద్వైతము” రెండవది అనేది లేని సత్య జ్ఞాన అనంతమయిన బ్రహ్మము అనే విషయము. బ్రహ్మము జ్ఞానము తో అనుభవము జోడించి తెలుసుకొనవలసిన అనుభవైకవేద్యమైనది.
శీర్షిక ఈవిధముగా అనుభవైకవేద్యమయిన బ్రహ్మమే నీ స్వస్వరూపము అనే విషయము ఏదయితే మరచిపోవడము జరిగినదో దానిని తిరిగి గుర్తు చేయడమే ఈ పుస్తకము యొక్క పరమ ప్రయోజనమని సూచించడము అవుతున్నదని ఆ విధముగా సర్వతోముఖాభివృద్ధి, మేలు జరగాలని కోరుకుంటున్నారు.