తేనెచుక్కలు – సమీక్ష

ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘రవ్వలు’ ఒక సరికొత్త లఘు కవితారూపం. ఛందో నియమం అవసరం లేని నాలుగు పాదాల ముక్తకం. ఈ మధ్యనే పురుడుపోసుకుంది. పుడుతూనే ఆచార్య నారిశెట్టి వేంకట కృష్ణారావును ఆకర్షించింది. ఆయన అప్పటికే లబ్దప్రతిష్ఠుడైన కవి. నవ్యతకు పెద్దపీట వేసే కృష్ణారావు తనలోని భావాత్మను, జీవితానుభవాన్నుండి పొందిన తాత్త్వికతను, తనలోని సున్నితత్వాన్ని, చతురతను తీయని ‘తేనెచుక్కలు’ చేసి పఠితకందిస్తున్నారు. ‘రవ్వలు’ కవితారూపంలో వస్తున్న రెండవ సంపుటం ఇది.
బహుశా ఆయనలోని నవ్యతను ప్రోత్సహించే, ఇష్టపడే గుణమే

పాతది ఒక అనుభవం
కొత్తది ఒక జ్ఞానం
పాతకొత్తల సంగమం
– నవ్యసూత్రానికి నాందీపథం!

అంటూ ఆయన చేత రాయించిందేమో. అయితే ఈ కవిత కేవలం నవ్యతకు నాందీవాచకం పలకడం కోసమే రాసినట్టు లేదు. తన వైయక్తిక జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని రంగరించిన తేనెచుక్కలా ఉంది.

కవి తన మనసును తొలిచేస్తున్న భావాలకు అక్షరరూపమివ్వడం కోసం స్వేచ్ఛానియతి గల ‘రవ్వ’ లాంటి లఘుకవితను ఎంచుకున్నప్పుడు సాధారణంగా అందులో బలమైన విరుపో, చమత్కరించే చరుపో దర్శనమిస్తుంది. మచ్చుకు ఇది చూడండి.
అమ్మన్నావ్
అక్కన్నావ్
చెల్లన్నావ్
– తన్ని తగలేశావ్!

స్త్రీమూర్తిని దేవతగా ఆరాధించే సమాజమని బయట ప్రగల్భాలు పలుకుతూ, ఇంట్లో ఆమెని నానారకాలుగా అణచివేస్తున్న, హింసిస్తున్న వికృతపోకడను బలమైన విసురుతో చెప్పగలిగాడిక్కడ కవి. ఐతే ఈ రకంగా చెప్పే క్రమంలో ఈ లఘు కవితారూపాలు ఒక్కోసారి చాన్నాళ్ళు నిలిచిపోయే సామెతల స్థాయికి చేరుకోవచ్చు. కొన్ని నినాదప్రాయమై కొన్నాళ్ళకు మాయమైపోవచ్చు. కానీ ప్రతిభావంతుడైన కవి చేతుల్లో రూపమేదైనా కవితాత్మకు లోటుండదు. ఆచార్య కృష్ణారావు ‘రవ్వ’ల్లో అలా తళుకులీనే కవితల్ని చూడవచ్చు. ఉదాహరణకు

పత్తి చేలో
విత్తు వేస్తే
నెత్తురు పూసింది
– నమ్మకం ఎండమావి!

తెల్లని పత్తిపూలు పూయాల్సిన తోటలో ఎర్రని నెత్తురు పూసిందంటున్నాడు కవి. ఆరుగాలం కష్టపడే రైతు పత్తి చేను సాగు చేస్తాడు. నకిలీ విత్తనాల వల్లనో, చేనుకు చీడ రావడం వల్లనో తుదకు కనీస ఫలసాయం అందకుండా, ఒకవేళ కొద్దిపాటిగా అందినా మార్కెట్ లో మద్ధతు ధర లభించకనో ఆ రైతు నిలువెత్తు నష్టపోతాడు. అటు పెట్టిన పెట్టుబడీ రాక, కుటుంబ జీవికకు కావల్సిన ధనమూ లేక, అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అంతటి కష్టాల్లోనూ వ్యవసాయం మీద పిచ్చి నమ్మకంతో సాగుబడి చేస్తూనే ఉంటాడు. మరింత నష్టాల్లోకి కూరుకుపోతూనే ఉంటాడు. ఇది వేలాది పత్తిరైతుల దీనగాథ. ఇంతటి బరువైన, ఆర్ద్రమైన సామాజిక జీవనచిత్రాన్ని ‘నెత్తురు పూసింది’, ‘నమ్మకం ఎండమావి’ అన్న కవితాత్మక పదాలతో పాఠకుడి మనసులో ఆలోచన రగిలిస్తున్నాడు కవి.

భక్తి పెరిగితే పిచ్చి
పిచ్చి ముదిరితే విరక్తి
విరక్తి విరిగితే ముక్తి
– రక్తి కడితేనే జీవన్నాటకం!

మనిషి జీవనప్రస్థానాన్ని సాధారణంగా ఒక నాటకంతో పోలుస్తారు. నాటకం రక్తి కట్టాలంటే అన్ని అంకాలు, దినుసులు సమపాళ్ళలో ఉండాలి. జీవితం రక్తి కట్టాలంటే దాటాల్సిన దశలని కవి ఇలా కళాత్మకంగా చెబుతున్నాడు.

కృష్ణారావుకు దైవం పట్ల, దైవత్వం పట్ల ఒక నిర్దిష్ట అభిప్రాయముంది. మనిషి తన ప్రవర్తనతో మనీషీగా ఎదగగలడన్న తాత్త్విక ఆలోచనా దృక్పథం ఉంది. అందుకే ఒక ‘రవ్వ’లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కేవలం భక్తితో కొలవాల్సిన త్రిమూర్తులుగా కాకుండా త్రిగుణాలకు సంకేతాలుగా భావించగలిగాడు. మనిషి జీవనసంవిధానానికి మార్గదర్శకాలుగా సూచించగలిగాడు. ఇంకో రవ్వలో బుద్ధుడు, ఏసు, మహమ్మద్ లు ప్రవక్తలు కాదు పరిస్థితులు అన్నాడు. సంఘజీవనంలో ఆందోళనకర అస్థిర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సమాజాన్ని సవ్యదిశలో నడిపించడానికి ఒక మహనీయుడు ప్రవక్తగా మారుతాడని, ఆ పరిస్థితే అతన్ని అలా మలుస్తుందని ఒక లోతైన భావనను కవి వ్యక్తపరుస్తున్నాడిక్కడ. మరొక రవ్వలో మొత్తంగా మంచి మనసున్న మనిషే భగవంతుడు అని తేల్చి చెప్పేస్తాడు.
ప్రతి కవికి అనివార్యంగా ప్రకృతి పట్ల ప్రేమ ఉంటుందనిపిస్తుంది. కృష్ణారావు కూడా తన కవిత్వంలో కొండ ప్రకృతి మనకందించిన వరం, కొండ మనకు అండ అని చెబుతూ కొండను కొడితే గుండెను కొట్టినట్లే అంటాడు. మీరు కూడా గుండె పెట్టి ఆలోచించండని, ప్రకృతిని వికృతం చెయ్యొద్దంటూ విన్నవిస్తాడు. ప్రకృతి ఉపకార గుణాన్ని కీర్తిస్తాడు.

నీటికి కొత్త కాదు
నింగికి కొత్త కాదు
నేలకు కొత్త కాదు
– ఉపకారం సహజగుణం!

‘రైతే దేశానికి వెన్నెముక’, ‘రైతే రాజు’ మొదలైన నినాదాలు దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. బహుశా వింటూనే ఉంటాం. కానీ అన్నం ముద్దను పండించే రైతు నేటికీ అన్నం కరువై చావడమనేది అత్యంత దయనీయమైన, దారుణమైన స్థితి. కృష్ణారావు కూడా ఆ దయనీయ స్థితిని అంతే ఆర్ద్రంగా చెబుతున్నాడు.

చేలో పంట లేదు
ఇంట్లో పొయ్యి లేదు
కంట్లో చెమ్మ లేదు
– వసారా వురికొయ్య ఊగుతోంది!

పాలకులు తమ మనుగడ కోసం రైతు కష్టాలను తీరుస్తామనే వాగ్దానాన్ని ఆరనిమంటగా రగుల్చుతూనే ఉంటారు. ఆ వాగ్దానాన్నే తమ గెలుపుకు కళ్ళెంగా వాడుకుంటుంటారు. ‘బక్క రైతు బలవలేదు’ అన్న మాటల్లో నిజానికి అవినీతి నాయకులు బలుస్తున్నారు అన్న నిందార్థం ఉంది. వాళ్ళ రాజకీయం ఆటలో రైతు బతుకు వెటకారంలా మారిపోయిందని వాపోతాడు.

ఇన్నేళ్ళ పాలనలో
బక్క రైతు బలవలేదు
దిగిన బతుకు ఎదగలేదు
– రైతు జీవితం ఎంత వెటకారం!

పాలకులు కేవలం వ్యవసాయ రంగాన్ని మాత్రమే అలక్ష్యం చేయడం లేదు. పూర్వకాలపు నియంతృత్వ రాజుల్లా దేశాన్ని తమ గుప్పిట్లో బంధించి జాతిని జలగలా పీడిస్తున్నారని, ఎదుగుదలకు బంధనాలవుతున్నారని గర్హిస్తున్నాడు.

రాజులు లేరు
రాజ్యాలు లేవు
రాజకీయం వుంది
– జలగ చావదు!

మొత్తంగా ఆచార్య కృష్ణారావు ‘తేనేచుక్కలు’ కవిత్వ సంపుటంలో భావుకత, సామాజికత, తాత్త్వికత ముప్పేటగా అల్లుకుపోయి పాఠకుడిని ఏకబిగిన చదివిస్తుంది. ఆచార్య కృష్ణారావుకు అభినందనలు.
~ రాపోలు సీతారామరాజు, దక్షిణాఫ్రికా

Scroll to Top