ప్రయోజన సినీ రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు
ఎం. వి. ఎస్. హరనాథ రావు నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. 150 సినిమాలకు పైగా సంభాషణలు రాశారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం ఆయన సంభాషణలు రాసిన సినిమాలు. ఈ నాలుగు సినిమాలకు ఆయనకు నంది పురస్కారాలు దక్కాయి. 20 కి పైగా సినిమాల్లో నటించారు. ఈయన తమ్ముడు మరుధూరి రాజా కూడా సంభాషణల రచయిత.
హరనాథ రావు 1948 జూలై 27 న గుంటూరులో జన్మించారు. ఆయన తండ్రి రంగాచార్యులు గుమాస్తాగా పనిచేసేవారు. తల్లి సత్యవతి దేవి సంగీత ఉపాధ్యాయురాలు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులో జరిగింది. చదువుకుంటున్నప్పుడే తండ్రితో కలిసి పౌరాణిక నాటకాలు చూసేవారు. మూడో తరగతి నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. తల్లి ప్రభావంతో ఆయనకు సంగీతం మీద కూడా ఆసక్తి కలిగింది. తల్లి ఉద్యోగ రీత్యా ఒంగోలుకు మారడంతో ఈయన కూడా ఒంగోలు చేరి శర్మ కళాశాలలో చదివారు.
నాటకరంగంలో తొలినడకలు
ఒంగోలులో శర్మ కాలేజీలో చదువుతున్నపుడు నాటకాల్లో బాగా పాల్గొనేవారు. ఆయన రాసిన మొట్టమొదటి నాటకం రక్తబలి. హరనాథ రావు దర్శకుడు టి. కృష్ణ కళాశాల రోజుల నుంచి మంచి స్నేహితులు. ఒకసారి ఇద్దరూ కలిసి అనేక నాటకాలు వేశారు. వారిద్దరూ కలిసి విజయవాడలో నాటకోత్సవాలు చూసి స్ఫూర్తి పొంది తాము కూడా మంచి నాటకాన్ని రాయాలనుకున్నారు. హరనాథ రావు దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి జగన్నాథ రధచక్రాలు అనే నాటకం రాశారు. భగవంతుని యొక్క ఉనికిని గురించి తాత్వికంగా చర్చించిన నాటకం ఇది. ఇది రాయటానికి ఈయనకు రెండేళ్ళు పట్టింది. ఈ నాటకం కొడవటిగంటి కుటుంబరావు, గోరా, ఆత్రేయ ప్రశంసలు పొందింది. ఉత్తమ నాటకంగా కన్యా వరశుల్కం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుండి పురస్కారం అందుకున్నారు. 6 నాటకాలు, 10 నాటకాలకు రచన, దర్శకత్వం చేసారు, వాటిలో నటించారు.
సినిమా రంగంలోకి
హరనాథ రావు తన స్నేహితుడైన టి. కృష్ణ ద్వారా సినీ పరిశ్రమలో 1985 లో రచయితగా అడుగుపెట్టారు. ఒక్క సినిమా మినహాయించి ఆయన తీసిన అన్ని సినిమాలకు హరనాథ రావే సంభాషణలు రాశారు. మరో వైపు కొన్ని సినిమాలలో కూడా నటించారు.
తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 80 చిత్రాలకు రచయతగా, నటుడిగా 40 చిత్రాలకు పనిచేసారు. కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, సురేష్ కృష్ణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం ఈయన సొంతం. రచయితగా సినిమాల్లో, రంగస్థలంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఎంవీఎస్ హరనాథ రావుకి తూటాల్లాంటి మాటలు రాయడమే ఇష్టం. ఆయన కలం అభ్యుదయం చిలికించింది. సభ్య సమాజాన్ని ప్రశ్నించింది. వెండితెరపై ఎర్రటి సూరీడులా ఉదయించింది. నాలుగు ఇంగ్లిషు సీడీల్ని చూస్తూ, ‘ఇక్కడో సెటైర్ పడాల్సిందే’ అంటూ కొలతలు కొలుస్తూ, ‘ఈ సినిమాకి ఇంత చాల్లే’ అని లెక్కలేసుకొంటూ ఆయనెప్పుడూ కలం పట్టలేదు. చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల మనస్తత్వాల్నీ చూసి మాటలు రాశారు, కాబట్టే.. మామూలు పదాల్లోనే కొండంత అర్థాన్నీ, అనంతమైన సత్యాన్నీ ఆవిష్కరించాయి. ‘ప్రతిఘటన’, ‘భరతనారి’, ‘వందేమాతరం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘ఇదా ప్రపంచం’, ‘అన్న’… ఇలా ఏ సినిమా అయినా తీసుకోండి. అందులో సంభాషణా చాతుర్యాన్ని, శక్తినీ ఒడిసిపట్టండి. ఎంవీఎస్ కలం బలమేంటో తెలిసిపోతుంది.
స్వతహాగా అభ్యుదయవాది. అందులోనూ నాటక రంగం నుంచి వచ్చారు. సమాజంలోని కుళ్లునీ, కుతంత్రాల్నీ పసిగట్టి కథలు రాశారు. నాటకాలు వేశారు. తన మాటల్నే ఆయుధాలుగా మలచుకొన్నారు. సినిమాల్లోకి వచ్చాకా ఆయనది అదే బాణీ. ఎంవీఎస్ నాటకాలు చూసి, అందులో ఆయన లేవనెత్తిన సమస్యల్ని చూసి ‘నువ్వు సినిమాల్లోకి రావాల్సిందేనోయ్’ అంటూ హేమాహేమీల్లాంటి దర్శకులు ఆహ్వానాలు పంపారు. కానీ.. సున్నితంగా తిరస్కరించిన ఎంవీఎస్ టి.కృష్ణ పిలుపుని మాత్రం కాదనలేకపోయారు. ఎందుకంటే ఇద్దరి భావాలూ ఒక్కటే. చదువుకొన్న ‘స్కూలు’ ఒక్కటే. కలిసి నాటకాలు ఆడారు, నీరాజనాలు అందుకొన్నారు. అందుకే తన జూనియర్ అయినా సరే, టి.కృష్ణ వెంటే నడిచారు హరనాథరావు. టి.కృష్ణ తెరకెక్కించిన ఆరు చిత్రాల్లో అయిదింటికి ఎంవీఎస్ సంభాషణలు రాశారు. అన్నీ ఆణిముత్యాల్లాంటి చిత్రాలే. అభ్యుదయ రచయిత అనే ముద్ర పడిన తరవాత దాన్ని చెరుపుకోవడం, అందులోంచి బయటకు రావడం కాస్త కష్టమనిపించింది. అయితే ఈ కష్టాన్నీ దాటేశారాయన.
కె.విశ్వనాథ్ చిత్రం ‘సూత్రధారులు’కి మాటలు రాశారు. టి.కృష్ణ శైలికి అలవాటు పడిన హరనాథ్… విశ్వనాథ్ స్కూల్‌లనూ చక్కగా ఇమిడిపోయారు. అంతెందుకు ‘రాక్షసుడు’లాంటి పక్కా కమర్షియల్ సినిమానీ పని చేయగలిగారు. ఉషాకిరణ్ మూవీస్ చిత్రం ‘ప్రతిఘటన’తోనే ఆయన తొలి నంది అందుకొన్నారు. ‘భరతనారి’, ‘ఇదా ప్రపంచం’, ‘అన్న’, ‘అమ్మాయి కాపురం’ ఆయనకు నందుల్ని తీసుకొచ్చాయి. హరనాథరావు మంచి రచయితే కాదు.. నటుడు. ‘రాక్షసుడు’లాంటి చిత్రాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. పుట్టింది గుంటూరులో అయినా, విద్యాభ్యాసం మాత్రం ఒంగోలులో సాగింది. ఆ వూరంటే హరనాథరావుకి చాలా ఇష్టం. దాదాపుగా 150 చిత్రాలకు పనిచేస్తే… అన్ని సినిమాలన్నీ తన సొంత వూరులో కూర్చునే రాశారు. ‘‘సొంతూరు వదలకుండా, అక్కడే కూర్చుని సినిమాలకు పనిచేసిన ఏకైక రచయితనేనేనేమో’’ అని చెప్పుకొనేవారు హరనాథరావు. చలం, గోపీచంద్, నరసరాజు, ఆత్రేయ… ఇలా హరనాథరావు అభిమాన రచయితల జాబితా పెద్దదే ఉంది. ‘అందరూ నా గురు సమానులే’ అనేవారాయన. హరనాథరావునీ గురువుగా భావించి, తయారైన శిష్యగణం ఎంతోమంది ఉన్నారు. హరనాథ రావు అక్టోబరు 9, 2017 న గుండెపోటుతో ఒంగోలులో మరణించారు.