భాగవతం కథలు – 14

ప్రపంచ సృష్టి ప్రకారం

పరీక్షిత్తుడు శుకయోగితో సృష్టి పొందిన జీవులు ఎటువంటి కర్మలతో ఎటువంటి లోకాలు పొందుతారు? వారికి శరీరాలు ఎలా కలుగుతాయి? లోకాల పుట్టుక, ఇతరత్రా వివరాలు చెప్పమని కోరుతాడు.

అంతట శుకయోగి ఇలా చెప్పడం మొదలుపెడతాడు….
సృష్టికి పూర్వం హరి నాభి కమలంలో నుంచి పుట్టుకొచ్చిన బ్రహ్మ ఆ కమలానికి మూలమేమిటో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ కమలం చుట్టూ ఉన్న నీటిలో తిరిగి తిరిగి బ్రహ్మ మళ్ళీ కమలంలోకే చేరుకుంటాడు. సృష్టి కోసం తపిస్తాడు. అయితే సృష్టి ఏ విధంగా చేయాలో తెలీక ఆలోచనలో పడతాడు. అంతా అయోమయమే. ఆ స్థితిలో అతనికి ఓ శబ్దం వినిపిస్తుంది. అదేమిటంటే తప అనే మాట. అంతే మరుక్షణం బ్రహ్మ ప్రాణాయామంతో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయడం మొదలు పెడతాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వైకుంఠపుర దర్శన భాగ్యం కల్పిస్తాడు. ఆక్కడ సూర్య చంద్రుల వెలుగుని మించిన వెలుగు చూస్తాడు. అక్కడి భవనాలన్నీ ధగధగలాడుతుంటాయి. రకరకాల చెట్లతో ప్రాంతమంతా చిత్రాతిచిత్రంగా కనిపిస్తుంది. అక్కడి కొలనులో రాజహంసల సౌందర్యాన్ని చూస్తాడు. వికసిత పద్మాలపై వాలిన తుమ్మెదలు మకరందాన్ని సేవిస్తూ ఆకలిని తీర్చుకోవడం చూస్తాడు. వాటి ఝుంకారాలు వినిపిస్తాయి. రామచిలకలూ, శారికలూ, కోకిలలూ ఇలా ప్రతి పక్షీ హరినామస్మరణ చేయడం వింటాడు. తుమ్మెదల ఝుంకారాలలో వినిపించే శబ్దాలూ బ్రహ్మను ఆలోచనలో పడేశాయి. వైకుంఠపురం ఎంతో సుందరంగా అలరారుతూ కనిపించింది. అంతేకాదు, సునందుడు, నందుడు తదితరులు హరిణి సద్భక్తితో సేవించడం చూస్తాడు. వీరి మధ్య హరిని దర్శిస్తాడు. లక్ష్మీదేవితో ఆలంకృతుడైన విష్ణుమూర్తి సూర్య చంద్రులనే రెండు నేత్రాలుగ చేసుకుని కనిపించాడు. విశ్వాన్ని సృష్టించే శక్తి కలిగిన బ్రహ్మకు తీరా ఉత్పత్తి స్థానం హరి నాభికమలమే కదా….విష్ణుమూర్తికి శేషుడే శయనం. గరుత్మంతుడు వాహనం. విష్ణుమూర్తిని కనులారా దర్శించుకున్న బ్రహ్మ అతని పాదాలను వోత్తుతున్న లక్ష్మీదేవిని చూస్తాడు. విష్ణుమూర్తిని చూడటంతోనే బ్రహ్మ పులకరించిపోతాడు. అతని పాదాలకు నమస్కరిస్తాడు.

అప్పుడు, విష్ణువు బ్రహ్మను దగ్గరకు తీసుకుని అతని ద్వ్హాన్ని స్పృశిస్తాడు. కపట మునుల తపస్సుకు నేను లొంగను. అసలు వారి తపస్సుకు స్పందించను. కానీ నీ తపస్సు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా సూచనమేరకే నీ తపస్సు సాగింది. తపస్సు ఓ వృక్షంలాంటిది. దాని ఫల స్వరూపాన్ని నేనే. తపస్సుతోనే నేను ఈ జగత్తును నడిపిస్తాను. తపస్సు నా భక్తికి మూల బిందువు. ఆ విషయం నీకు తెలిసింది కనుకే తపస్సు చేసావు….మొహకర్మలూ పోయాయి. నీకు వరమిస్తాను. ఏం కావాలో కోరుకో…” అంటాడు.

విష్ణుమూర్తి మాటలు విని బ్రహ్మ నీ మాయ అసామాన్యం. నీ మహిమ తెలుసుకోగల జ్ఞానం నాకు ప్రసాదించు. ఈ సృష్టిని కలిగించే సమయంలో నాకు అహంకారం రాకుండా చూడు.
విష్ణువు సరే అంటాడు.

(మిగతా తరువాయి తదుపరిభాగంలో)
యామిజాల జగదీశ్

Scroll to Top