మన సంస్కృతి మూలాలను వెతుక్కుంటూ ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరంలో దేశం కాని దేశంలో పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతిపై అభిమానంతో, మమకారంతో సాంప్రదాయబద్ధంగా మేళ తాళాలతో అమ్మవారి పండగను నిబద్ధతతో జరుపుకోవడం ముదావహం. బహుళ సంస్కృతికి పట్టంగట్టే ఆస్ట్రేలియా దేశంలో అరవై ఏళ్ల తెలుగువారి సత్సంప్రదాయాలకు అద్దం పట్టి మన ఉనికిని కాపాడుకోవడానికి వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఇటువంటి పండగలు ఎంతో ఉపయోగపడతాయి. అద్భుతమైన ఈ కార్యక్రమం మెల్బోర్న్ జాతర సంస్థ అధ్వర్యంలో టార్నీట్ లోని శ్రీ శివ విష్ణు మందిరంలో ఈనెల 7వ తేదీ ఆదివారం అంగరంగ వైభోగంగా జరిగింది.
బోనాలు పండగ గురించి:
బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
భోజనం అని అర్థం కలిగిన బోనం (భోజనం – ప్రకృతి, బోనం – వికృతి) దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.
జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండుగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.
మెల్బోర్న్ జాతర ముఖ్య లక్ష్యాలు:
రాకేష్ సిద్దగోని మరియు నందన్ పుస్కర్ వారి అధ్వర్యంలో ‘మెల్బోర్న్ జాతర’ సంస్థ స్థాపించి తెలుగు వారందరూ కుటుంబ సమేతంగా భక్తి ప్రపత్తులతో ప్రతీ ఏటా బోనాలు పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన దంపతులందరూ కుంకుమార్చనలో పాల్గొని ఎంతో సంతోషం వ్యక్తపరిచారని మెల్బోర్న్ జాతర వ్యవస్థాపకులు శ్రీ రాకేశ్ గారు చెప్పారు. ఇందులో పిల్లలు పాల్గొనడం మరింత ఆనందాన్నిచ్చిందని, మన సంస్కృతీ సాంప్రదాయాలు తరువాతి తరం వారికి అందివ్వాలన్న తపన కొంతవరకు సఫలమైందని రాకేష్ అన్నారు.
గత పదేళ్లుగా ఈ పండగ మెల్బోర్న్ నగరంలో వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది మొదటి సారి టార్నీట్ లోని శ్రీ శివ విష్ణు మందిరంలో సంప్రదాయబద్ధంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో, కుంకుమార్చనతో పూజలు జరిపి ఊరేగింపుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెల్బోర్న్ నగరంలోని వివిధ ప్రాంతాలనుండి సుమారు 500 మంది పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి చాలామంది వ్యాపారవేత్తలు వివిధ రకాలుగా సహాయ సహకారాలందించారు.
వ్యాపార సంస్థల జాబితా:
1. Metronest Homes
2. LoanzHub
3. Agency HQ
4. RV Tax & Loans
5. Alamanda Café & Bistro
6. Shrees Fashion
ఈ కార్యక్రమానికి వేదికగా నిలచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన శ్రీ శివ విష్ణు మందిరానికి శ్రీ రాకేష్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది స్వచ్చంద సేవకులు సహాయం చేసారని, వారివలనే ఇంతటి మహత్కార్యం చేయగలిగామని వారందరికీ మనఃపూర్తిగా కృతజ్ఞతాభినందనలు తెలిపారు.