సాలూరి రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకరు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది. ఈనెల 25 ఆయన వర్ధంతి సందర్భంగా ఒకసారి ఆయనని గుర్తుచేసుకుందాం….
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శివరామపురం గ్రామంలో 11అక్టోబర్ 1922 సంవత్సరంలో సాలూరి రాజేశ్వరరావు జన్మించారు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “సరిగమలు” దిద్దారు. సన్యాసిరాజు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలో మృదంగంపై సహకరించిన కళాకారుడు. అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవారు.
హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు కార్యక్రమాలకు రాజేశ్వరరావు క్రమం తప్పకుండా వెళ్ళేవారు. ఆయనవద్ద హరికథలు చెప్పడంలో శిక్షణ తీసుకొని అప్పుడప్పుడు పెళ్లి పందిళ్ళలో హరికథలు చెప్పేవారు. ద్వారం వారి శిష్యరికంలో త్యాగరాయ కృతులు, వర్ణాలు నేర్చుకున్నారు. నవమి ఉత్సవాలకు ఈ బాల రాజేశ్వరరావు పల్లెటూర్లలో హరికథా కాలక్షేపం చేసేవారు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! “ఆ తోటలోనొకటి ఆరాధనాలయము”, “తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని”, “పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల”, “కలగంటి కలగంటి” లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టారు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించారు. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరావు ఆఫ్ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.
సాలూరి సంగీత ఖ్యాతి సినీ నిర్మాణ కేంద్రమైన మద్రాసు నగరానికి చేరడానికి మరెంతో కాలం పట్టలేదు. ఇతని గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ (వేల్ పిక్చర్స్) రెండవ చిత్రానికి, (శ్రీకృష్ణ లీలలు,1935), ఇతనిని “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పారు. ఆ చిత్రంలో, ముఖ్యంగా, కంసునితో (వేమూరి గగ్గయ్య) సంవాద ఘట్టంలో, గగ్గయ్యలాంటి ప్రఖ్యాత కళాకారునికి దీటుగా ఆయన పాడినపద్యాలు (”ఔరలోక హితకారి”,”దీనావనుడనే”, “ప్రణతులివె”,”మేనల్లుళ్ళని”) వింటుంటే పదమూడేళ్ళ వయసులోనే సాలూరి సంగీత ప్రతిభ ఎంతటిదో తెలుస్తుంది.
“వేల్” వారి శశిరేఖాపరిణయం (మాయాబజార్ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ) పాడారు. ఆ చిత్రం పూర్తయిన తరువాత మరొక చిత్రంలో నటించేందుకై కలకత్తాకు చేరుకోవడంతో ఇతని జీవితంలో మరో ముఖ్య ఘట్టం మొదలయ్యింది. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది. అదే, కలకత్తాలో, “న్యూ థియేటర్స్ సంగీతత్రయం”తో (ఆర్.సి.బోరల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్) పరిచయాలకు, ప్రముఖ గాయకుడు కె.ఎల్.సైగల్ వద్ద శిష్యరికానికి దారి తీసింది. ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన రాజేశ్వరరావు సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నారు. ఆయన తదుపరి సంగీత సృష్టిలో అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (“విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు. మరికొద్ది కాలానికి చిత్రపు నరసింహరావు దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించారు. అయితే ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).
సాలూరిలోని సంగీతదర్శక ప్రతిభను కూడా గుర్తించిన రామబ్రహ్మం “ఇల్లాలు”లో కొన్ని పాటలు చేసే అవకాశం కల్పించారు. రాజేశ్వరరావు కట్టిన వరసలు రామబ్రహ్మం చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బి.ఎన్.ఆర్ కు (భీమవరపు నరసింహారావు, మాలపిల్ల (1938), రైతుబిడ్డ (1939) అమితంగా నచ్చడంతో ఆయన పక్కకు తొలిగి సాలూరినే అన్ని పాటలు చేయమని కోరారు. ఆ చిత్రం ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా ఈయన చేసిన పాటలు పలువురి ప్రశంసలనందుకొన్నాయి.
ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయమైంది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించారు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో చాటిచెప్పారు.
సాలూరి, బాలసరస్వతుల స్వరమైత్రికి నిదర్శనంగా ఎన్నో మధురగీతాలను చెప్పుకోవచ్చు. వీరిరువురి గానమాధుర్యానికి ముగ్ధులై తెలుగునాట మూగ గొంతులు సైతం మారుమ్రోగి కొద్దోగొప్పో పాడనేర్చాయి. వారిరువురి కొత్త రికార్డు ఎప్పుడు వస్తుందా అని ఆకాలపు శ్రోతలు ఎదురు చూసేవారు. ఆంధ్రదేశంలో సంగీతరంగానికి నలభయ్యవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారొక యెనిమిదేళ్ళపాటు రాజేశ్వరరావు, బాలసరస్వతులు రాజ్యమేలారంటే అతిశయోక్తి కాదు.
ఇంక తానే బాణీలు కట్టుకొని, మధురంగా, సున్నితంగా ఆలపించిన “చల్లగాలిలో యమునాతటిపై”, “పాట పాడుమా కృష్ణా”, “గాలివానలో ఎటకే వొంటిగ”, “ఓహో విభావరి”, “ఓహో యాత్రికుడా”, “ఎదలో నిను కోరితినోయి”, “షికారు పోయిచూదమా”, “హాయిగ పాడుదునా చెలీ” వంటి పాటలు ఈనాటికీ సంగీతప్రియుల గుండెల్ని పులకరింపజేస్తున్నాయి.
సాలూరికి మంచి అవకాశం రావడంతో “జెమిని” సంస్థలో చేరి, జీవన్ముక్తి (1942) నుంచి మంగళ (1951) వరకు, ఆ సంస్థకు ఆస్థాన సంగీతదర్శకుడిగా పనిచేశారు. “జెమిని”లో పని చేస్తున్న కాలంలోనే అడపదడపా రేడియోవారి నాటకాలకు, సంగీతరూపకాలకు కూడా వరసలు కట్టడం, పాటలు పాడడం చేస్తుండేవాడు. “మోహినీ రుక్మాంగద” (1942, శ్రీశ్రీ రచన) లాంటి నాటకాలకు అందించిన సంగీతం ద్వారా ఆయన అనుభవశాలియైన సంగీత దర్శకుడనిగా నిరూపించుకున్నారు. సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951).“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954)…ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.
శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్ బందీలు, పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా చెప్పుకొంటారు. 20 – 30 వయొలిన్లు ఒకేసారి వాడిన సందర్భాల్లో ఏ వొక్క వయొలిన్ తప్పు పలికినా ఆ నంబరును చెప్పి మరీ గుర్తించే వారని అంటారు. మరో పర్యాయం అతను అడిగిన గమకాన్ని పలికించక పోగా, అది అసాధ్యం అన్న వాద్యకారునికి ఈయనే వెంటనే వయొలిన్‌ను అందుకొని అదే గమకాన్ని పలికించారు. ఇదెలా సాధ్యపడిందని ఆశ్చర్యపోయేవారికి, ఆయన నిత్యం విద్యార్థిగానే కొనసాగారని చెప్పాలి. బాల్యంలోనే తబలా, ఢోలక్, మృదంగం, హార్మోనియం నేర్చిన సాలూరి, తరువాత కలకత్తాలో సితార్, సుర్బహార్ అధ్యయనం చేశారు. ఆ తరువాత పియానో, మాండలిన్, ఎలెక్ట్రిక్ గిటార్ వాయించడంలో కూడా పరిణతి సాధించారు. ఇలా పలు వాద్యాలలో ప్రవేశం ఆర్కెస్ట్రేషన్ నిర్వహణలో ఈయనకు ఎంతో సహాయపడింది. వందలాది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా తాను స్వయంగా సంగీత ప్రధానమైన పాత్రల్లో నటించారు.
సాలూరు రాజేశ్వరరావుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 1979లో డాక్టరేటుతో పాటు కళాప్రపూర్ణ బహూకరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్గా నియమించుకుంది. ఇదే కాలంలోనే ఈయన స్వరపరచిన అన్నమయ్య కీర్తనలను ఘంటసాల పాడారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదును ఇచ్చి సత్కరించింది. సాలూరి రాజేశ్వరరావు 25 అక్టోబరు 1999 న చెన్నై లో కాలధర్మం చెందారు.