స్థూలకాయం కాదు ఆరోగ్యానికి క్షేమం!

శరీరంలో కొవ్వు పదార్థాలు అవసరమైన దానికంటే అధిక స్థాయిలో ఉండి శరీరానికి హానికరంగా మారితే ఆ వ్యాధిని స్థూలకాయం అంటారు. మనిషికి రోజుకి సాధారణంగా 2,400 కేలరీలు అవసరమవుతాయి. మనం దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకొని.. అందుకు తగ్గట్టుగా పని చేయకపోతే ఆ అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా మారతాయి. అలా రోజుకి కొంచెం కొంచెంగా కొవ్వు నిల్వలు పెరిగి, శరీరం బరువు పెరిగితే ఊబకాయం సమస్య వస్తుంది.
కారణాలు
– ఊబకాయానికి అనేక కారణాలు ఉన్నాయి. నేటి జీవన విధానంలో పని ఒత్తిడి ఇందుకు ముఖ్యకారణం.
– సమయం లేకపోవడం వల్ల, బద్ధకం వల్ల వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం.
– ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటూ.. పీచుపదార్థాలను తగ్గించడం.
– కొందరు మహిళల్లో గర్భధారణ సమయంలో పెరిగిన బరువు ప్రసవం తర్వాత తగ్గకపోవడం.
– కొంతమందిలో పొగ తాగడం ఆపేసిన తర్వాత ఊబకాయం వస్తుంది.
– మానసిక సమస్యలవల్లా బరువు పెరుగుతారు. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చినా.. కొంచెం ఒత్తిడికి గురైనా, చిరాకుగా ఉన్నా.. ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఈ ఆందోళనలో తినే అలవాటూ కొంతమందికి ఊబకాయం వస్తుంది.
– ఎక్కువగా మందులు వేసుకునే వారిలో ఇది వచ్చే ప్రమాదం ఉంది. స్టెరాయిడ్స్‌ వాడకం వల్ల, డిప్రెషన్‌కు, ఫిట్స్‌కి వాడే మందులు ఎక్కువకాలం వేసుకోవడం వల్లా ఊబకాయం వస్తుంది.
– నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో గ్రేలిన్‌, లెప్టిన్‌ అనే రసాయనాలు ఉత్పత్తి కావడం, ఆకలికి సంబంధించిన హార్మోన్ల మధ్య బ్యాలన్స్‌ తప్పడం వల్లా స్థూలకాయం వస్తుంది.
– మరి కొందరిలో జన్యు సంబంధిత కారణాల వల్లా రావొచ్చు. వారి కుటుంబంలో ఎవరైన లావుగా ఉండటం.. అంటే జన్యుపరంగా వస్తుంది..
– హైపొ థైరాయిడ్‌, పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ వంటి ఇతర హార్మోన్ల అసమతుల్యతవల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

సమస్యలు
ఊబకాయం మన శరీరంలో వివిధ అవయవాలను దెబ్బతీస్తుంది . అందులో ముఖ్యంగా ….
– గుండెజబ్బులు రావటం, గుండె పోటు, కీళ్ళ జబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటివి రావొచ్చు.
– కొన్నిసార్లు కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స చేయుంచుకోవాల్సి ఉంటుంది.
– క్యాన్సర్‌, పేగు, గర్భసంచి, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
– నిద్రలేమి, నిద్ర మధ్యలో ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల అబిస్ట్రిక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా వస్తుంది.
– పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి.
– మహిళల్లో రుతుక్రమం తప్పడం, పిల్లలు కలగకపోవడం వంటి సమస్యలకూ ఇది దారితీస్తుంది.
నిర్ధారణ- నివారణ
ఊబకాయాన్ని సులభంగా గుర్తించొచ్చు. శరీర బరువు, ఎత్తును పరిగణనలోకి తీసుకుని బాడీ మాస్‌ ఇండెక్స్‌ ద్వారా బరువు ఎంత ఎక్కువ ఉన్నారో తెలుసుకోవచ్చు. నివారణకు ఎక్కువగా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ బరువు తగ్గాలి. వ్యాయామం చేస్తూ.. డైటీషియన్‌ పర్యవేక్షణలో ఆహారాన్ని కంట్రోల్‌ చేయాలి. షుగర్‌, బిపి, మరే రకమైన ఇతర వ్యాధులున్నా, వ్యాయామంతో ప్రయత్నించాలి. దీనివల్ల బరువు తగ్గకపోయినా.. బేరియాట్రిక్‌ సర్జరీ ద్వారా బరువు తగ్గొచ్చు. ఇది ఆఖరి అవకాశంగా ఉండాలి.
బేరియాట్రిక్‌ సర్జరీ అంటే .?
లాప్రోస్కోపిక్‌ విధానం ద్వారా పెద్ద కోతలు లేకుండా బరువు తగ్గించడాన్ని బేరియాట్రిక్‌ సర్జరీ అంటారు. దీనిలో ఆహారం తక్కువగా తీసుకోనేలా.. తిన్న ఆహారంలో కొంతమేరకు మాత్రమే శరీరం గ్రహించేలా.. వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేస్తారు. వీటిలో రెగ్యులర్‌గా చేసే బేరియాట్రిక్‌ శస్త్ర చికిత్సలు, గాస్ట్రిక్‌ బైపాస్‌, స్లీవ్‌ గ్యాస్ట్రిక్టమి, మినీ గ్యాస్ట్రిక్‌ బైపాస్‌, గ్యాస్ట్రిక్‌ బెలూన్‌, డుయోడినల్‌ స్విచ్‌ ముఖ్యమైనవి. ఈ శస్త్ర చికిత్సల్లో రోగి బరువును, వారికి ఉన్న ఇతర జబ్బులను బట్టి, ఆహారపు అలవాట్లను తెలుసుకుంటారు బేరియట్రిక్‌ సర్జన్‌. అన్ని పరిశీలించిన తర్వాత రోగికి అనువైన విధానం గురించి వివరిస్తారు.

లాభాలు – నష్టాలు
ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా చేసే శస్త్రచికిత్సలు కీ హోల్‌ విధానం ద్వారా చేస్తారు. వాటివల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి.
స్లీవ్‌ గ్యాస్ట్రిక్టమి : ఈ శస్త్రచికిత్సలో 75 శాతం ఉదరాన్ని తొలగించి, ఒక అరటిపండు ఆకారంలో ఉండే ఉదరాన్ని ఉంచుతారు. అందులో ఒక్కసారిగా 80-150 ఎం .ఎల్‌ పరిమాణంలో ఆహర పదార్థాలను మాత్రమే తీసుకోగలుగుతారు. ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్‌ హార్మోన్‌నూ తొలగించిన భాగంలో ఉండేలా చూస్తారు. దీనివల్ల తక్కువ మోతాదులో తింటారు. ఆకలి కూడా అనిపించదు. ఇది మిగిలిన బేరియట్రిక్‌ శస్త్రచికిత్సలన్నింటి కంటే తక్కువ రిస్కుతో కూడుకున్నది. దీనివల్ల అధిక బరువు 70 శాతం వరకూ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్‌ టైం తక్కువగా ఉంటుంది. తొందరగా ఇంటికి వెళ్లవచ్చు. విటమిన్‌, మినరల్స్‌ లోపం ఈ శస్త్రచికిత్సలో చాలా తక్కువగా ఉంటుంది. షుగరు ఇతర సంబందిత వ్యాధులనూ తగ్గించవచ్చు.
గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ : ఈ శస్త్రచికిత్సను అత్యధికంగా బరువు ఉన్న వారికి చేస్తారు. అనగా బి ఎం ఐ 50కి దగ్గరగా ఉన్నవారిలో ఈ శస్త్రచికిత్స ద్వారా బరువును చాలా తగ్గించవచ్చు. ఇందులో ఉదరాన్ని చాలా చిన్నదిగా చేసి, దానిని చిన్నపేగుకు కలుపుతారు. డైజెషన్‌ ఎంజైమ్స్‌, చిన్నపేగు మరొక భాగంలో కలిసేలా అమర్చుతారు. దీనివల్ల తీసుకునే ఆహారం గమనాన్ని మళ్లించి.. తక్కువ అబ్జర్వ్‌ అయ్యేలా చూస్తారు. విటమిన్లు, మినరల్స్‌ లోపం కలగకుండా మాత్రలు వాడాలి. కొంతమందిలో శరీరం లోపల హెర్నియాలు వచ్చే ప్రమాదం ఉంది.
మినీ గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ : మొదట చెప్పిన రెండింటి మధ్యలో ఫిట్‌ అయ్యే శస్త్రచికిత్స ఇది. దీనిలో ఉదరాన్ని కొంతభాగం ఉంచి, చిన్నపేగును అవసరాన్ని బట్టి 200-250 సెంటీమీటర్లు బైపాస్‌ చేసి, ఉదరంతో కలుపుతారు. దీనిలోనూ చాలా బరువును తగ్గించవచ్చు. వివిధ పరిశోధనల ప్రకారం బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సకు భయపడాల్సిన అవసరం లేదు. అనుభవం కలిగిన వారితో శస్త్రచికిత్స చేయించుకుంటే, అనర్థాలు చాలా తక్కువగా ఉంటాయి. తగిన ఆహార నియమాలు, వ్యాయామంతో ఈ సమన్య నుంచి బయటపడలేకపోతే, అంతిమంగా శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించుకోవచ్చని గుర్తించాలి.

Scroll to Top