Thalassemia
తలసేమియా.. అంటే గ్రీకు భాషలో సముద్రం అని అర్థం. మనకు మాత్రం ఇదో వ్యాధి అనే విషయం తెలుసు. వ్యాధిగ్రస్తుల కష్టం సముద్రమంత పెద్దది. అందుకే దానికి ఆ పేరు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఆవహించే ఈ మహమ్మారి.. పుట్టిన మరుక్షణం నుంచే నరకం చూపిస్తుంది. ఒకసారి ఆపరేషన్ చేస్తే సమసిపోయే సమస్య కాదు.. జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిస్తున్నాడు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న యువతీయువకులు తలసేమియాపై అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు.
తలసేమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. తలసేమియా పిల్లల జీవితాలు పౌర్ణమి – అమావాస్యలను తలపిస్తాయి. ఒంటినిండా రక్తం ఉన్నప్పుడు.. బిడ్డ పున్నమి చంద్రుడిలా కళకళలాడుతుంటాడు. హుషారుగా కన్పిస్తాడు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతాడు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి ఇది. దురదృష్టం ఏమిటంటే.. ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసేమియా జన్యువాహకులైన తల్లిదండ్రులకు (తలసేమియా మైనర్) జన్మించే బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్తులయ్యే (తలసేమియా మేజర్) అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసేమియా వాహకులు ఉన్నారు.
సమస్య ఏంటంటే..:? పీల్చుకునే ప్రాణవాయువును రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్‌దే. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. తయారైనా ఎక్కువకాలం మనలేదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే ప్రాణం పోతుంది. ఏటా భారత దేశంలో 12000 చిన్నారులు తలసేమియాతో పుడుతున్నారు.
చికిత్స … తలసేమియా రోగులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి. మరోదారి లేదు. నెలనెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్ ఫిల్టర్స్ వాడాలి. క్రమం తప్పకుండా దంత, గుండె, మూత్రపిండాల, కాల్షియం, ఫాస్పరస్ స్థాయిలను తెలిపే పరీక్షలూ చేయిస్తుండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పుడే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే ఏదో ఓ రోగం వస్తుంది. తలసేమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ.
thalassaemia
అవగాహన చాలా అవసరం
దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న యువతీయువకులు తలసేమియాపై అవగాహన పెంచుకోవాలని బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ పిలుపునిస్తున్నారు. ఆరోగ్యకరమైన కుటుంబం కోసం ముందుగానే తలసేమియాను గుర్తించే రక్తపరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో తలసేమియాపై అవగాహన కల్పించే ప్రచారకర్తగా కొనసాగుతున్న జాకీష్రాఫ్ ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు తలసేమియాకు సంబంధించిన నిజాలు తెలుసుకోవాలి. తాము వాహకులం కాదని నిర్ధారించుకున్నాకే బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధం కావాలి. ఇందుకోసం వైద్యశాస్త్రంలో ఎన్నో మార్గాలున్నాయి. అలా కాదని నిర్లక్ష్యం చేస్తే.. పుట్టబోయే బిడ్డ మాత్రమే కాదు.. తల్లిదండ్రులు కూడా నరకాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నారు.