జీర్ణ‌వ్య‌వ‌స్థపై మానసిన ఒత్తిడి ప్రభావం

జీర్ణ‌వ్య‌వ‌స్థని అస్తవ్యస్థం చేసే మానసిన ఒత్తిడి

stress and digestionశరీరంలోని జీవవ్యవస్థల్లో అత్యంత కీలకమైనది జీర్ణవ్యవస్థ. ఇది ఏమాత్రం గతి తప్పినా రకరకాల ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. మానసిక ఒత్తిడీ జీర్ణవ్యవస్థని ప్రభావితం చేస్తుంటుంది. దీని ఫలితంగా తలెత్తే సమస్యనే ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) అని వ్యవహరిస్తుంటారు. పాతికేళ్లు దాటిన ఎవరికైనా ఇది ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇది మహిళల్లో ఎక్కువగా వచ్చేదని భావించేవారు. అయితే ఇప్పుడు అలాంటి బేధమేమీ లేకుండా పురుషుల్లోనూ వస్తోంది. కడుపులో కలిగే భిన్నమైన మార్పులతో ఇబ్బందిపెట్టే ఈ సమస్య ప్రమాదకరమైనది కాకపోయినా.. దైనందిన జీవితాన్ని పలుమార్పులకు గురిచేస్తుంది. దీర్ఘకాలంపాటు వేధించే ఈ సమస్య వల్ల కొందరు ఉద్యోగ వేళలు మార్చుకోవటం లేదా ఇంటి నుంచి పనిచేయడం, అరుదుగా కొందరు పూర్తిగా ఉద్యోగమే మానుకుని, ఇంటికే పరిమితమై పోతుంటారు. జీవనశైలిని ఇబ్బందికి గురిచేసే ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)వివరాలు తెలుసుకుందాం.

ఐబీఎస్‌తో బాధపడేవారికి శరీరంపై బాహ్యంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. చూడడానికి అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపిస్తుంటారు. కానీ ఎదైనా తిన్నా, తాగినా కడుపులో అల్లకల్లోలం మొదలవుతుంది. ఇందులోనూ చాలా రకాలున్నాయి. ఐబీఎస్‌తో పాటు కొంతమందిలో మలబద్ధకం, మరి కొంతమందిలో అతిసారం, ఇంకొంత మందిలో మలబద్ధకం, అతిసారం వంటి లక్షణాలు కలగలిసి ఉంటాయి.

శరీరంలో చోటుచేసుకునే కొన్ని మార్పులే ఐబీఎస్‌కు కారణమవుతున్నాయని అధ్యయనాల వల్ల తేలింది. పెద్దపేగు సున్నితంగా మారినా, అది స్వల్ప ప్రేరణలకే ఎక్కువగా స్పందిస్తున్నా ఐబీఎస్‌ మొదలవుతుంది. మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు, కొన్నిరకాల ఆహార పదార్థాల వల్ల వచ్చే అలర్జీలు, ఐరన్‌ మందులు, కొన్ని యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్ల వల్లా ఐబీఎస్‌ వచ్చే అవకాశముంది.
మెదడు నుండి పెద్ద పేగులకు వచ్చే సంకేతాలలో అసాధారణ మార్పుల వల్ల.. కొందరిలో ఆహారం కారణంగా పెద్ద పేగుల్లోని కండరాలు అసాధారణంగా స్పందించటం వల్ల.. మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, గాబరా, టెన్షన్‌ వలన ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కోపం లేదా బాధను అణుచుకోవడం దానివల్ల కలిగే ఒత్తిడి, సమయానికి అహారం తీసుకోకపోవడం, మద్యం తాగడం, ధూమపానం లాంటి వ్యసనాలు కూడా జీర్ణవ్యవస్థని ప్రభావితం చేసి, ఐబీఎస్‌కు కారణమవుతాయి. ఇది ఉన్న చాలామందిలో పేగుల్లో మెలిపెట్టినట్టు నొప్పి, గుండెల్లో మంట కూడా ఉంటుంది. కొంతమందిలో ఈ లక్షణాలతో పాటు నొప్పిలేకుండానూ ఐబీఎస్‌ వస్తుంది. అలాంటి పరిస్థితిలో వారు అర్జెంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్ర లేవగానే టాయిలెట్‌కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. అయితే ఐబీఎస్‌ క్యాన్సర్‌ కారకం కాదు, ప్రాణాంతకమూ కాదు. కానీ చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు చెప్పుకోలేని సమస్యగా ఉంటుంది. ఫంక్షన్లలోనూ, ప్రయాణాలలో వీరికి చాలా ఇబ్బందిగా ఉండి, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఈ సమస్య కోసం చేయించే పరీక్షలు దాదాపు నార్మల్‌గానే వస్తుంటాయి.

లక్షణాలు
ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కో రకంగా ఐబీఎస్‌ లక్షణాలుంటాయి.
* రోజు మొత్తంలో ఎక్కువ సార్లు విరేచనాలు అవుతుంటాయి.
* కొంతమందిలో మలబద్ధకంగా ఉండి, పొట్టంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది.
* మలం కూడా పల్చగా, గట్టిగా, మెత్తగా లేదా నీళ్లలా మారుతూ ఉంటుంది.
* కొన్నిసార్లు మలబద్ధకం వేధిస్తే, కొన్నిసార్లు విరేచనాలు విసిగిస్తాయి.
* పొట్టలో నొప్పి, శబ్దాలు ఉంటాయి. గుండెల్లో మంట ఉంటుంది.
* జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం, మలం గట్టిగా లేదా కష్టంగా ఉండటం మలవిసర్జన సమయంలో రక్తం పడటం, లేదా మ్యూకస్‌ పడుతుంటుంది.
* చిన్న పేగులో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉంటే నోటి దుర్వాసన లేదా శరీర దుర్గంధం కలుగుతుంది.
* ఉదయం లేవగానే త్వరగా విసర్జనకు వెళ్లాల్సి రావడం. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం వంటివి ఐబీఎస్‌లో సర్వసాధారణమైన లక్షణాలు.
* ఆకలి తక్కువగా ఉంటుంది. నడుము నొప్పి వస్తుంటుంది.
* అలర్జీ కలిగించే ఆహారమేదైనా తిన్న గంటలోపు కడుపుబ్బరం ఏర్పడుతుంది.
* చాలా మందిలో దీర్ఘకాల జ్వరాలు, ఇతర వ్యాధులు, మానసిక ఆందోళన, కుంగుబాటు వంటివీ ఉంటాయి.
* పొట్టలో అధికంగా గ్యాస్‌ తయారవడం, పొట్టవాపు కూడా ఈ సమస్య లక్షణాల్లో ఒకటి.
* ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌ వాడటం, జన్యుపరమైన కారణాలు ఫంగస్‌ లేదా ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తాయి.
* నిద్ర సరిగా రాకపోవడం, శరీరం అలసటగా ఉండడం, అప్పుడప్పుడూ చేతుల్లో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* ఇంకా కొంతమందిలో ఈ లక్షణాలతో పాటు తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉంటాయి. ఈ లక్షణాలన్నింటినీ బట్టి ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌గా పిలుస్తారు.

నిర్ధారణ
ఐబీఎస్‌ నిర్ధారణకు ప్రత్యేకమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. రోగి చెప్పే లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా? లేదా? చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా? అనే వివిధ అంశాల ఆధారంగా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్థారణ చేస్తారు. దాంతో పాటు మల పరీక్ష, పూర్తిస్థాయి రక్తపరీక్ష, ఈఎస్‌ఆర్‌, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్‌, సిగ్‌మోయిడోస్కోపి, కోలనోస్కోపి, ఎండోస్కోపి, హైడ్రోటన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.

చికిత్స
ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ చికిత్సకోసం అన్నిరకాల మందులూ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి కారణంతో ఐబీఎస్‌ వచ్చినా…. ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే దుష్ప్రభావాలు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్‌ వస్తే దాన్ని కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకూ శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఉంది.

ఇవి పాటిస్తేనే ఐబీఎస్‌కు నివారణ
* రోజూ తినే ఆహారంలో తేలికగా జీర్ణమయ్యే పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.stress-digestion connected
* ఒత్తిడి తగ్గించుకోవాలి. పొగ తాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి.
* రోజుకు ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి.
* కెఫీన్‌ ఉండే కాఫీ, టీలు, సోడాలు, కూల్‌డ్రింక్స్‌ పూర్తిగా మానేయాలి.
* ఎక్కువగా జీర్ణాశయాన్ని ప్రేరేపించే పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు.
* ఆహార పదార్థాల్లో ఎక్కువ మసాలాలు, అతి కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
* చల్లని లేదా అతి వేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
* పీచు ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయలు, నట్స్‌, ధాన్యాలు తీసుకోవాలి.
* రోజుకి ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
* టాయిలెట్‌కి వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* వ్యక్తిగత పరిశుభ్రతని తప్పనిసరిగా పాటించాలి.
* ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయాలి.
* పాల ఉత్పత్తుల వాడకం తగ్గించాలి.
* ధూమపానం, మద్యపానం వంటి వాటిని దూరం పెట్టాలి.
* తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.
* తినే ఆహారపదార్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి.
* బయటి ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేయాలి.

Scroll to Top