శరీరంలో కిడ్నీల ద్వారా జరిగే జీవక్రియ చాలా ముఖ్యమైనది. ఎప్పటికప్పుడు వ్యర్థాలను వడపోస్తూ, లవణాలు, ఖనిజాలను సమపాళ్లలో ఉంచి, నిరంతరం ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కీలకంగా ఉంటాయి. మధుమేహం, హైబీపీ, స్థూలకాయం వంటివి కిడ్నీల పనితీరును దెబ్బతీసి, వాటిని రకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. అయితే సకాలంలో గుర్తించి, తగు చికిత్సతో పాటు ఆహార నియమాలూ పాటిస్తే.. కిడ్నీల వ్యాధికి కళ్లెం వేసి.. వాటిని పదిలంగా కాపాడుకోవచ్చు.
శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని వడపోసి, వ్యర్థాలన్నింటినీ నీటితో కలిపి మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. ఇవి ఎరిత్రోపైటిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తూ, రక్తం పరిమాణాన్ని నియంత్రిస్తాయి. విటమిన్-డి ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీయం, యూరిక్ ఆమ్లం వంటి వాటిని సమతులంగా ఉంచుతాయి. ఈ పనులన్నింటినీ మూత్రపిండాలు సరిగా చేయకపోతే దాన్నే మూత్రపిండాల వ్యాధి (కిడ్నీ డిసీజ్) అంటారు. కిడ్నీల పనితీరు మందగిస్తే హానికర పదార్థాలు శరీరంలో పేరుకుపోయి, రకరకాల అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. వీటిని యూరిమిక్ లక్షణాలంటారు. మధుమేహం, అధిక రక్తపోటు రోగులకు సక్రమంగా మందులు వాడుతుంటే పెద్దగా ప్రత్యేక లక్షణాలు కనిపించవు.
లక్షణాలు
కిడ్నీ వ్యాధి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల దీని ముప్పు అధికంగా ఉండే మధుమేహం, హైబీపీ బాధితులు క్రమం తప్పకుండా మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉండి ఉంటే, వారి కుటుంబసభ్యులు కూడా తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరును పరీక్షించుకోవాలి. కిడ్నీ జబ్బు గలవారిలో మూత్రం గాఢత తగ్గిపోతుంది. అందువల్ల రాత్రిపూట కూడా మూత్రం ఎక్కువగా ఉత్పత్తవుతుంది. కాబట్టి రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం కోసం నిద్ర నుంచి లేవాల్సి వస్తుంటే కిడ్నీ వ్యాధి ఉందేమోనని పరీక్షించుకోవటం ఉత్తమం. కిడ్నీ వ్యాధి ముదురుతున్నకొద్దీ అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ పోవటం, కాళ్ల వాపు, ఆయాసం రావటం, ముఖం ఉబ్బరించటం, ఆకలి మందగించటం, మూత్రం తగ్గిపోవటం, రక్తహీనత, వికారం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. చాలా మందికి కాళ్లు, చేతుల్లో తిమ్మిరి కూడా వస్తుంది. కిడ్నీ జబ్బు మరీ తీవ్రమైతే మూర్ఛ వచ్చి, స్పృహ తప్పిపోవచ్చు. ఇలాంటి సమయంలో డయాలసిస్ చేయాలి. జీఎఫ్‌ఆర్ 10 ఎం.ఎల్. కన్నా తగ్గితే డయాలసిస్ గానీ, కిడ్నీ మార్పిడి గానీ చేయాల్సి ఉంటుంది.
కిడ్నీ వ్యాధుల్లో రకాలు
కిడ్నీ వ్యాధుల లక్షణాలను బట్టి రకరకాలుగా ఉంటాయి. మూత్రపిండాల పనితీరు హఠాత్తుగా కొద్ది KidneyProblemsరోజుల్లోనే తగ్గిపోతే ‘అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్’ అంటారు. కొన్ని వారాల్లో తగ్గిపోతే ‘ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ కిడ్నీ డిసీజ్’ అంటారు. మూడు నెలల వ్యవధిలో మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతూ వస్తుంటే ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ అంటారు. వ్యాధి బాగా ముదిరిపోయి, ప్రాణానికి హాని కలిగే స్థాయికి చేరుకుంటే ‘ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్’గా పిలుస్తారు. కిడ్నీ వ్యాధి తీవ్రతను గ్లోమెర్యూలర్ ఫిల్టరేషన్ రేటు (జీఎఫ్‌ఆర్) ఆధారంగా నిర్ధారిస్తారు. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ హఠాత్తుగా వస్తుంది కాబట్టి.. ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశాలు అధికం. అయితే కిడ్నీలు తిరిగి పుంజుకునే అవకాశం కూడా ఇందులోనే ఎక్కువ. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో క్రమంగా మూత్రపిండాల పనితీరు తగ్గుతుంటుంది. కాబట్టి దీన్ని మందులతో, ఆహార నియమాలతో నియంత్రణలో ఉంచుకోవాలి.
కారణాలు
కిడ్నీ వ్యాధులు రావడానికి రకరకాల కారణాలున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి మధుమేహం, హైబీపీలు ముఖ్య కారణాలు. మూత్రపిండాల వాపు (గ్లోమెర్యూలర్ నెఫ్రైటిస్), మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, రాళ్లు ఏర్పడటం వంటివి కూడా కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. రాళ్లు వల్ల మూత్రం సరిగా బయటకు వెళ్లక పోవడంతో ఇన్ఫెక్షన్ ఏర్పడి, కిడ్నీ వ్యాధి వస్తుంది. మూత్రం ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, అవి దెబ్బతింటాయి. వృద్ధుల్లో ప్రోస్టేట్ గ్రంథి వాపుతో కూడా కిడ్నీ వ్యాధి వస్తుంది. కొందరికి పుట్టుకతోనే ‘పాలీ సిస్టిక్ కిడ్నీ డిసీజ్’ వంటి జబ్బులుండొచ్చు. మూత్రంలో ప్రోటీన్ పోవడం వలన కూడా కిడ్నీ వ్యాధి వస్తుంది. స్థూలకాయం కూడా కిడ్నీ జబ్బుల ముప్పునకు కారణమే. స్థూలకాయంతో ఉన్న వారికి మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవేవీ లేకపోయినా కొలెస్ట్రాల్ వంటి కొవ్వుల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తుంటాయి.
నిర్ధారణ
కిడ్నీ వ్యాధులను నిర్ధారించడానికి రరకాల పరీక్షలున్నాయి.
– మూత్రంలో ప్రోటీన్ పరీక్ష ద్వారా కిడ్నీ జబ్బు ఉందో లేదోనని తెలుసుకోవచ్చు. మూత్రంలో అల్బుమిన్ రోజుకి 30 మి.గ్రా. కన్నా తక్కువ ఉండాలి. 30-300 మి.గ్రా. మధ్యలో ఉంటే మైక్రో అల్బుమి నూరియా అనీ, 300 మి.గ్రా. కన్నా ఎక్కువైతే ‘ప్రొటినూరియా’ అంటారు.
– సీరం క్రియాటినైన్‌ను పరీక్ష ద్వారా కనుగొంటారు. ఇది ఎంత ఉండొచ్చన్నది వయసును బట్టి, ఆడ-మగ తేడాలను బట్టి, శరీర నిర్మాణాన్ని బట్టి మారుతుంది. ఇది 1.2 నుంచి 1.4 లోపు ఉండాలి. అది దాటితే కిడ్నీ వ్యాధి ఉందని అనుమానించాలి. దీని ఆధారంగా – ఎఫ్‌ఆర్‌ను అంచనా వేసి, వడపోత ప్రక్రియ ఎలా ఉందో తెలుసుకుంటారు. సాధారణంగా మూత్రపిండాల్లో నిమిషానికి 100 ఎం.ఎల్. రక్తం శుద్ధి అవుతుంది. ఇది నిమిషానికి 80 ఎం.ఎల్. కన్నా తగ్గితే కిడ్నీ వ్యాధి ఆరంభమైనట్టే. ఇలా మూడు నెలల పాటు ‘జీఎఫ్‌ఆర్’ క్రమంగా తగ్గుతూ వస్తుంటే ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’గా భావిస్తారు.
– అల్ట్రాసౌండ్ పరీక్షలో కిడ్నీల పరిమాణం ఎలా ఉంది, వాటిలో రాళ్లు, నీటితిత్తులు (పాలీ సిస్టిక్ కిడ్నీ) వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. గ్లొమెరూలర్ నెఫ్రైటిస్, అధిక రక్తపోటు గలవారిలో కిడ్నీ పరిమాణం తగ్గుతుంటుంది. పాలీ సిస్టిక్ డిసీజ్‌లో, మూత్రమార్గంలో రాళ్ల వంటివి అడ్డుపడినప్పుడు కిడ్నీ సైజు పెరుగుతుంది. మధుమేహుల్లో ముందు కిడ్నీ ఆకారం పెరిగి, తిరిగి మామూలుగా అవుతుంది. వీటన్నింటినీ అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ గలవారిలో పారా థైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) ఎక్కువతుంది. కాబట్టి దీన్ని కూడా పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు సీరం క్యాల్షియం, సీరం ఫాస్ఫరస్, సీరం యూరిక్ యాసిడ్, ఆల్కలైన్ ఫాస్ఫేటైజ్ వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి.
చికిత్స
కిడ్నీ రోగులకు మధుమేహం ఉంటే గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు 120/80 ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే స్టాటిన్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అలోప్యూరినాల్ వంటి మందులు ఇస్తారు. క్యాల్షియం తక్కువుంటే క్యాల్షియం మాత్రలు ఇస్తారు. క్యాల్షియం మాత్రల మూలంగా రక్తంలో దాని మోతాదు పెరుగుతుందనే అనుమానముంటే ‘సెవలామెర్’ వంటి మాత్రలు ఇస్తారు. వీటిని భోజనంతో పాటు వేసుకోవాలి. దీంతో క్యాల్షియం, ఫాస్ఫరస్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. పీటీహెచ్ స్థాయులూ తగ్గుతాయి. పీటీహెచ్ మరీ ఎక్కువగా ఉంటే ‘సినాక్యాల్సెట్’ మందు ఇస్తారు. దీంతో రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకోవటం తగ్గుతుంది. ఎముకలు బలహీనపడకుండా చూస్తుంది. కిడ్నీ జబ్బు బాధితుల్లో ఐరన్ లోపం నివారణకు మాత్రలు, అవసరమైతే ఇంజెక్షన్లు ఇస్తారు.
కిడ్నీ మార్పిడి
Kidneydiseaseజీవించి ఉన్న దాత నుంచి గాని, బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి గాని కిడ్నీ తీసి ఆపరేషన్ ద్వారా అమర్చడమే కిడ్నీ మార్పిడి. ఇందుకు వయసు భేదం లేదు. కాని 70 ఏళ్ల కన్నా చిన్న వయసు వాళ్లు, ఆపరేషన్‌కు అనువైన ఆరోగ్యం కలిగినవాళ్లకు మాత్రమే దీనిని సూచిస్తారు. నయం చేయలేని క్యాన్సర్లు, ఇతర దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఉన్నవాళ్లకు దీనిని సూచించరు. చికిత్స చేయగల క్యాన్సర్లుంటే అది చేసిన రెండేళ్ల తర్వాత కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఇలా మార్చిన కిడ్నీ సాధారణ కిడ్నీల లాగానే అన్ని విధులనూ నిర్వర్తిస్తుంది. రోగి సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఆహార, పానీయాల విషయంలో పెద్దగా నియమాలుండవు. అయితే శరీరం ట్రాన్స్‌ప్లాంట్‌ను తిరస్కరించకుండా రెగ్యులర్‌గా మందులు వాడాలి. జీవనశైలి విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ పొగతాగడం, ఆల్కహాల్ సేవించడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
డయాలసిస్
కిడ్నీ వ్యాధి తీవ్రమైతే డయాలసిస్ అవసరం. ఇది రెండు రకాలు. హీమో డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ (సిఎపిడి). ఇవి రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీకి తాత్కాలిక చికిత్సలు. విష పదార్థాలు, ఇతర మలినాలు, అదనపు ద్రవాలు రక్తం నుంచి హీమోడయాలసిస్ ద్వారా ఫిల్టర్ అవుతాయి. దీన్ని జీవితాంతం వారంలో రెండు మూడు సార్లు ఇవ్వాలి. సిఎపిడిని పేషెంట్లు తమ ఇంట్లోనే రోజుకి 3-4 సార్లు చేసుకోవాలి. కొంతమందికి డయాలసిస్ వల్ల సమస్యలు రావు. డయాలసిస్‌లో ఉన్న రోగుల్లో ఏటా 25 శాతం మంది హార్ట్ ఫెయిల్యూర్, ఇన్ఫెక్షన్, డయాలసిస్ సమస్యల వల్ల చనిపోతున్నారు. శరీర జీవక్రియల అవసరాలకు అనుగుణంగా కేవలం మానవ కిడ్నీ మాత్రమే అన్ని విధులను నిర్వర్తించగలదు. కాబట్టి జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలన్నా, దీర్ఘకాలం మెరుగ్గా ఉండాలన్నా కిడ్నీ మార్పిడే ఉత్తమ చికిత్స. అయితే ప్రాణాపాయం తప్పించడానికి డయాలసిస్ మేలు. సరైన దాత దొరక్కపోయినా, ఆపరేషన్‌కు ఫిట్ కాకపోయినా చాలా కాలం పాటు ఒక్కోసారి జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది. కానీ కేవలం కిడ్నీ మార్పిడి వలనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి సరైన దాత దొరికితే వీలైనంత తొందరగా కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి.
ఆహార నియమాలు
– చక్కెర, బెల్లం, పిండివంటలు వంటి తీపి పదార్థాలు తక్కువగా తినాలి. బియ్యం, గోధుమల వంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
– మాంసాహారాన్ని తగ్గించాలి. బాగా నానబెట్టి లీచింగ్ చేసిన కూరగాయలు ఎక్కువగా తినాలి.
– వెన్న, నెయ్యి వంటి వాటికి బదులుగా ఆలివ్‌నూనె, చేపనూనె, అవిసెనూనె ఎక్కువగా వాడాలి..
– మాంసం కన్నా చేపలు తినడం మేలు.
– ఉప్పు చాలా తక్కువగా ఉన్న పదార్థాలనే తీసుకోవాలి.
– పొటాషియం అధికంగా ఉండే అరటి, పుచ్చ, నారింజ, కమల, బత్తాయి వంటి పండ్లను పరిమితంగా తినాలి.
– ఉప్పు, పొటాషియం అధికంగా ఉండే బేకరీ పదార్థాలు తినడం మానెయ్యాలి.
– పాలు, పెరుగు వంటి పాల పదార్థాలు పరిమితంగానే తీసుకోవాలి. పల్చటి మజ్జిగ మంచిది.
– మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే స్వభావం గలవారు మాత్రం పాలకూర, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినడం మానేయాలి. స్వీట్ల్లు తగ్గించాలి.
– గుడ్డులో పచ్చసొన తినడం మంచిది కాదు.
– అవసరమైన మేరకే నీరు తాగాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు.
– ఆహారం వండేటప్పుడు పులుపుకోసం చింతపండు బదులు పరిమితంగా నిమ్మరసం వాడాలి.
– వక్కపొడి తినడం మంచిది కాదు. కూల్‌డ్రింకులు తాగకూడదు.