తెలుగు వారికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతలా ఆయన పాటలు మన హృదయాలను పెనవేసుకుపోయాయి. సిరివెన్నెల మనందరికీ భౌతికంగా దూరమై ఇంకా ఏడాది కూడా కాలేదు. ఈ నెల 20న ఆయన జయంతి సందర్భంగా ఒకసారి స్మరించుకుందాం…
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సీతారామశాస్త్రి 1955 మే 20న సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బీఏ పూర్తి చేసిన సిరివెన్నెల కొంతకాలం రాజమహేంద్రవరంలో బీఎస్ఎన్ఎల్లో పని చేశారు.
సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. సీతారామశాస్త్రి ఇంటి పేరు మార్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్ సిరివెన్నెల చిత్రం. సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు.
విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన సిరివెన్నెల.. మొదట్లో “భరణి” పేరుతో కవితలు రాశారు. గంగావతరణం కవిత చూసి సిరివెన్నెల చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు విశ్వనాథ్.
కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే, ఆయన సినీ రంగానికి పరిచయమైంది మాత్రం అంతకు రెండేళ్ల ముందు వచ్చిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో. ఆ చిత్రానికి కూడా కె. విశ్వనాథే దర్శకుడు. తొలి సినిమాలో సీహెచ్ సీతారామశాస్త్రి (భరణి) అనే పేరుతో ఆయన ‘తడిసిన అందాలలో…’ అనే పాట రాశారు.
‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…, ఆది భిక్షువు వాడినేమి కోరేది, చందమామ రావే…’ వంటి పాటలతో తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్న సీతారామశాస్త్రి క్లాస్, మాస్ పాటలతో సినీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు.
నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో దాదాపు 800ల చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల ఉత్తమ సినీ గేయరచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. సిరివెన్నెల 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.165కుపైగా చిత్రాలకు పాటలు రాసిన సిరివెన్నెల.. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు.
సిరివెన్నెల చిత్రంతో 1986లో తెలుగు సినీ పాటల ప్రియులకు పరిచయమైన సీతారామశాస్త్రి అదే ఏడాది వంశీ దర్శకత్వం వహించిన ‘లేడీస్ టైలర్’ చిత్రంతో పాపులర్ ప్రేమ గీతాలు రాయడంలోనూ తన కలానికి అంతే పదను ఉందని నిరూపించుకున్నారు.ఇక, ఆ తరువాత ఆయన వెనుతిరిగి చూడలేదు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాలని ఎన్నో సందర్భాల్లో చెప్పిన సీతారామశాస్త్రి ఆ దిశగా చెప్పుకోదగిన కృషి చేశారు.కెరీర్ తొలిరోజుల్లో ‘సిరివెన్నెల’ సినిమాకు ఆయన రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘రుద్రవీణ’ చిత్రం సిరివెన్నెల కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని ‘తరలి రాద తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయిని…’ వంటి పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి.
ఏప్రిల్ 1 విడుదల, క్రిమినల్, మనీ, గోవిందా గోవిందా, శుభలగ్నం, ప్రేమకథ, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, గమ్యం వంటి చిత్రాల విజయాల్లో ఆయన పాటలు ఎంతో కీలక పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.
అల వైకుంఠపురములో… సీతారామశాస్త్రి రాసిన సామజవరగమన… పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. వేటూరి తరవాత తరంలో సినీ గీత రచనకు తిరుగులేని చిరునామాగా కొనసాగిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నవతరం సోషల్ మీడియా జనరేషన్‌లోనూ తన పాపులారిటీని కొనసాగించడం విశేషం.
సీతారామశాస్త్రి చివరగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు పాటలు రాశారు. అవే ఆయన చివరి పాటలు కావడం విషాదకరం. ఆయన 2021 నవంబరు 30న మృతి చెందారు. ఇటీవల విడుదలైన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కూడా ఒక పాట సిరివెన్నెల ను సదా గుర్తు చేస్తూనే ఉంటుంది.
పుస్తకరూపంలో ‘సిరివెన్నెల’ సమగ్ర సాహిత్యం
ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేందుకు తానా సంకల్పించింది. మొత్తం 6 సంపుటాల్లో సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని ప్రజలకు అందించాలని తానా నిశ్చయించింది. సిరివెన్నెల సినీ గేయాలను 4 సంపుటాలు గానూ, ఇతర సాహిత్యాన్ని మరో 2 సంపుటాలు గానూ తీసుకురానున్నారు.
ఈ నెల 20న సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి కాగా, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘనంగా వేడుకలు నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు హైదరాబాదు శిల్పకళావేదికలో జరగనున్నాయి. ఈ వేడుకలకు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించనున్నారు. కాగా, సిరివెన్నెల సమగ్ర సాహిత్యంలోని తొలి సంపుటాన్ని ఈ నెల 20న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కృష్ణవంశీ, క్రిష్, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, అనంతశ్రీరామ్, సంగీత దర్శకులు కీరవాణి, తమన్, ఆర్పీ పట్నాయక్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొంటారు.