ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండే మసాలా దినుసు లవంగాలు. మంచి రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి లవంగాలు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక వ్యాధుల నుండి లవంగాలు మనలను కాపాడతాయి.
శీతాకాలంలో చాలామంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగాల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దగ్గరకు రాకుండా పోరాటం చేస్తాయి. ఇక శీతాకాలంలో చాలా మంది విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి లవంగం చాలా బాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల పొడిదగ్గు నయమవుతుంది. కఫం సమస్య బాగా తగ్గుతుంది.
రోజూ లవంగం టీ తాగితే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. భోజనం చేసిన గంట తర్వాత లవంగం టీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. చాలామంది పంటినొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగం టీ తాగడం వల్ల లేదా లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. లవంగాలలో యుజైనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా లవంగాలను వాడడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. లవంగాలలో ఉండే యుజైనాల్ తైలం యాంటీసెప్టిక్ లా పనిచేసి పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది. పంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
లవంగాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు తేల్చాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి అని చెబుతున్నారు. లవంగాలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి