కృష్ణపక్షంలో స్వేచ్చాగానం

కృష్ణపక్షంలో స్వేచ్చాగానం వినిపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నవంబర్ 1 కృష్ణశాస్త్రిఉ జయంతి.

తెలుగు సాహితీలోకంలో కృష్ణపక్షంలో కూడా కవితా వెన్నెలలు ఉరకలెత్తించిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. ఆయన జయంతి నవంబర్ 1..ఈ సందర్భంగా ఆయన విశేషాలు …..

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం (ప్రస్తుతం తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన ఎటపాక మండలంలోని గ్రామం) అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించారు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నారు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు.

ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. 1922లో సతీమణి అర్థాంతరంగా మరణించడంతో కొన్నాళ్లు అదే బాధలో గడిపారు ఆయన. అదే బాధలో అనేక విషాద కవితలు రాశారు. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి ఖండకావ్యాలు అలా పుట్టినవే.1929లో రవీంద్ర నాథ్ టాగుర్‌తో ఏర్పడిన పరిచయం కృష్ణశాస్త్రి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మరిన్ని కవితా రచనలను చేసేలా ప్రేరేపించింది. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు.

ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించారు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే “ఊర్వశి” అనే కావ్యం వ్రాశారు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టి సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్త్రి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట తొంబయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ తొమ్మిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు …దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు కవిత్వ లోకాన ఆయన ఓ ప్రముఖ అధ్యాయం. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు జగద్విఖ్యాతం. ఆంధ్రా షెల్లీగా ప్రఖ్యాతి గాంచి “కృష్ణపక్షం” వంటి గొప్ప రచనను తెలుగు పాఠకులకు అందించిన జీవితం చహ్రితార్ధమైంది.

భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. చందమామ లోని చల్లదనాన్ని, మందార పువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్దత్రని రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టు పరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం. వర్షం వచ్చేముందు వీచే చల్లనిగాలి తెమ్మెర తనువును తాకితే ఎంత పులకరిస్తామో, కృష్ణశాస్త్రి కవిత వింటుంటే అదే పులకరింత వీనుల విందుగా వస్తుంది. భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసి, దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది కవులలో కృష్ణశాస్త్రి ముందుంటారు. తెలుగు సినిమాల్లో జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.. అని భరతమాతను కీర్తించినా, జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి.. అంటూ దేశభక్తిని చాటినా.. ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై , ననులేత రెమ్మనై, సెలయేటిలో పాటనై, తెరచాటు తేటినై , నీలంపు నిగ్గునై… అని మగువ ఆర్ద్రతకు పెద్దపీట వేసినా అది కృష్ణశాస్త్రికే చెల్లింది.

దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… మల్లీశ్వరితో ప్రారంభించి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. పిలచిన బిగువటరా, — మనసున మల్లెల మాలలు, ఆకాశ వీధిలో హాయిగా , ఔనా.. నిజమేనా? సడి సేయకో గాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి, రానిక నీకోసం, ఆకులో ఆకునై, ఆరనీకుమా ఈ దీపం, గోరింట పూచింది, పగలైతే దొరవేరా,
గట్టుకాడ ఎవరో, కుశలమా.. నీకు కుశలమేనా, చుక్కలతో చెప్పాలని, అడుగడుగున గుడి ఉంది, రావమ్మా మహాలక్ష్మి, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, ఈనాటి బంధం ఏనాటిదో, వేళ చూస్తే.. సందె వేళ, చీకటి వెలుగుల కౌగిటిలో, పాడనా తెనుగు పాట, ఇది మల్లెల వేళయనీ, మావి చిగురు తినగానే లాంటి పాటలు సినీ సాహిత్యంలో అజరామరాలు.

1975లో-ఆంధ్ర విశ్వవిద్యాలయం – కళాప్రపూర్ణ, 1978లో సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో పద్మ భూషణ్ దేవులపల్లి ని వరించాయి. 1964 లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవంలో కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. ఆయన వెంట బాలాంత్రపు రజనీ కాంతరావు కూడా వెళ్ళారు. ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడైన కృష్ణశాస్త్రి గొంతు బొంగురు పోయింది. దాంతో తన ఉపన్యాసాన్ని రజనీకాంతరావు చేత చదివించారు. వైద్య పరీక్షల్లో అది గొంతు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి స్వరపేటికను తొలగించారు. స్వరపేటిక తొలగించిన తరువాత కృష్ణశాస్త్రి దాదాపు పదహారేళ్లు బ్రతికినా, మూగవోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు. తెలుగు దేశపు నిలువుటద్దం బద్దలైంది. ‘షెల్లీ మళ్లీ మరణించాడు’ అంటూ కృష్ణశాస్త్రి చనిపోయిన రోజున శ్రీశ్రీ రోదించాడు. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూ ‘ఒక్క షెల్లీ యే కాదు, కీట్స్, వర్డ్స్‌వర్త్‌ వంటి మహాశయుల సంయుక్త స్వరూపం కృష్ణశాస్త్రి’ అని శ్లాఘించారు.

Scroll to Top