నటనా నిఘంటువు మిక్కిలినేని

నటనా నిఘంటువు మిక్కిలినేని
జూలై7 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జయంతి

నాటకరంగ చరిత్ర పురుషుడు …ఉద్యమ నాయకుడు… విభిన్న పాత్రల విశిష్ట సినీనటుడు…కళారూపాల విశేష పరిశోధకుడు… సాంస్కృతిక రంగ విస్తృత విహారి… స్వతంత్ర సమర సైనికుడు…అభ్యుదయ కాముకుడు. కళారంగానికి నిఘంటువు…ఆయనే కళాప్రపూర్ణ డాక్టర్‌ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.

మిక్కిలినేని గా పేరొందిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గుంటూరు జిల్లాలో కోలవెన్ను మండలం లింగాయపాలెంలో జూలై 7, 1916లో జన్మించారు. తండ్రి అకాల మరణంతో బాల్యం అనేక కష్టాలకి ఎదురీదాల్సి వచ్చింది. చిన్నప్పట్నుంచీ పెంచుకున్న జానపద కళాతృష్ణ దృఢంగా వేళ్లూనుకుంది. కళారూపాలను తన స్మృతిపథంలో పదిలపరుచుకున్నారు. జానపదులంటే ఆయన దృష్టిలో మట్టి మనుషులు. అందుకే వారి కళావైభవ పరిరక్షణను జీవిత లక్ష్యంగా స్వీకరించారు. పదిహేనో ఏట గాంధీజీ పిలుపునందుకొని సాతంత్య్రోద్యమంలోకి దూకారు. బందరు మండలం చిన్నాపురంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంతూరు పునాదిపాడులో రావిచెట్టు మీద జెండా ఎగరవేశారు. విదేశీ వస్త్రాలు తగులబెట్టారు. ఖద్దరు కట్టి, జెండా చేతబట్టి ‘కొల్లాయి కట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితేనేమి’ అంటూ కంఠమెత్తి జాతీయ గీతాలను ఆలపించి యువజనులనూ, ప్రజలనూ ఉత్తేజపరిచి ఉర్రూత లూగించారు.

భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఆత్మబలిదానానికి స్ఫూర్తి చెంది కాంగ్రెస్‌ రాజకీయాలకు స్వస్తి చెప్పి 1938లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. నిషేధిత ”వందేమాతరం”, ”స్వతంత్రభారత్‌” పత్రికలకు కొరియర్‌గా ఉండి ఊరూరా పంచారు. 1948లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉప్పులూరు రైల్వేస్టేషన్‌ను, పునాదిపాడు హైస్కూలును తగులబెట్టాడని తీవ్రంగా కొట్టి, కేసు బనాయించి జైలుకు పంపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ‘ముందడుగు’, ‘మాభూమి’ వంటి నాటకాలు ప్రదర్శించినందుకు వాటిని నిషేధించారు. మాభూమి నాటకాన్ని ప్రదర్శించినందుకు ఆయన్ను రెండుసార్లు జైల్లో పెట్టారు.

జిల్లా యువజనోద్యమం, బాల సంఘాల నిర్మాణం, గ్రంథాలయోద్యమం, గోరాగారి నాస్తికోద్యమం వంటి ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకునిగా రాష్ట్ర దళం ద్వారా శిక్షణాలయాలు నడిపారు. శాఖలను స్థాపించారు. నాటిరోజుల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను, ప్రజానాట్యమండలి కళాకారులను ప్రభుత్వం తీవ్ర చిత్రహింసల పాల్జేసింది. ఆ సమయంలో పలువురు రంగస్థల కళాకారులను సినీ రంగం ఆహ్వానించింది. ఆ విధంగా 1951లో చలన చిత్రరంగంలో ప్రవేశించారు.

మిక్కిలినేని సినిమాల్లోకి ప్రవేశించేనాటికి రంగస్థలంలో మినహా సినీనటనలో ఏమాత్రం అనుభవం లేదు. అయితేనేం పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ విభిన్న పాత్రలు పోషించారు. ఆయన తాను నటించే పాత్ర గురించి లోతుగా అధ్యయనం చేసేవారు. ఈ విషయమే ఆయనెప్పుడూ అంటుండేవారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల సంభాషణలు వేరు, వేషధారణ వేరు. ఆ రోజుల్లో సంభాషణలు ముందే చేతికిచ్చేవారు. వాటికి తగిన అభినయం చేయాల్సి వచ్చేది. తీసుకున్న పాత్ర గురించి ఆయన అధ్యయనం చేసేవారు. నటీనటులు ఇప్పటిలాకాక ఆ రోజుల్లో ఎవరి సంభాషణలు వారే పలికేవారు. ప్రత్యేకించి మొహంలో అభినయం చూపించాల్సి వచ్చేది. అందువల్ల ఇంటి వద్ద రిహార్సల్స్‌ తప్పనిసరి. కనుకనే ఆయన పాత్రోచితంగా పోటీపడి నటించేవారు. పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఎన్‌టిఆర్‌ మహాభారతాన్నే చదివారని ఆయన చెబుతుండేవారు.

సాధారణ నటుడికీ, కళాకారుడికీ వయస్సు రీత్యా కృషి ఆగిపోయేచోట మిక్కిలినేని అసలు జీవితం ప్రారంభమైంది. ఇంతకాలం నడిచిన జీవితానికీ, సినిమా జీవితానికీ వచ్చిన మార్పును గమనించి తాను ఏ ఆశయం కోసం తపన పడ్డానో అది మూలన పడిందని వ్యథ చెందారు. ప్రారంభ దినాల్లో సినీ బతుకు అంతంతమాత్రంగానే సాగింది. మిగిలిన కాలాన్ని ఎలా ఉపయోగించాలా అనే తపనతో సతమతమయ్యారు. అణగారిపోయిన నాటకరంగం, చితికి జీర్ణమైపోతున్న జానపద కళారూపాలు, దేశ సంస్కృతికి జీవితాన్నర్పించిన కళాకారుల గురించీ, ఒకనాడు నాటకరంగంలో వైభవంగా వెలిగిన నాటి నటరత్నాలు ఏమయ్యారనే తపనతో, కాలం కర్పూరంలా కరిగిపోకూడదనే బాధతో గ్రంథరచనకు పూనుకున్నారు. ఆ విధంగా ”నూరేళ్ల తెలుగు నాటకరంగం చరిత్ర”ను వేయి పేజీల గ్రంథంగా రచించారు. కాలగర్భంలో కలిసిపోయిన 400 మంది నటరత్నాల జీవితాల గురించి ‘నటరత్నాలు’ పేరిట 800 పేజీల గ్రంథం రాశారు.

తాను రాసిన ‘ఆంధ్రనాటకరంగ చరిత్ర’ గ్రంథాన్ని అక్కినేని నాగేశ్వరరావుకూ, ఎన్‌టి రామారావుకూ అంకితమిచ్చారు. ఆ సందర్భంగా ‘నేను నాటక రంగం నుంచి సినిమా రంగానికొచ్చాను. దానికి నేనేమీ చేయలేకపోయాను. ఈ రంగానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు. నాటక రంగం రుణం తీర్చుకుంటున్నారు. మీ ఆంధ్ర నాటక రంగ చరిత్ర గ్రంథాన్ని ముద్రించి నా నాటక రంగ తల్లి రుణం తీర్చుకుంటాను’ అని అక్కినేని వ్యాఖ్యానించారు. ఆ తరువాత మిక్కిలినేని చేతి నుంచి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. ఆ విధంగా మిక్కిలినేనిని నాటకరంగ పరిశోధకుడిగా చెప్పవచ్చు.

47 ఏళ్లపాటు సినీరంగంలో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి. నమ్మిన ఆశయాలకూ, క్రమశిక్షణకూ, ఆత్మవిమర్శకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

* 400కుపైగా చిత్రాల్లో జనరంజకమైన పాత్రల్ని పోషించారు. మొదటి చిత్రం ‘దీక్ష’ 1949లో విడుదలైంది. స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. ప్రోత్సాహంలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తండ్రిగా, గురువుగా, కుటుంబపెద్దగా…పలు పాత్రలు పోషించారు. పల్లెటూరు, కన్నతల్లి, తెనాలి రామకృష్ణ, మాయాబజార్‌, గుండమ్మకథ, దానవీరశూరకర్ణ, పల్నాటియుద్ధం మొదలైన చిత్రాల్లో అనేక పౌరాణిక పాత్రలు వేశారు. ఆయన నటించిన చివరిచిత్రం బాలకృష్ణ హీరోగా చేసిన ‘భైరవద్వీపం'(1992). అత్యధిక సంఖ్యలో పౌరాణిక పాత్రలు వేసిన నటుడిగా ఆయన్ని చెప్పుకొవచ్చు. దుర్యోధనుడు, దుశ్సాసనుడు, కర్ణ, ధర్మరాజు, దృతరాష్ట్రుడు, భీష్ముడు, బలరాముడు, జనక, ఇంద్ర, బ్రహ్మ…మొదలైన అనేక పాత్రల్లో తెరపై కనిపించి అలరించారు.

* దాదాపు 40 రకాల పౌరాణిక పాత్రల్ని వేసిన ఏకైక నటుడిగా ఇండిస్టీలో ఆయన్ని గుర్తు చేసుకుంటారు. 1999లో శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘విశిష్టపురస్కారం’తో సత్కరించి గౌరవించింది. ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు.

Scroll to Top