మధుర స్వరాల గాయకుడు

మధుర స్వరాల సంగీత దర్శకులు,గాయకుడు జి ఆనంద్

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి. ఆనంద్ (67) కరోనాతో ఈనెల 6వ తేదీ రాత్రి భౌతికంగా మణందరికీ దూరమయ్యారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ తుది శ్వాస విడిచారు

ఆయన శ్రీకాకుళం జిల్లా తులగాం గ్రామంలో జన్మించిన ఆనంద్ పూర్తి పేరు గేదల ఆనందరావు. తల్లి అమ్మన్నమ్మ, తండ్రి చంద్రశేఖరం నాయుడు… చిన్నతనంలోనే తన తండ్రి దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. ఆనంద్ తండ్రి రంగస్థల నటుడు. ఆయన రాముడి పాత్ర పోషిస్తే, ఆనంద్ అతని సోదరుడు లవ, కుశులుగా నటించేవారు. బాల్యం నుండే పాటలు పాడటం అలవాటైన ఆనంద్, అనేక పోటీలలో బహుమతులు సంపాదించుకున్నారు.

యుక్తవయసులో ఆనంద్ పాల్గొన్న ఓ పాటల పోటీకి ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. అందులో ఆనంద్ కు ఉత్తమ గాయకుడిగా ప్రథమ బహుమతి లభించింది. ఆనంద్ గాత్రాన్ని మెచ్చి మహదేవన్ చెన్నయ్ ఆహ్వానించడంతో ఆయన శ్రీకాకుళం నుండి చెన్నపట్నం చేరారు. అదే సమయంలో నటుడు చంద్రమోహన్ ద్వారా ప్రముఖ నిర్మాత ‘నవత’ కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడటంతో ‘అమెరికా అమ్మాయి’లో ‘ఒక వేణువు వినిపించెను’ గీతం పాడే అవకాశం వచ్చింది. దీనికి ముందు ఆయన ‘పండంటి కాపురం’లో కోరస్ పాడారు. ఆ సమయంలో ప్రముఖ గీత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి తనకు ఎంతో సహకరించారని జి. ఆనంద్ తెలిపారు. ‘అమెరికా అమ్మాయి’ చిత్రం విజయం సాధించడంతో చక్రవర్తి తాను సంగీతం సమకూర్చిన ‘కల్పన, ఆమె కథ’ చిత్రాలలో పాటలు పాడించారు. దాదాపు ఎనిమిదేళ్ళ పాటు ఆనంద్… చక్రవర్తి దగ్గర సహాయకునిగా ఉన్నారు. ‘ప్రాణం ఖరీదు’, ‘మనవూరి పాండవులు’, ‘మా బంగారక్క’, ‘చక్రధారి’, ‘తాయారమ్మ -బంగారయ్య’ తదితర చిత్రాలలో ఆయన పాటలు పాడారు.

చెన్నయ్ వెళ్ళిన కొత్తలో ఆయన తన ఊరి వాడైన శరత్ బాబు రూమ్ లోనే ఉన్నారు. ఆ అనుబంధంతోనే శరత్ బాబు తాను నిర్మించిన ‘గాంధీ నగర్ రెండోవీధి’ చిత్రానికి జి. ఆనంద్ కు సంగీతం అందించే అవకాశం ఇచ్చారు. అలానే ‘స్వాతంత్రానికి ఊపిరి పోయండి, అంబేద్కర్, రంగవల్లి’ వంటి ఎనిమిది స్ట్రయిట్ తెలుగు సినిమాలకు జి. ఆనంద్ సంగీతాన్ని అందించారు. కొన్ని అనువాద చిత్రాలకు మ్యూజిక్ కండక్టర్ గా వ్యవహరించారు. ‘అమెరికా అమ్మాయి’ చిత్రంలో కథానాయికకు డబ్బింగ్ చెప్పిన సుజాతను ఆయన వివాహం చేసుకున్నారు. సినిమాలలో అవకాశాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జి. ఆనంద్ స్వరమాధురి సంస్థ ద్వారా దేశ విదేశాలలో 6, 500 లకు పైగా సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. వారి పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. ఇండియా తర్వాత అమెరికాలోనే ఆనంద్ అత్యధిక సంగీత కచేరీలు ఇవ్వడం విశేషం. ఆనంద్ లేని లోటు పూడ్చలేనిదంటూ టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెడుతూ.. ఆనంద్ కు నివాళులు అర్పించారు హీరో చిరంజీవి.

చిరంజీవి తన కెరీర్ లో డాన్స్ చేసిన మొట్టమొదటి పాటను ఆలపించిన వ్యక్తి జి.ఆనంద్. చిరంజీవి నటించిన పునాదిరాళ్లు సినిమాకు జి.ఆనంద్ పాడారు. అలా ఆనంద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఆ తర్వాత కూడా చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన చాలా సినిమాల్లో ఆనంద్ గాత్రం వినొచ్చు. ఆయన లేనిలోటు ఎవరూ పూడ్చలేనిది.

Scroll to Top