దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు అస్తమయం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) ఇవాళ(ఆదివారం జులై 13) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. కోట మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. కోట శ్రీనివాసరావు 1942, జులై 10న జన్మించారు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1966లో ఆయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కోటశ్రీనివాసరావు సోదరుడు కోటశంకరరావు కూడా సినిమా నటుడు.

బాల్యం నుండి నాటకరంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలంపై 20 యేళ్ళ అనుభవం గడించారు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. మర్యాద పూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.

అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా ఆయన చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ఎన్నో సినిమాల్లో ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో ఎన్టీఆర్ కు తాతగా నటించారు. మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్ కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. పద్మశ్రీ పురస్కారంతో పాటు, నంది అవార్డులు, పలు పురస్కారాలు పొందారు.

ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తనతో కలిసి నవ్వులు విరబూయించిన కోట శ్రీనివాసరావు విగతజీవుడిలా ఉండడం చూసి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తట్టుకోలేకపోయారు. కోట భౌతికకాయాన్ని ఉంచిన బాక్సుపై తల ఆనించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఉదయం కోట శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, బ్రహ్మానందం తన చిరకాల మిత్రుడు కోట ఇంటికి వచ్చారు. కోట భౌతికకాయాన్ని చూడగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగాలకు లోనై రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ బ్రహ్మానందాన్ని ఓదార్చారు.

సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగింది. వందలాది మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు కడసారి నివాళులర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, వెంకటేశ్, రానా దగ్గుబాటి వంటి పలువురు సినీ ప్రముఖులు కోట శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. చిరంజీవి ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే సినిమాతో (ప్రాణం ఖరీదు, 1978) తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితర రాజకీయ ప్రముఖులు కూడా ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

కోట శ్రీనివాసరావు తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన విలక్షణమైన నటనకు, ముక్కుసూటి వ్యక్తిత్వానికి పేరుగాంచారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న కోట శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

Scroll to Top