బహుముఖ ప్రతిభాశాలి

బహుముఖ ప్రతిభాశాలి రావి కొండలరావు – ఈనెల11 రావి కొండలరావు జయంతి

బహుముఖ ప్రతిభాశాలి రావి కొండలరావు తెలుగు వారికి చిరపరచితులే. ఈ నెల11 ఆయన జయంతి సందర్భంగా ఒకసారి గుర్తుచేసుకుండాం… నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు. దాదాపు 600 చిత్రాలలో నటించారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి కావడం గమనార్హం.

1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో రావి కొండలరావు జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు. శ్రీకాకుళంలోని పాండురంగ వీధిలో ఉండేవారు.

ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు.

రావి కొండలరావు లెజెండరీ గురించి చెప్పుకోవాలంటే బోలెడన్ని విశేషాలు. వాట్లో కొన్ని…
ఏ పాత్రనైనా ఒకే విధంగా పోషించే నటులు కొందరు ఉన్నారు. అయితే పాత్రల స్వభావాన్ని బట్టి డైలాగ్‌ మాడ్యులేషన్‌ మార్చుకొవడం రావి కొండలరావు ప్రత్యేకత అని చెప్పాలి. ఆయన నటించిన పాత్రలు చిన్నవే అయినా ఎంతో సహజంగా వుండి ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేవి. సంభాషణలకు మేనరిజం జోడించి చెప్పడం ఆయన ప్రత్యేక శైలి. ఉదాహరణకు.. ‘నిర్దోషి’ (1967) సినిమాలో ఆయన సంగీత ప్రియుడైన డాక్టర్‌ పాత్ర వేశారు. అందులో ఆయనకనిపించినప్పుడల్లా.. ‘‘రామచిలుకనొకటి పెంచి, ప్రేమమీర మాటలాడే’’ అని పాడుతూ ఉంటారు. దీనికి స్ఫూర్తి మద్రాసులో తానెరిగిన ఓ డాక్టర్‌ మ్యానరిజమేనని ఆయన చెప్పేవారు. కూనిరాగం తీస్తూ పలకరించే ఆ డాక్టర్‌ను కొండలరావు అనుకరించిన తీరు సూపర్‌హిట్‌ అయింది. అలాగే తాతినేని రామారావు దర్శకత్వలో ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘బ్రహ్మచారి’ (1968) సినిమాలో కూడా కొండలరావు డాక్టరుగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆ సినిమాలో రావు సాహెబ్‌ పరంధామయ్య (నాగభూషణం) మనవణ్ని రక్త పరీక్ష ద్వారా గుర్తించే డాక్టరు పాత్ర ధరించారు. కళ్లజోడు సవరించుకుంటూ ‘‘మీ అబ్బాయి రామకృష్ణ రక్తమున్నూ, ఆ బిడ్డ యొక్క రక్తమున్నూ, అనగా ఇద్దరి రక్తమున్నూ పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చూడగా తేలినదేమనగా.. నౌ కమింగ్‌ టు పాయింట్‌… ఒక్కటే! ఏమియూ సందేహము లేదు’’ అంటూ ఆయన చెప్పే విధానం నవ్వులు పూయించింది.

స్కూల్‌ మాస్టారు పాత్రలో
నిర్మాత, దర్శకుడు పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించిచూడు’లో నాగేశ్వరరావు తండ్రిగా ఒక స్కూల్‌ మాస్టారు పాత్రలో కొండలరావు నటించారు. ఆ సినిమా చేసే సమయానికి ఆయన వయసు 30 ఏళ్లు. ఆ పాత్ర కోసం ముళ్లపూడి వెంకటరమణ సలహాపై పుల్లయ్య దగ్గరకు వెళ్లిన రావి కొండలరావును చూసి.. ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. తన సహజ ధోరణిలో.. ‘‘ఫస్ట్‌ గెటవుట్‌. నీకు బుద్థి లేదా? ఆ రమణకి బుద్ధి లేదా? లేకుంటే నాకు బుద్ధి లేదా? నువ్వు నాగేశ్వరరావుకి తండ్రివా? అయామ్‌ నాట్‌ ఎ ఫూల్‌. ప్లీజ్‌ గో’’ అన్నారు. వెంటనే ఆయన రమణ దగ్గరకు వెళ్లి ఆ విషయం చెప్తే.. ‘మీ తెలుగు మాస్టారును అనుకరిస్తూ డైలాగ్స్‌ చెప్తావు కదా. ఆ మిమిక్రీ ఆయన ముందు చెయ్యి’ అన్నారాయన. వెంటనే కొండలరావు పుల్లయ్య వద్దకు వెళ్లి.. తెలుగు మాస్టర్‌లా యాక్టింగ్‌ చేసి చూపించారు. దాంతో ఆయన ‘‘చావు పద’’ అంటూ విగ్గుల షాపు వద్దకు తీసుకెళ్లారు పుల్లయ్య. అంటే తండ్రి పాత్ర ఖరారైందన్నమాట! ఆ సినిమాలో ఆయన పలికే ‘‘సాయ్‌లెన్స్‌’’ అనే ఊత పదం అందరినీ అలరించింది.

‘పెళ్లిపుస్తకం’
విజయావారి ‘మిస్సమ్మ’ సినిమాలో పెళ్లికాని ఇద్దరు నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగ సంపాదన కొసం భార్యాభర్తలుగా నటిస్తూ చివరకు పెళ్లిచేసుకుంటారు. రావి కొండలరావు ఈ నేపథ్యాన్ని తీసుకొని ఇద్దరు పెళ్లైన యువతీ యువకులు అనివార్యమైన పరిస్థితుల్లో అవివాహితులుగా చెప్పుకొని ఉద్యోగంలో చేరడం అనే పాయింట్‌తో కథ అల్లితే, దాన్ని బాపు, రమణలు ‘పెళ్లిపుస్తకం’ (1991)గా మలిచారు. సినిమాలో.. గుమ్మడి వెనకాల నుంచుని, ఆయన మాటలకు అభినయించే బాబాయి వేషంతో అందరి ప్రశంసలు పొందారు. ఈ సినిమాకుగాను.. రావి కొండలరావుకు ఉత్తమ కథారచయితగా, ముళ్లపూడికి ఉత్తమ సంభాషణల రచయితగా నందులు దక్కాయి.

ఏఎన్నార్‌ తండ్రి పాత్ర
‘ప్రేమించి చూడు’ సినిమాలో కొండలరావు.. ఏఎన్నార్‌ తండ్రి పాత్ర వేశారు. ఒక సీన్‌లో నాగేశ్వరరావును ఉద్దేశించి.. ‘‘ఒరేయ్‌ గాడిదా! ఎక్కడరా తిరుగుతున్నావు?’’ అని అడగాలి. ఆ సన్నివేశంలో నటించేందుకు కొండలరావు సందేహిస్తే.. ‘‘ఈ సన్నివేశంలో తండ్రి కొడుకును మందలింపుగా ప్రశ్నిస్తున్నాడు. అంతే తప్ప అక్కినేనిని కొండలరావు గాడిదా అనట్లేదు’’ అంటూ ఏఎన్నార్‌ భుజం తట్టి ప్రోత్సహించారు. దాంతో కొండలరావు ఆ పాత్రలో విజృంభించారు. అలాగే మరో సినిమాలో ఎస్వీఆర్‌ను.. ‘ఒరేయ్‌ ఒరేయ్‌.. మళ్లీ చుట్ట మొదలెట్టావేంట్రా?’ అని తిట్టే సీన్‌ ఉంది. కొండలరావు తటపటాయిస్తుంటే ఎస్వీఆర్‌ ఆయన వద్దకు వెళ్లి.. ‘‘పంతులూ.. ఎందుకయ్యా భయం? ఫ్రీగా చెయ్‌’’ అన్నారు. ‘‘ఫ్రీగా చేయట్లేదండీ. డబ్బులు ఇస్తున్నారండీ’’ అంటూ రావి కొండలరావు తనదైన శైలిలో జోక్‌ చేశారు. అంతే.. సెట్టంతా నవ్వుల సందడి!

సూర్యకాంతంతో…
సూర్యకాంతం, రావి కొండల రావు దాదాపు పది సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. బయట ఆవిడ ఈయన్ను తమ్ముడూ అని పిలిచేవారు. ఈయన ఆవిడను ‘అక్కగారూ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఒకసారి అలాగే ఒక సీన్‌లో రావి కొండలరావు సూర్యకాంతాన్ని ‘ఏమేవ్‌ ఇదుగో’ అని పిలిస్తే.. ‘ఏం నాయనా? ఏమేవ్‌ అనే దాకా వచ్చావు?’ అని సూర్యకాంతం సరదాగా అన్నారు.

పెద్ద పాత్రలు
రావి కొండలరావు వయసులో చిన్నవారైనా వేసినవన్నీ ‘పెద్ద’ పాత్రలే. అంటే తండ్రి, బాబాయి.. ఇలాగన్నమాట. తనకన్నా వయసులో పెద్దవారైన నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ వంటివారికి తండ్రి పాత్రలు వేశారాయన. అదే సమయంలో.. తనకన్నా పెద్దవారైన పుష్పవల్లి, సూర్యకాంతం, ఎస్‌.వరలక్ష్మి, భానుమతి వంటివారికి భర్తగా చాలా పాత్రలు వేశారు. ఇదో విచిత్రం అని గుర్తుచేసుకునేవారాయన.

కృష్ణకు స్కూటర్‌ నేర్పించి…
తేనెమనసులు సినిమాలో రాధాకుమారికి వేషం వచ్చింది. రావి కొండలరావుకు మాత్రం వేషం లేదు. కానీ, ఆమెను దింపడానికి ఆయన హైదరాబాద్‌లోని సారథీ స్టూడియో్‌సకు రోజూ వెళ్లేవారు. ఆమెను దింపాక అక్కడే కాసేపు ఉండి కాలక్షేపం చేసేవారు. ఆ సినిమాలో హీరో కృష్ణ స్కూటర్‌ నడపాలి. కానీ ఆయనకేమో రాదు. దీంతో ఆదుర్తి సుబ్బారావు ఆ పని రావి కొండలరావుకు అప్పజెప్పారు. ఆయన దగ్గర కృష్ణ చాలా తొందరగా స్కూటర్‌ నేర్చుకున్నారు.

భార్యాభర్తలుగా
‘ఓయ్‌’ సినిమాలో రావి కొండలరావు, రాధా కుమారి భార్యాభర్తలుగా వేశారు. ఒక సీన్‌లో ఆమె ఆయనను ‘ఒరేయ్‌ కోటీ’ అని పిలివాలి. ఆ సినిమా డైరెక్టర్‌ ఆమెతో.. ‘అమ్మా, కొండలరావుగారిపై మీకు ఏమైనా కోపం ఉంటే తీర్చేసుకోండి’ అన్నారని, ఆ సినిమా మొత్తం ఆమె తనను అలాగే పిలిచిందని, పాత్రలు చక్కగా పండాయని.. రావి కొండలరావు అందరికీ సరదాగా చెప్పేవారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్ని విశేషాలో…

ఏది ఏమైనా తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన జనం మదిలో ఉంటారు. తెలుగు కథ, నాటకం గురించి మాట్లాడుకునేవారు ఉన్నంతకాలం రావి కొండలరావు నిక్షేపంగా చిరంజీవే!

Scroll to Top