విలనిజానికి వినూత్న భాష్యం చెప్పిన నట విరాట్ – *ఆగష్టు 13 రావు గోపాలరావు వర్థంతి
**********************************

తెలుగు చలచిత్ర సీమలో రావు గోపాలరావు ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాలలో విలనిజానికి వినూత్న భాష్యం చెప్పిన నట విరాట్ గా గుర్తింపు పొందిన రావు గోపాలరావు వర్థంతి ఆగస్టు 13. ఈ సందర్భంగా ఆయన జీవన విశేషాలు కొన్ని….
కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో జనవరి 14, 1937లో రావు గోపాలరావు జన్మించారు. చదువుకునే రోజుల నుంచే నాటకాలంటే ఆసక్తి వున్న గోపాలరావును అతని స్నేహితులు ప్రోత్సహించడంతో పాటు ధన్యజీవులు నాటకంలోని నటనకు మంచి పేరు రావడంతో నాటకరంగంలోకి వచ్చారు. అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను ప్రదర్శించారు. భమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగిపోయి నటించి, అనేకమంది చే ప్రశంసలు అందుకున్నారు. నాటకరంగంలో పేరు సంపాదించి సినిమారంగంలోకి వెళ్ళినవాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి రాజమహేంద్రవరంలో కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినపుడు ముఖ్యఅతిథిగా వచ్చిన సినీనటుడు ఎస్.వి. రంగారావు ఆ నాటకంలో మురారి పాత్ర పోషించిన గోపాలరావు నటనకు ముగ్ధుడయ్యారు.
గుత్తా రామినీడు దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన (1966) సినిమాలో రంగారావు శ్రీనాథుని పాత్ర పోషించారు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేషం ఉంది. ఎవరికంటే వాళ్ళకు దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు, రావు గోపాలరావు ను మద్రాసు పిలిపించి, రామినీడుకి పరిచయంచేసి అతనిచేత రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టారు. గోపాలరావులో ఉన్న ప్రతిభను గమనించిన రామినీడు ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. అలా రామినీడు వద్ద బంగారు సంకెళ్ళు, మూగప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసారు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ, కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావు కు జగత్ కిలాడీలు (1969) సినిమాలో ప్రధాన విలన్ గా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు నిర్మాతలు. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన గండర గండడు (1969) సినిమాలో గోపాలరావు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించారు. బాపు-రమణల ముత్యాలముగ్గు (1975) సినిమాలో గోపాలరావు విలక్షణ విలన్ అవతారమెత్తడం కాకుండా గోదావరి యాసలో తను పలికే డైలాగులతోనే సినిమా విజయంలో పాలుపంచుకున్నారు.

ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగి పోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తర్వాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సింది. వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. ఆ రోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందేవారు.
బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్, చిత్రాలు ఆ చిత్రాల్లోని రావు గోపాలరావు డైలాగ్స్ అందరికీ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి సింహం, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు.
కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు పండించారు. రావు – గోపాలరావు సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, పట్నం వచ్చిన పతివ్రతలు, మల్లెపువ్వు సినిమాల్లో మాలిష్ మారాజుగా, మావూర్లో మహా శివుడు సినిమాలో శివుడుగా, స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు. ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటిదొంగ సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు. రావు గోపాలరావు వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావుది కావడం ఒక రికార్డు. ఆయన పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.
రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు … వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి… ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి… వాచకంతో ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు… రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు… అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది… కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి… బాపు-రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింప చేశారు… రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు.
నిర్మాతగా గోపాలరావు స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవ రాముడు, వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు విజయం సాధించారు. 1993లో ఆ ఒక్కటీ అడక్కు, అల్లరి ప్రియుడు, అల్లరి అల్లుడు, ప్రేమ అండ్ కో. అనే నాలుగు సినిమాలలో నటించారు. గోపాలరావు నటించిన ఆఖరి చిత్రం ప్రేమ అండ్ కో. సినిమా ఆయన చనిపోయిన కొద్దిరోజుల తరవాత విడుదలైంది. గోపాలరావు 125 సినిమాలకు పైగా నటించారు.
వ్యక్తిగత జీవితంలో చూస్తే….హరికథా కళాకారిణి అయిన రావు కమలకుమారితో 1966, జనవరి 16న రావుగోపాలరావు వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు. తరవాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు, ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్ళి చేసుకున్నారు. ఈమె 73 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 6, 2018 న హైదరాబాదులో మరణించారు. రావు గోపాలరావు మధుమేహవ్యాధి తీవ్రమై 1994, ఆగష్టు 13న మరణించారు. తెలుగు ప్రతినాయకుల్లో నటవిరాట్ గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు. ఆయన స్థానం వేరెవ్వరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు.
