ఎప్పటికీ సూపర్ స్టార్ … కృష్ణ..!
కథానాయకుడు…కృష్ణ..!
తెలుగు తెరపై తొలి జేమ్స్ బాండు…
అల్లూరిగా విప్లవ స్ఫూర్తి చూపిన వీరుడు…
తెలుగు సినిమా ‘సింహాసనం’లో నటశేఖరుడు…
ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ సూపర్ స్టార్‌గా నిలిచే నటుడు…
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంగళవారం (నవంబర్15 న) మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. భువి నుంచి దివికి మరో తార వెళ్ళింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణది చెరగని ముద్ర. 350కు పైగా సినిమాలు చేసిన ఆయన… మూడో తరాన్ని కూడా పరిశ్రమకు పరిచయం చేశారు.
కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి అతనికి ఎన్.టి.రామారావు అభిమాన నటుడు, పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, అతనికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎం.పి.సి. గ్రూపుతో ఇంటర్ చేరాడు. అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివాడు. సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ, తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు. డిగ్రీ పూర్తిచేశాకా ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది.
కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి ఇటీవలే మృతిచెందాడుడు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా స్థిరపడ్డాడు. భార్య ఇండిర కొన్ని నెలల కిందటే మృతిచెందారు. కృష్ణ కుటుంబం నుంచి కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తుంది. చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరుతెచ్చుకుంటున్నాడు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త.
1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకూ ఇది రెండవ పెళ్ళి. తోటి నటిగానూ, దర్శకురాలిగానూ విజయనిర్మల సినీ రంగంలో రాణించింది. వీటిలో పలు సినిమాల్లో కృష్ణ కథానాయకుడిగా చేశాడు. రెండవ పెళ్ళి కృష్ణ మొదటి భార్య పిల్లలు, విజయనిర్మల కుమారుడు నరేష్‌లపై ప్రభావం చూపింది. సామాజికంగా వారిని హేళన చేయడం వంటి అంశాలు తర్వాత కాలంలో కొన్ని ఇంటర్యూలలో గుర్తుచేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిర విజయనిర్మలను కుటుంబ సభ్యురాలిగా స్వీకరించడమే కాక ఆమెను ఆదరించింది. ఇందిర పిల్లలైన మహేష్, ప్రియదర్శిని తరచు విజయనిర్మల ఇంటికి వచ్చేవారని, స్వంత కొడుకు నరేష్‌కీ వాళ్ళకీ ఏనాడూ భేదం చూడలేదని విజయనిర్మల చెప్పేవారు. విజయ నిర్మల 2019లోనే మృతిచెందారు.
సినీ ప్రస్థానంలో
డిగ్రీ పూర్తై, ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు చేశాడు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపాడు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మద్రాసులో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పాడు. అప్పటికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగిరమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు. మద్రాసులోనే “చేసిన పాపం కాశీకి వెళ్ళనా?” నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్యమండలి వారు విజయవాడ జింఖానా మైదానంలో ప్రదర్శించిన ఛైర్మన్ నాటకంలో ఛైర్మన్ కుమారుడి పాత్ర పోషించాడు. తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వీ ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపికచేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీసు చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాస్తే, కృష్ణ తల్లి కావాల్సినంత డబ్బు పంపేది. రోజూ సెకండ్ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు. కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు (1962) సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. కులగోత్రాలు (1962), పరువు ప్రతిష్ఠ (1963), మురళీకృష్ణ (1964) సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీనితో కృష్ణ తెనాలి తిరిగి వెళ్ళిపోయాడు.
తొలి అవకాశాలు(1964-1967)
1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపికచేశాడు. సంభాషణలు చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. దీనితో పాటు తర్వాత ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసులు సినిమాకి కలర్‌లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతుండగానే రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని తొలగించెయ్యమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలై విజయం సాధించింది. ఆరు నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నెమనసులు సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ నటించాడు.
హీరోగా రెండో సినిమా అయిన కన్నెమనుసుల్లో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు నిర్మాత డూండీ అవకాశం ఇచ్చాడు. తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్ చేసే సన్నివేశం చూసి, డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండీ తన జేమ్స్‌బాండ్ చిత్రానికి హీరోగా ఎంపికచేశాడు. రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. కన్నెమనసులు జూలై 22న విడుదలై యావరేజిగా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. 1967లో కృష్ణ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మొనగాళ్లు అన్న జానపద చిత్రం, బాపు-రమణల తొలి చిత్రం, విజయనిర్మలతో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి, తర్వాతి కాలంలో కృష్ణతో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు వి. రామచంద్రరావుతో తొలి కాంబినేషన్ మరపురాని కథ ఉన్నాయి. ఈ దశలోనే కృష్ణ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశాడు. “ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది” కాదని కృష్ణ చెప్పుకున్నాడు. గూఢచారి 116 వల్ల కృష్ణకు వచ్చిన ఇమేజీ ప్రభావం చాన్నాళ్ళు ఉంది. 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణకు దాదాపు అన్నీ విజయాన్ని సంపాదించిపెట్టాయి.
తారాపథంలోకి (1968-1975)
మోసగాళ్ళకు మోసగాడు తొలి తెలుగు కౌబాయ్ సినిమా. స్వంత ఇమేజ్, స్టార్‌డమ్ సాధించేందుకు స్థాపించిన నిర్మాణ సంస్థ పద్మాలయా రెండవ చిత్రంగా విడుదలై కృష్ణకు స్టార్‌డం సాధించిపెట్టిన సినిమా.
1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1975లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం ఎరుగక సినిమాలు చేయడం ప్రారంభించాడు. సినిమా అవకాశాల మీద అవకాశాలు వస్తున్నా, విజయవంతం అవుతున్నా అప్పటివరకు నటునిగానే ఉన్నానని భావించిన కృష్ణ తనకు స్టార్‌డం తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి 1970లో తన స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ప్రారంభించాడు. కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. పద్మాలయా వారి మొదటి సినిమాగా అగ్నిపరీక్ష సినిమా నిర్మితమైంది. ఇది పెద్ద విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 1971లో తీసిన మోసగాళ్ళకు మోసగాడు మాత్రం భారీ విజయాన్ని, సాహసిగా కృష్ణకు పేరును తెచ్చిపెట్టింది. మోసగాళ్ళకు మోసగాడు సినమా ఆంగ్లంలోకి ట్రెజర్ హంట్ పేరిట అనువాదమై 123 దేశాల్లో విడుదలైంది, మంచి విజయాన్ని సాధించింది. కృష్ణ ఆశించిన విధంగా అతనికి స్టార్ హోదా సాధించిపెట్టింది. 1972లో నటుడు ప్రభాకర రెడ్డిని భాగస్వామిగా తీసుకుని కుటుంబ కథాచిత్రమైన పండంటి కాపురం నిర్మించాడు. ఇదీ మంచి విజయాన్ని సాధించింది. 1974లో స్వంత బ్యానర్‌పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశాడు. 1973లోనే కృష్ణ, విజయనిర్మల కలిసి విజయకృష్ణా నిర్మాణ సంస్థని స్థాపించి విజయనిర్మల దర్శకురాలిగా తొలి సినిమా మలయాళంలోనూ, మలి చిత్రం తెలుగులోనూ తీశారు. విజయనిర్మల తెలుగులో కృష్ణ, తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా – మంచి విజయాన్ని సాధించింది. ఈ దశలో కృష్ణకు మంచి విజయాలు సాధించిపెట్టిన మరో జానర్ – క్రైం సినిమాలు. 1968-1970 మధ్యకాలంలో పలు క్రైం సినిమాలు చేసినా 1970లో వచ్చిన పగ సాధిస్తా సినిమా కృష్ణ దశ మార్చింది. దీని తర్వాత రెండేళ్ళలో కృష్ణ నటించిన ఎనిమిది క్రైం సినిమాలు విడుదలయ్యాయంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు.
అల్లూరి సీతారామరాజు జీవితాన్ని “విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు” పేరిట సినిమాగా తీస్తానని 1957లోనే ప్రకటించి, తర్వాత స్క్రిప్టును పక్కన పెట్టి ఎన్.టి.రామారావు తీయకుండా తాత్సారం చేస్తూండడంతో కృష్ణ నిర్మించాడు. ఎన్.టి.రామారావు కృష్ణను ఆ సబ్జెక్టు ప్రజాదరణ పొందలేదని, తీయవద్దని వారించినా వినలేదు. అయితే ఆ అంశంపై వారిద్దరి నడుమ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు సినిమాలను అప్పటి సినీ పరిశ్రమ లెక్కల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలకు రెట్టింపు బడ్జెట్‌తో నిర్మించాడు. మోసగాళ్ళకు మోసగాడు సినిమాను థార్ ఎడారి, రాజస్థాన్ కోటలు, పాకిస్తాన్, టిబెట్ సరిహద్దులు వంటి ప్రాంతాలకు వెళ్ళి చిత్రీకరించారు. ఈ సినిమాలు నిర్మాణమవుతూండగా పలువురు పరిశ్రమ పెద్దలు ఇవి కృష్ణను, పద్మాలయా ప్రొడక్షన్స్‌ను నష్టాల్లో ముంచేస్తాయని చెప్పిన జోస్యాలు వమ్మయ్యేలా అనూహ్య విజయాలు సాధించాయి.
పౌరాణికాల్లో నందమూరి తారక రామారావు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు, జానపదాల్లో కాంతారావు అప్పటికే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లో అడుగుపెట్టిన కృష్ణ 1975 నాటికల్లా అగ్ర కథానాయకునిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ దశలో అగ్రతారలైన ఎన్టీఆర్ (స్త్రీ జన్మ, నిలువు దోపిడీ, దేవుడు చేసిన మనుషులు, విచిత్ర కుటుంబం), నాగేశ్వరరావు (అక్కా చెల్లెలు, మంచి కుటుంబం)లు సహా పలువురు తోటి హీరోలతో అనేక మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. కృష్ణ యాక్షన్ సినిమాల ద్వారా అగ్రపథాన్ని చేరుకుంటున్నా సమాంతరంగా ఉండమ్మా బొట్టు పెడతా, పండంటి కాపురం, గాజుల కిష్టయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు లాంటి కుటుంబ కథా చిత్రాలు కూడా చేశాడు. మోసగాళ్ళకు మోసగాడు ఘన విజయం సాధించడంతో పలువురు కౌబాయ్ సినిమాల నిర్మాణం చేపట్టారు. వాటిలో అధిక శాతం సినిమాల్లో హీరోగా కృష్ణే నటించాడు.
మరిన్ని విజయాల్లో (1976-1989)
తన స్వంత నిర్మాణ సంస్థలో పాడిపంటలు సినిమా తీసి 1976 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటివరకూ ప్రధానంగా ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్యనే ప్రధానంగా నడిచిన సంక్రాంతి సినిమాల పోటీలోకి కృష్ణ 1976లో పాడిపంటలు సినిమాతో దిగాడు. 1976 సంక్రాంతికి రామారావు వేములవాడ భీమకవి, శోభన్ బాబు పిచ్చిమారాజు సినిమాలతో పోటీగా పాడిపంటలు విడుదలై సంక్రాంతి సినిమాగా విజయాన్ని దక్కించుకుంది. అలానే మందకొడిగా సాగుతున్న కృష్ణ కెరీర్ మళ్ళీ ఊపందుకునేలా చేసింది. 1977 సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు కృష్ణ అర్జునుడిగా కురుక్షేత్రం సినిమా తీయడం మొదలుపెట్టాడు. అదే సమయానికి విడుదల చేసేందుకు మహా భారతం కథాంశంగా కర్ణుడు కథానాయకుడిగా నందమూరి తారక రామారావు తీసిన దాన వీర శూర కర్ణ సినిమా తీస్తూండడం వివాదానికి దారితీసింది. దానవీరశూర కర్ణ సినిమా నిర్మాణం తన జీవితాశయమని, ఇలాంటి సందర్భంలో కురుక్షేత్రం తీయడం సరికాదని రామారావు కృష్ణను పిలిచి చెప్పాడు. అయితే కురుక్షేత్రం నిర్మాత అప్పటికే పెట్టుబడి పెట్టివుండడంతో వెనక్కి తగ్గలేదు. ఓ ముగ్గురు నటులను మినహాయించి కురుక్షేత్రంలో నటించేవారు ఎవరికీ దానవీరశూర కర్ణలో నటించే వీలు లేదని రామారావు పట్టుబట్టాడు. కురుక్షేత్రంలో ముఖ్యపాత్రలను శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగభూషణం వంటివారు పోషించారు. హాలీవుడ్‌లో ఎపిక్ సినిమాల తరహాలో భారీ సెట్టింగులు, సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్‌లో సినిమా నిర్మాణమయింది. నిర్మాణ దశలో కృష్ణ కూడా భాగస్వామి అయ్యాడు. పౌరాణిక బ్రహ్మగా పేరుపడ్డ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం, అల్లూరి సీతారామరాజు సంభాషణల రచయిత త్రిపురనేని మహారథి రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం చేశారు. ఇన్ని చేసినా వివిధ పాత్రల్లో ఎన్టీఆర్, శకునిగా ధూళిపాళల నటన, కొండవీటి వేంకటకవి డైలాగుల బలంతో దాన వీర శూర కర్ణ సినిమానే ఘన విజయం సాధించింది. కురుక్షేత్రం అనుకున్న రీతిలో విజయవంతం కాలేదు. తర్వాత ఇంద్రధనుస్సు (1978), భలే కృష్ణుడు (1980), ఊరికి మొనగాడు (1981), బంగారు భూమి (1982), బెజవాడ బెబ్బులి (1983), ఇద్దరు దొంగలు (1984), అగ్నిపర్వతం (1985), తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987), కలియుగ కృష్ణుడు (1988), రాజకీయ చదరంగం (1989) సినిమాలను సంక్రాంతి పోటీలో విడుదల చేశాడు.
1978-1985 మధ్యకాలం
కృష్ణ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నటించిన సింహాసనం సినిమా ఘన విజయం సాధించింది. భారీ ఎత్తున నిర్మించిన ఈ జానపద చిత్రం తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా. ఈ దశలో కూడా అత్యంత వేగంగా సినిమాలు పూర్తిచేశాడు. 1977 నుంచి పదేళ్ళు లెక్క వేసుకున్నా హీరోగా మరో 117 సినిమాల్లో నటించాడు. ఎన్టీ రామారావుతో అప్పటికే విభేదాలు ఏర్పడ్డా ఇద్దరూ వాటిని పక్కన పెట్టి కృష్ణ-రామారావు మల్టీస్టారర్ కాంబినేషన్‌లో వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో నటించారు. కటకటాల రుద్రయ్య (1978), ఖైదీ (1983) వంటి పలు సినిమాలు అసలు కృష్ణ నటించాల్సి వచ్చినా వివిధ కారణాల వల్ల వదులుకున్నాడు. కృష్ణంరాజు కెరీర్‌ను కటకటాల రుద్రయ్య, చిరంజీవి కెరీర్‌ను ఖైదీ మలుపుతిప్పే స్థాయి విజయాలు అయ్యాయి. 1982లో భవనం వెంకట్రామ్ ప్రభుత్వం హైదరాబాద్లో పద్మాలయా సంస్థకు స్టూడియో నిర్మించుకోవడానికి జూబ్లీహిల్స్‌లో 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. 1983 నవంబరు 21న ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు చేతుల మీదుగా పద్మాలయా స్టూడియోస్ ప్రారంభం కావడంతో కృష్ణ స్టూడియో యజమాని అయ్యాడు.
మలయాళంలో విజయవంతమైన సినిమాను తెలుగు రాజకీయ వాతావరణానికి అనుగుణంగా అడాప్ట్ చేసిన ఈనాడు సినిమా సరిగ్గా 1982లో ఎన్నికలకు ముందు విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈనాడు సినిమాతో కృష్ణ 200 సినిమాల మైలురాయిని చేరుకున్నాడు.
1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగాడు. నట జీవితంలో తొలిసారి గ్యాప్ తీసుకున్నదీ ఈ సమయంలోనే. 1987లో కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా పరిచయం చేశాడు. కృష్ణ నటవారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి వచ్చిన రెండో కొడుకు మహేష్ బాబు అతని సూపర్ స్టార్ అన్న బిరుదునీ పంచుకున్నాడు.మహేష్ బాబు కెరీర్ తొలినాళ్ళలో రాజకుమారుడు, వంశీ సినిమాల్లో ముఖ్యపాత్రలు ధరించిన కృష్ణ, ఆపైన కెరీర్ ఊపందుకున్నాకా అతనితో కలిసి నటించలేదు.
2017 సంక్రాంతికి కృష్ణ 50 ఏళ్ళకు పైగా సాగిన సుదీర్ఘమైన తన సినిమా కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
రాజకీయ రంగం
1972లో జైఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు. ఎన్.టి.రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో తెలుగు నాట కూడా సినిమా రంగంలోని గ్లామర్‌కు రాజకీయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1982 డిసెంబరు 17న కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం “ఈనాడు” సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తనవంతు చిన్న పాత్ర పోషించింది. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు రాజుకున్నాయి.1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్ళాడు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిశారు. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓటమి పాలయ్యాడు. 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఏలూరులో ఓటమి చెందడం[55] వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నాడు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.
ప్రాచుర్యం, పురస్కారాలు
తెలుగు సినిమా చలన చిత్ర చరిత్రలో 1980 దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ నిలబడ్డాడు. అంతకుముందు దశకాల్లో ఎన్.టి.రామారావు, ఆ తర్వాత చిరంజీవి మాత్రమే ఈ స్థానాన్ని సాధించినవారు. తాను ఏ ప్రజాదరణను ఆశించి సినిమా రంగంలోకి వచ్చాడో దాన్ని పూర్తిగా అనుభవించాడు.
1970ల చివర్లో జ్యోతిచిత్ర వారు సూపర్ స్టార్ బిరుదుకు తగ్గ వ్యక్తిని ప్రజలే ఎన్నుకునేలా పోటీ పెడితే ప్రతీ ఏటా కృష్ణనే ఎన్నికయ్యేవాడు. నాలుగేళ్ళు వరుసగా కృష్ణనే ఎంపికకావడంతో ఇక పత్రిక వారు ఆ పోటీని విరమించే దశకు అభిమానులు తెచ్చారు. కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఊరూరా ఉన్న అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉండేవి. తర్వాత దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటివారి అభిమాన సంఘాలు చూపిన ధోరణుల్లో చాలావరకూ కృష్ణ అభిమానులే ప్రారంభించారు. అటువంటి కృష్ణ అభిమాన సంఘాలు, నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమైపోయి సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి.
అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం అందుకున్నాడు. అంతేకాక తెలుగు సినిమా రంగంలో పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, పలు విభిన్నమైన జాన్రాలతో ప్రయోగాలు చేయడం వంటివి తెలుగు చలన చిత్ర రంగంలో కృష్ణ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ పరంగా అతని సేవలను గుర్తిస్తూ 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటి గౌరవాలు కృష్ణకు లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ “నటశేఖర” బిరుదును అందుకున్నాడు.
ప్రత్యేకతలు
కృష్ణ సినీ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు సాధించాడు. ప్రత్యేకించి తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్ళే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో కృష్ణవే కావడం ఒక విశిష్టత. పలు హాలీవుడ్ తరహా చిత్రాలను తొలుత తెలుగు సినిమా తెరకు అతనే పరిచయం చేశాడు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం, హీరోగా అతను నటించిన మూడవ చిత్రం – గూఢచారి 116. కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా మూవీస్ రెండో సినిమాగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. ఇక సాంతకేతికంగానూ పలు తొలి తెలుగు సినిమాలు కృష్ణవే. కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం చేశాడు. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా గూడుపుఠాణి. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా సింహాసనం. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే, మద్రాస్ నగరంలో వందరోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చిత్రంగా చీకటి వెలుగులు, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి.
విమర్శలు, వివాదాలు
సుదీర్ఘ సినీ జీవితంలో సాధారణంగా పలువురితో మంచి సంబంధాలు నెరిపిన కృష్ణకు కొందరితో గట్టి వివాదాలు సాగాయి. నటుడు, రాజకీయ నాయకుడు అయిన ఎన్.టి.రామారావుతో సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సాగిన వివాదాలు ప్రఖ్యాతం. దశాబ్దాల పాటు తెలుగు సినిమా నేపథ్య గాయకుడిగా స్టార్ హోదా కలిగిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు వివాదాలు ఏర్పడ్డాయి. మొదట్లో నేపథ్య గాయకుడిగా రామకృష్ణ ప్రభంజనం వీస్తున్నప్పుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యానికి అవకాశాలు ఇచ్చి నిలబెట్టింది కృష్ణే. అయితే 1985లో బాలసుబ్రహ్మణ్యానికి రావాల్సిన పారితోషికం బకాయి విషయంలో మాట మాట రావడంతో కృష్ణ రెండు, మూడేళ్ళ పాటు బాలుతో కలిసి పనిచేయలేదు. బాల సుబ్రహ్మణ్యాన్ని పక్కనపెట్టి 1985 నవంబరులో విడుదలైన సూర్యచంద్ర సినిమాతో ప్రారంభించి కృష్ణ రాజ్ సీతారాం అన్న గాయకుడితో ఆ మూడేళ్ళు పాడించుకున్నాడు. సూపర్ హిట్ అయిన సింహాసనం సినిమాలో కూడా కృష్ణకు రాజ్ సీతారామే పాటలు పాడాడు.
వ్యక్తిత్వం, లక్షణాలు
కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నాడు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు.తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది. టాప్ స్టార్‌లుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్న దశలో వారిద్దరికీ ప్రత్యేకించి కొందరు నిర్మాతలు ఉండేవారు, వారితోనే ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆ దశలో కృష్ణ కొత్త నిర్మాతలకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేసి వారికి పరిశ్రమలోకి రావడానికి మార్గంగా ఉండేవాడు. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు. ఆంధ్రప్రదేశ్‌లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమాలు రూపొందించాడు. అంతకుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఈ పని చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌లలో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించాడు. వచ్చిన డబ్బు సహాయ నిధికి అందించారు.
కృష్ణ మరణానికి కారణాలివే
2022 నవంబరు 15న కార్డియాక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయనిర్మల (2019), పెద్ద కొడుకు రమేష్ బాబు (2022), మొదటి భార్య ఇందిరా దేవి (2022)ల వరుస మరణాలు చూడవలసి వచ్చింది.
సూపర్ స్టార్ కృష్ణ చాన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్నా.. సడన్ గా ఆయన ఆస్పత్రిలో చేరడం, గంటల వ్యవధిలోనే ఆయన మరణవార్త బయటకు రావడం అందర్నీ కలచివేసింది. అయితే ఇంత సడన్ గా ఆయన ఎందుకు చనిపోయారనే విషయాన్ని వైద్యులు ప్రకటించారు. కృష్ణకు గుండెపోటు రావడం ప్రధాన కారణం కాగా, ఆయనకు ఇతర అవయవాలు పనిచేయకుండా పోవడం మరో కారణంగా ధృవీకరించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల కృష్ణ చనిపోయినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు నివేదిక విడుదల చేశారు.
ఆదివారం అర్థరాత్రి ఇంటివద్ద కృష్ణ గుండెపోటుకి గురికాగా ఆయనను కుటుంబ సభ్యులు రాత్రి 2 గంటల సమయంలో కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు సీపీఆర్ చేశారు వైద్యులు. ఆ తర్వాత చికిత్స మొదలు పెట్టారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయన్నారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో నాలుగు గంటల తర్వాత డయాలసిస్ చేశామని చెప్పారు. సోమవారం మొత్తం ఆయనకు చికిత్స కొనసాగించారు. వైద్యం కొనసాగుతున్నా.. సోమవారం సాయంత్రానికి కృష్ణ ఆరోగ్యం మరింత విషమించిందని తెలిపారు వైద్యులు. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు వైద్యులు. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు.