తెలుగుపాటకు వెలుగులద్దిన రాజా

తెలుగుపాటకు వెలుగులద్దిన మ్యూజికాలజిస్ట్‌ రాజా


ఆయనకు సంగీతం జీవనం, జీవనాధారం, శక్తీ. ఆసక్తీ, మతం, భక్తీ ఆన్నీ. అతనే ‘మ్యూజికాలజిస్ట్‌ రాజా’ గా పేరుగాంచిన మంగు రాజా. ఆయన జయంతి ఈనెల 10. ఈ సందర్భంగా ఆయన విశేషాలు

రాజా శ్రీకాకుళంలో జూన్‌ 10, 1951 న జన్మించారు. రాజా అసలు పేరు మంగు నరసింహస్వామి. అతని తండ్రి ఎమ్‌.వి.ఆర్‌.పంతులు శ్రీకాకుళంలో పేరుగడిరచిన వకీలు. అతని తల్లి సుభద్రా దేవి మంచి వైణికురాలు. అతను 1972లో బీ.కామ్‌ పట్టభద్రుడయ్యారు. చిన్న వయసు నుండే సినిమాలు, సినీ సంగీతం పట్ల ఆసక్తి ఉండడంతో మంచి శ్రోత అయ్యారు. బాల్యంలో అభ్యసించిన జ్ఞానంతో యుక్త వయసులో సంగీత విమర్శకుడు అయ్యారు. కుటుంబం, స్నేహితులు ఇచ్చిన సహకారంతో రాజా సినీ సంగీత పై వ్యాసాలను రాయడం మొదలుపెట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. అప్పటినుండి వెనక్కు తిరిగి చూసే అవసరం లేకపోయింది.

రాజా ప్రతిభ ఆయన చేసిన పనులలో కనిపిస్తుంది. సంగీతం పట్ల ఆయనికి ఉన్న ఆసక్తి, ఏళ్ళ తరబడి చేసిన పరిశోధనల వల్ల వచ్చిన పరిజ్ఞానం ఆయనిని అద్వితీయ విశ్లేషకుడిగా నిలిపాయి. రాజా తను రాసిన వ్యాసాలూ, విశ్లేషణలు, విమర్శల ద్వారా సంగీత పత్రికా రచనలో ఒక కొత్త పంధాకి మార్గదర్శకులయ్యారు. ఆయన రచనలు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడమే కాకుండా కొత్త వారికి బైబిల్‌ లాగా ఉపయోగపడుతున్నాయి.

మ్యూజికాలజిస్ట్‌ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్‌ కూడా రాశారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తిని ముఖ్య పాత్రధారిగా చేస్తూ ప్రత్యక్ష పాత్రలతో రాజా రాసిన నవల ‘‘మల్లాది వెంకట కృష్ణమూర్తి’’ తెలుగు నవలా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అటువంటి ప్రయోగం అంతకు ముందు లేదు. ఈయన రచించిన మినీ కవితల సంకలనానికి డా.సి.నారాయణ రెడ్డి ‘మెరుపంత’ గా పేరు పెట్టారు. ఈ మినీ కవితల సంకలనాన్ని నారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చారు రాజా.

దూరదర్శన్‌ (తెలుగు ఛానల్‌) లో ప్రసారమైన ‘బుచ్చిబాబు’ అనే ధారావాహికకు రాసిన స్క్రిప్ట్‌ కు గాను రాజా బెస్ట్‌ డైలాగ్‌ రైటర్‌ అవార్డును అందుకున్నారు. రాజా కలానికి రెండు వైపులా పదును వున్నట్టుంటుంది ఆయన పద ప్రయోగం. శ్లేష, హాస్య చతురత ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.

రాజా రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రతి ఒక్కరి మనసును చూరగొంటాయి. ఆయన పనిచేసిన సంస్థలకు ఆయన ఒక గర్వ కారణంగా పరిగణించబడ్డారు. వార్త దినపత్రికలో వచ్చిన ‘ఆపాతమధురం ‘ అనే శీర్షిక ఆ దిన పత్రిక యొక్క సర్కులేషన్‌ ను పెంచింది. రాజా సంపాదకత్వంలో వచ్చిన హాసం అనే తెలుగు పక్ష పత్రిక ది బెస్ట్‌ మ్యాగజైన్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఈయన 800 లకు పైగా గుర్తించదగ్గ వ్యాసాలను, సన్మాన పత్రాలను కూడా రాశారు. వందకు పైగా సినీ సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. యస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడాలని ఉంది (మా టీవీ) కార్యక్రమ పరంపరలో రెండు ఎపిసోడ్‌ లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

హాసం సంపాదకుడిగా..
హాసం పత్రిక సంపాదకుడిగా రాజాకు మంచి పేరు వచ్చింది. భారతీయ సంగీతానికీ, హాస్యానికీ అంకితమైన తెలుగు పత్రిక ఇది. దీనికి సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టాక రాజా కాస్తా హాసం రాజాగా పేరు తెచ్చుకున్నారు. పత్రికలకు ఆదరణ తగ్గాక 2004లోనే ఈ పత్రిక ఆగిపోయింది. మ్యూజికాలజిస్ట్‌గా సినిమా పాటలను విశ్లేషించడంలో రాజా ప్రత్యేకత చూపేవారు. అంతేకాకుండా ఆ పాటల తమిళ, హిందీ, కన్నడ, బెంగాళీ, ఇంగ్లీషు పాటల మూలాలను వెలికితీసి పరిశోధించి పాఠకులకు అందించేవారు. ఢల్లీి తెలుగు అకాడమీ గతంలో ఉగాది పురస్కారాన్ని కూడా హాసం రాజాకు అందచేసి సన్మానించింది. తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై ‘ఆపాత మధురం’ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.

సినిమా పాటలను పరిశోధనాంశంగా తీసుకున్న కొద్ది వ్యక్తుల్లో రాజా ఒకరు. పాటలకు సంబంధించి మీడియా రంగంలో ఎవరికి ఎలాంటి సందేహం వచ్చినా రాజాను సంప్రదించేవారు. పాటలపై మీకు ఎందుకింత మమకారం అని ఓ సందర్భంలో ఆయనను ప్రశ్నించినప్పుడు ‘తెలుగు సినిమా పాటలకు సంబంధించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనేది నా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే పాటల పై పరిశోధన చేశాను. ప్రతి శ్రోతకీ పాటల వివరాలు అందుబాటులో ఉండటానికి రాజా మ్యూజిక్‌ బ్యాంక్‌.కామ్‌ ఏర్పాటు చేసి అందులో ఆ సమాచారాన్ని ఇస్తున్నాను. దాదాపు 40వేల పాటలకు సంబంధించిన పూర్తి వివరాలను నేను సేకరించాను’ అని వివరించారు.

అవార్డులు, సన్మానాలు
రాజా అందుకున్న అవార్డులు, సన్మానాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఇవీ : .
2002లో అనేక మంది సంగీతాభిమానుల అభిమానాన్ని పొందేలా హాసం అనే పత్రికను రూపొందించి నడిపినందుకు యూరోపియన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఈటా) నుండి అవార్డును రాజా గెలుచుకున్నారు.
2007లో మ్యూజిక్‌ జర్నలిజంలో అందించిన సేవలకుగాను మద్రాస్‌ తెలుగు అకాడమీ రాజాకు ‘సమైక్య భారత్‌ గౌరవ సత్కార’ అవార్డును అందించింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతీ ఏటా ఇచ్చే టీవీ నందీ అవార్డులలో 2006 సంవత్సరానికి గాను రాజా రూపొందించిన ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమం ఫస్ట్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్గ్‌ గా బంగారు నందిని పొందింది…అందుకు గాను మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున చేత రాజా ప్రత్యేకంగా సన్మానించబడ్డారు. 15 ఏప్రిల్‌ 2021న రాజా కాలధర్మం చెందారు.

Scroll to Top