తెలుగుపాటల పూదోట


*మే 22 వేటూరి సుందరరామ్మూర్తి వర్ధంతి
*******************
తెలుగు సాహిత్యభిమానులెవరికీ పరిచయం అవసరం లేని పేరు వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతాన్ని దేవభాష అంటుంటారు. ఆ సంగీతానికే తన సాహిత్యంతో ప్రాణం పోసిన ఋషి వేటూరి. ఆయన వర్ధంతి ఈనెల 22. ఈ సందర్భంగా ఆయనని గుర్తుచేసుకుందాం…

అన్నమయ్య పాటలని చాలా వాటిని వెలికి తీసినవారూ, పండితుడూ అయిన వేటూరి ప్రభాకర శాస్త్రి తమ్ముడి కొడుకు వేటూరి సుందరరామ్మూర్తి. ఆయన 29 జనవరి 1936 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించారు. మంచి సాహిత్య కుటుంబంలో పుట్టిన వేటూరికి సహజంగానే లిటరేచర్ మీద పట్టు ఉంది. సినిమాల్లోకి రాక ముందే “ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ” లాంటి గొప్ప పాట రాయడంలోనే అది తెలుస్తోంది. (చాలా సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ తన “సప్తపది” సినిమా కోసం ఈ పాటను ఉపయోగించారు).
మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రప్రభ పత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

కీరవాణి, వేటూరీ కలిసి ఎన్నో గొప్ప పాటలకి ప్రాణం పోశారు. “మాతృదేవోభవ”, “అన్నమయ్య” సినిమాలలోని పాటలని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్నమయ్య తన జన్మ దినం గురించి తానే రాసుకున్నాడా అనిపించేలా అద్భుత పద ప్రయోగంతో అన్నమయ్య సినిమాకి టైటిల్ సాంగ్ రాశారు. గర్భాశయాన్ని గర్భాలయంగా …ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం అంటూ చేసిన ప్రయోగాలు తనకే చెల్లాయి.

చివరి రోజుల్లో తనతో పాటలు రాయించుకునే అదృష్టం శేఖర్ కమ్ములకే దక్కింది. ఆ అదృష్టం మనది కూడా. ‘ఆనంద్’,’గోదావరి’ సినిమాల్లోని పాటలు సంగీత ప్రియులకు ఇప్పటికీ వీనుల విందు చేస్తున్నాయి. సప్తపది సినిమాలో ‘పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు”… “సీతాకోక చిలుక’ లో నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆకట్టుబడికి తరించేను ఆ పట్టుపురుగు జన్మ “,’శంకరాభరణం’ లో “ఉచ్చ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవ నాడులే వీణా గానాలు” .. “ఇలాంటి అపురూప పద విన్యాసాలు తన గీతాల్లో అడుగడుగునా కనిపిస్తాయి. తనకే సొంతమైన చిలిపి ప్రయోగాలెన్నో విన్న వారికి చక్కిలిగింతలు పెట్టేలా తన సాహిత్యంలో కనిపిస్తాయి.

ఇలా వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.

కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్, ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన, నాదవినోదము….ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.

సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించిన వేటూరి 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.

Scroll to Top