తొలితరం తెలుగు సినిమా దర్శకుడు పి పుల్లయ్య
మే 29 పుల్లయ్య వర్ధంతి.
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత.
తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిన తొలి తరం దర్శకుల్లో పి.పుల్లయ్యకు ప్రత్యేక స్థానం ఉంది. అద్భుత సినిమాలు నిర్మించి, తెరకెక్కించి తెలుగు సినిమాకు మంచి బాట వేశారు. 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో పుల్లయ్య జన్మించారు.
సినిమారంగంపై ఆయనకున్న మక్కువ ఎన్నో అద్భుత సినిమాలు రావడానికి కారణమైంది. 1935లో హరిశ్చంద్ర సినిమా ద్వారా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు కూడా తీశారు. ధర్మపత్ని, అర్ధాంగి, శ్రీ వెంకటేశ్వర మహత్యం, సిరి సంపదలుతోపాటు మరికొన్ని సినిమాలు ఆయన నిర్మాణంలో వచ్చాయి.
పుల్లయ్య 1937లో సారంగధర అనే సినిమాకు దర్శకత్వం వహించారు. రాజరాజ నరేంద్రుడి చారిత్రక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఇదే సినిమా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెలుగు, తమిళంలో వేరే దర్శకులు తెరకెక్కించారు. 1941లో దర్శక, నిర్మాతగా ధర్మపత్ని సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పి.శాంత కుమారి, భానుమతి తదితరులు నటించారు. అప్పటికే పి.శాంత కుమారిని పుల్లయ్య వివాహమాడారు. 1941లో సుభద్ర అనే కన్నడ సినిమా కూడా తీశారు. 1945లో పుల్లయ్య తెరకెక్కించిన మాయా మశ్చీంద్ర సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అప్పటికే వివిధ భాషల్లో వచ్చిన ఆరు సినిమాల ఇతివృత్తం తీసుకుని తెరకెక్కించారు.
1955లో తీసిన అర్ధాంగికి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అక్కినేనితో 1959లో తెరకెక్కించిన జయభేరి పుల్లయ్యకు మంచి పేరు తీసుకొచ్చింది. జయభేరికి ఉత్తమ చిత్రంగా అప్పట్లో మెరిట్ సర్టిఫికెట్ కూడా వచ్చింది.
తెలుగు చలన చిత్రరంగంలో తొలితరం దర్శకుడు పి. పుల్లయ్య. ఆయన ఒకే సినిమాను రెండు సార్లు తీశారు. మూడో సారి తీయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అదే శ్రీ వెంకటేశ్వర మహత్యం. దర్శకునిగా పి. పుల్లయ్య ప్రతిభ ఏంటో చెప్పడానికి ఈ సినిమా చాలు. ఈ సినిమాను రెండు సార్లు ఆయనే తీశారు. మూడో సారి కూడా తీయాలనుకున్నారు. కానీ కుదరలేదు. అప్పట్లో థియేర్లలో తెరలేపే ముందు శ్రీవేంకటేశ్వరుని పాట కూడా వచ్చేది. ఆ తరం వారికి గుర్తుండే వుంటుంది.
ఇక మొట్టమొదట తిరుమల వాసుని కథతో బాలాజీ చిత్రాన్ని తెలుగు వారి ముందు ఉంచింది పుల్లయ్య గారే. అదే కథను 1960లో మరోసారి ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ పేరుతో రూపొందించి మరోమారు తెలుగువారిని పులకింప చేశారు. ముఖ్యంగా రెండో సారి ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ రూపొందించినపుడు థియేటర్లే దేవాలయాలుగా మారాయని ఈనాటికీ చెప్పుకుంటారు. ఆ సమయంలో ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని కేంద్రాలలోనూ శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పారు.
ఆ విగ్రహాల వద్ద ఉంచిన హూండిల మొత్తం సొమ్మును సినిమా తీసేంత వచ్చిందని అంటుండేవారు. ఇక ఆయన భార్య నటి శాంతకుమారి. ఆయన చేసిన సినిమాలలో బాగా పేరుండేవి చాలానే వున్నాయి. అర్థాంగి, జయభేరి, సిరిసంపదలు, మురళీకృష్ణ, కొడుకు కోడలు వున్నాయి.
పుల్లయ్యకు పలు అవార్డులు వచ్చాయి. 1960లో ఎన్టీఆర్ తో శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా తీశారు. 1962లో తీసిన సిరిసంపదలుకు ఉత్తమ చిత్రంగా మెరిట్ సర్టిఫికెట్ వచ్చింది.
‘రేచుక్క, కన్యాశుల్కం’ చిత్రాలను ఎన్టీఆర్ తో తెరకెక్కించారు పి. పుల్లయ్య. వీటిలో ‘కన్యాశుల్కం’ రిపీట్ రన్స్ లోనూ శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అందుకే 1981లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. విశేషం ఏమంటే పుల్లయ్య సతీమణి శ్రీమతి శాంతకుమారికి కూడా 1999లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
తెలుగు సినిమా పురోగతికి పుల్లయ్య చూపిన దారి ఎంతో దోహదపడిందనే చెప్పాలి. ఎన్నో క్లాసిక్స్ అందించిన పుల్లయ్య 1985 మే29న మరణించారు.