జూలై 3 ఎస్వీఆర్ జయంతి
అది 1964 మే 5 రాత్రి 9 గంటల సమయం……. అతి ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనంబాకం విమానాశ్రయం వెలుపల అసంఖ్యాకమైన జనసందోహం వేచి చూస్తున్నారు. వారికి స్వాగతం చెప్పటానికి నటరత్న ఎన్టీఆర్, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తదితరులు విమానాశ్రయం ముఖద్వారం వెలుపల పూలమాలలు పట్టుకుని నిలబడి ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా జనం వచ్చి పడటంతో ఇంకా చాలామంది సినీ నటులు ముఖద్వారం దాకా రాగలిగే పరిస్థితి లేక దూరంగా ఆగిపోవాల్సి వచ్చింది.

ఎట్టకేలకు రావలసిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపించారు. అతిథి అంటే మామూలు అతిథి కాదు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి. నర్తనశాల సినిమాకు గాను రంగారావుకి అంతర్జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వచ్చింది. అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుని తిరిగి వస్తున్న నట యశస్వి ఎస్.వి. రంగారావు విమానాశ్రయం ముఖద్వారం దగ్గరకు రాగానే జన కోలాహలంతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతులో తెలుగు వారికన్నా తమిళ గొంతులే ఎక్కువగా వినిపించాయంటే, ఎస్వీ రంగారావు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తిపొందారో అర్థం అవుతుంది. ముందుగా ఎన్.టి. రామారావు పూలమాలవేసి రంగారావుని ఆలింగనం చేసుకున్నారు.
విశ్వనట చక్రవర్తి గా గుర్తింపు పొందిన ఎస్వీ రంగారావు (సామర్ల వెంకట రంగారావు) కృష్ణా జిల్లా లోని నూజివీడు లో, 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వర నాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశారు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజ్ శాఖలో పని చేసేవారు. ఆయనకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగా రత్నమ్మ పర్యవేక్షణలో పెరిగారు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడం తో అతనులో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. మద్రాసులో ఎస్. ఎస్. ఎల్. సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి. కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశారు. మద్రాసులో చదువులో అంతంత మాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం.
నాటకాల్లో…

ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల అతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలిపెట్టలేదు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అతనుకు ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది.
నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే చొలెనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో, తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు.
సినిమాల్లోకి ….
ఎస్వీఆర్ నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. ఈ సినిమా ద్వారా ఎస్.వి.ఆర్.రావ్(బి.ఎస్సీ) అనే స్క్రీన్ నేమ్ తో పరిచయమయ్యారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో అతనుకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు. జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతను వేషాలు వేసేవారు. రెండేళ్లపాటు జాబ్ చేసి, 1947 డిసెంబరు 27న తన మేనమామ బడేటి వెంకట్రామయ్య కూతురు లీలావతిని పెళ్ళి చేసుకున్నారు.

మళ్ళీ సినిమా ఆఫర్ రావడంతో జంషెడ్పూర్ నుంచి వచ్చేసి నటనపైనే దృష్టి పెట్టారు. కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఎ. వి. సుబ్బారావుకు ఇచ్చేశారు. బి. ఎ. సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగారు. అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకిచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది. ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ ‘బంగారు పాప’ సినిమాలో ఎస్వీ రంగారావు నటనకు ఫిదా అయ్యారు. “ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడని అన్నారు.” ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం. “ఎస్వీఆర్ పొరపాటున మన దేశంలో పుట్టాడు కానీ, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి అనిపించుకునేవాడని” సీనియర్ నటుడు గుమ్మడి ఓ సందర్భంలో అన్నారు.
ఇతర భాషల్లోకి
1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్ళి చేసి చూడు సినిమాను తమిళంలో కల్యాణం పణ్ణి పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నై, శారద, కర్పగం, నానుం ఒరుపెణ్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు పొందారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై భీ లడ్కీ హూ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.
కదిలితే నటన, పలికితే డైలాగ్
‘దీపావళి’, ‘అనార్కలి’, ‘మహాకవి కాళిదాసు’, ‘భట్టివిక్రమార్క’, ‘బొబ్బిలియుద్ధం’, ‘చరణదాసి’, ‘లక్ష్మీ నివాసం’, ‘జయభేరి’ ఇలా ఒక పాత్రకు మరో పాత్రకూ సంబంధం లేకుండా జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన అభినయంలో ప్రదర్శిస్తూ, తన గొంతులో ధ్వనింపచేసిన నటవిరాట్టు రంగారావు.
ఆయన కదిలితే నటన, పలికితే డైలాగ్ అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో! పింగళి, సముద్రాల.. ఇంకా అనేకమంది గొప్ప రచయితలు ఆయనలోని నట విరాట్ రూపాన్ని ఆవిష్కరింపచేశారు. ‘ఘూట్లే’, ‘డోంగ్రే’, ‘కత్తుల రత్తయ్యని-పచ్చి రక్తం తాగుతా’ లాంటి డైలాగులు ఇప్పటికీ లోకవ్యాప్తిని పొందుతూనే ఉన్నాయి. పాతాళభైరవి సినిమాలో ‘మహాజనానికి మరదలు పిల్ల’, ‘శృంగారం శాయవే బుల్బుల్’, ‘సాహసం శాయరా డింభకా’.. ఇలా ఆయన నోట పలికిన ప్రతీ మాటా ప్రసిద్ధమే! నటసార్వభౌమ, నటసింహ, విశ్వనటచక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ‘భక్తప్రహ్లాద’, ‘చెంచులక్ష్మి’, ‘దీపావళి’.. ఇలా ఒకటేమిటి ఆయన నటించిన ప్రతీ చిత్రమూ ఒక మహాద్భుత రససాగరమే! ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు లభించాయి.

‘నర్తనశాల’లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. ‘పెళ్లిచేసి చూడు’లో ధూపాటి వియ్యన్నపాత్ర, ‘చదరంగం’లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి పాత్ర, ‘తోడికోడళ్లు’లో మతిమరుపు లాయరు కుటుంబరావు పాత్ర, ‘కత్తుల రత్తయ్య’లో రౌడీపాత్ర, ‘అనార్కలి’లో అక్బర్ పాత్ర, ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడిపాత్ర… ఒకటేమిటి… తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయే పాత్రలెన్నో ఆయన నటించినవి ఆయన ఙ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. ‘ఆఁ! బానిస! బానిసకింత అహంభావమా?’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నిజంగా అనితరసాధ్యమైనదే! భావస్ఫోరకమైన విరుపు, అందమైన, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ ఆంగికాభినయాలు ఆయన స్వంతం. రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు.
ప్రజలకు రకరకాల సినిమా పాటలు గుర్తుంటాయి. వాటితోపాటుగా ఎస్వీఆర్ డైలాగులూ నేటికీ ప్రజల మనసుల్లో నిలిచి ఉండటమే ఒక అద్భుతం. ‘డబ్బుకులోకం దాసోహం’ లాంటి సినిమాల్లో ఆయన నటించిన కఠినాత్ముడి పాత్రలు తరువాతి తరం విలన్లకు పాఠ్య గ్రంథాలుగా ఉపయోగపడతాయి. ‘గుండమ్మకథ’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘దసరాబుల్లోడు’ సినిమాల్లో ఆయన నటన అనితరసాధ్యం అనిపిస్తుంది. 150 తెలుగు సినిమాలలోనూ, 87 తమిళ సినిమాలలోనూ, 2 కన్నడ సినిమాలలోనూ, 3 మళయాళ సినిమాలలోనూ, 3 హిందీ సినిమాలలోనూ ఆయన నటించారు. ఆయన ఎంతటి నటుడో అంతటి కథారచయిత కూడా! వారి కథలు ఆంధ్ర సచిత్ర వారపత్రిక, యువ, వెండితెర తదితర పత్రికల్లో అచ్చయ్యాయి.
1974 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోదకృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.
