బహుముఖ ప్రజ్ఙాశాలి బాపు – *ఈనెల 15 బాపు జయంతి
***********************************************
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!….అని ఆరుద్రచేత పద్యాభిషేకాన్ని పొందిన బహుముఖ ప్రజ్ఙాశాలి బాపు. తెలుగునాట పేరెన్నికగన్న ప్రముఖులలో ఆయనొకరు. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ అసంఖ్యాకం. సినీదర్శకునిగా కూడా విలక్షణ ముద్ర వేసిన బాపు జయంతి ఈనెల 15. ఈ సందర్భంగా ఆయన గురించి ముచ్చటించుకుందాం…
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933న పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే ‘బాల’ అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు ‘అమ్మమాట వినకపోతే’ అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు… కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ ‘కోతికొమ్మచ్చి’ ‘బుడుగు’లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బాపు లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.
బాపు చిత్రకళ ఒకే ఆంశానికి మాత్రమే పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా వేశారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ – అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు ఏరి కోరి సేకరిస్తుంటారు.
బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై – ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించాడు. ఆయన చిత్రాలలో… పొదుపుగా గీతలు వాడటం, ప్రవహించినట్లుండే ఒరవడి, సందర్భానికి తగిన భావం, తెలుగుదనం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి.
బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పనిచేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ఇందులో బుడుగుతో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి. ఈయన గీసే అమ్మాయిల బొమ్మలు అందానికి నిర్వచనంగా మారి అందమైన అమ్మాయి అంటే బాపు గీసిన బొమ్మ అనడం ఆనవాయితీగా మారింది.
ప్రతి తెలుగు ప్రారంభ పత్రిక ముఖచిత్రం బాపు గీసిందే కావాలనే ది ప్రతి ఒక్కరి కోరిక. ఆంధ్ర పత్రిక ప్రముఖ వ్యక్తుల పేర నిర్వహించిన శీర్షికకు రేఖా చిత్రాలను బాపు నే గీసారు. మరో పత్రిక బాపు గీసిన బొమ్మకు కథను రాసే పోటీని నిర్వహించింది. 1974 లో ఇంగ్లీషు,ఫ్రెంచి భాషలలో పిల్లల కోసం రామాయణాన్ని తనదైనశైలిలో బొమ్మలతో చెప్పారు. దీనికి కొనసాగింపుగా మహాభారతం ను, శ్రీకృష్ణలీలలను కూడా రూపొందించారు.
1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976 లో వెలువడిన ‘సీతాకల్యాణం’ సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా (స్టోరీబోర్డు) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కించేవారు. ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరిస్తారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవారు. బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు.
బాపు చిత్రకారునిగా పలు పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు. పత్రికల్లో కథలకు, నవలలకు ఆయన వేసిన చిత్రాలు మౌనవ్యాఖ్యలుగా అమరాయి అని విమర్శకులు బాపు బొమ్మల్ని ప్రశంసించారు. అమరావతి కథలు ముందుమాటలో సత్యం శంకరమంచి రాసిన కథలతో పాటు ఆ కథలకు బాపు వేసిన చిత్రాల గురించి కూడా ముళ్ళపూడి వెంకటరమణ సమాన ప్రాధాన్యతతో విశ్లేషించారంటే వాటి ప్రభావాన్ని గురించి అంచనా వేయవచ్చు. వంశీ “మా పసలపూడి కథలు”, పుట్టపర్తి నారాయణాచార్యుల “శివతాండవం” వంటి ఎన్నో రచనలకు బాపుబొమ్మలు అదనపు విలువను తీసుకువచ్చాయని చేప్తూంటారు. బాపు రచనలను పూర్తిగా చదివి, రచయిత హృదయాన్ని అవగతం చేసుకుని వేసే బొమ్మలు సాహితీలోకంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పలువురు రచయితలు తమ రచనలు బాపుబొమ్మలతో ప్రచురణ పొందడాన్ని సార్థకతగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. శ్రీరమణ రచించిన ప్రఖ్యాత “మిథునం” కథ ఎంతగానో నచ్చడంతో బాపు దాన్ని తన దస్తూరిలో తిరగరాసి ఒక ప్రశంసగా రచయితకు పంపారు. తరువాతి కాలంలో దస్తూరీ తిలకం పేరిట ఆ కథను బాపు దస్తూరిలో ఆయన ఆ కథకు వేసిన పలు బొమ్మలతో ప్రచురించారు. సాహిత్యంలో బాపును గురించి పలు ప్రస్తావనలు వచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన ఆత్మకథ కోతికొమ్మచ్చిలో రమణ ఆప్తమిత్రుడైన బాపు జీవితాగమనం కూడా రాశారు. అందుకే ఇది తన ఒక్కడి ఆత్మకథే కాదని తన ఆత్మబంధువైన బాపు కథ కూడా అని రమణ పలు సందర్భాల్లో ప్రకటించారు.
1986-88 వరకూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు ముళ్ళపూడి వెంకట రమణలు పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమం లోనికి మార్చారు.
విద్యారంగంలో దీనిని ఒక వినూత్న ప్రయత్నంగా ప్రారంభించారు. బాపు వయోజన విద్య కోసం కూడా పాఠ్యాంశాలను సిద్ధపరచారు. బాలల దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో బుడుగు పాత్రను సృష్టించారు. ఇది తెలుగు సాహిత్యం లోనే ఒక మకుటాయమానంగా నిలిచిపోయింది. 1964లో బెంగళూరులో జరిగిన యునెస్కో పిల్లల పుస్తకాలపై నిర్వహించిన సెమినారుకి ప్రతినిధిగా పాల్గొన్నారు. అదే సంవత్సరం చెన్నైలో యునెస్కో నే నిర్వహించిన పుస్తక ముఖచిత్ర రచన, అంతర్ చిత్రాలను గీసే తర్ఫీదు నిచ్చే కార్యక్రమాన్ని బాపు కే అప్పగించారు. 1960లలో ఫోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాధి బుక్ ట్రస్ట్ కి చిత్ర రచనాసలహాదారుగా సేవలందించారు.
బాపు చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2014, ఆగష్టు 31న మరణించారు.
