వెండితెరపై నవ్వుల జల్లు – అల్లు

వెండితెరపై నవ్వులు పూయించిన అల్లు రామలింగయ్య

తెలుగు సినిమా నవ్వులతోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య… ఆయన పేరు గుర్తుకు వస్తే చాలు జనం పెదాలపై చిరు నవ్వులు విరబూస్తాయి. అక్టోబర్ 1న ఈ నవ్వుల రేడు అల్లు రామలింగయ్య జయంతి.

పాత్ర చిన్నదైనా, పెద్దదైనా సరే ఇట్టే అల్లుకు పోయి, అల్లరి చేసి, నవ్వులు పూయించి అలరించేవారు అల్లు రామలింగయ్య… వెయ్యికిపైగా చిత్రాల్లో అల్లు అభినయం జనానికి కితకితలు పెట్టింది… వెండితెరపై అల్లు నవ్వుల గిల్లుడు తలచుకుని ప్రేక్షకులు పదే పదే నవ్వుకునేవారు… అల్లు అభినయం గుర్తుకొస్తే చాలు నవ్వుల పువ్వులు పూయాల్సిందే.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. అతని తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవి. అతను దాన గుణం వల్ల అవి కరిగిపోయాయి. అతని కుమారుడు అల్లు వెంకయ్య మరల వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కుకున్నాడు. వెంకయ్య సతీమణి సత్తెమ్మ. వీరికి నరసయ్య మూర్తి, నారాయణ మూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం ఏడు మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్యని పేరు పెట్టుకున్నారు.
రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నారు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసారు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించారు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చారు. అలా మొదలైంది అల్లు నట జీవితం.
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లారు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపారు.

చిత్రసీమలో
అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది.
పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చారు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు.

ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నారు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తి కట్టించారు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక అతనికి తీరలేదు. ఆతను అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో పెద్ద హిట్.

అల్లు రామలింగయ్య తెరపై కనిపిస్తే చాలు, నవ్వులు ఇట్టే పూసేవి. ‘పరివర్తన, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ’ చిత్రాలతో అల్లు రామలింగయ్య మంచి గుర్తింపు సంపాదించారు. ‘మంచిమనసుకు మంచిరోజులు’లో ప్రతినాయకుని అనుచరునిగా నటించి మెప్పించారు. పెద్దా,చిన్నా అన్న తేడా లేకుండా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించేవారు రామలింగయ్య. పైగా ఆయనకు హోమియోపతి వైద్యంలోనూ మంచి ప్రవేశం ఉంది. దాంతో చిత్రసీమలోని వారికి తగిన వైద్యం చేస్తూ సాగేవారు. అందువల్ల అందరితోనూ ఇట్టే కలిసిపోయేవారు. అందరూ ఆయనంటే ఎంతగానో అభిమానించేవారు. ‘నాదీ ఆడజన్మే’ చిత్రంలో సావిత్రి, జమున అన్నయ్యగా కరుణరసమైన పాత్రలో అల్లు రామలింగయ్య ఆకట్టుకొనే అభినయం ప్రదర్శించారు. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో తప్పకుండా అల్లు రామలింగయ్యకు తగిన పాత్రలు ఉండేవి. అల్లు కూడా ఆ పాత్రల్లో తనదైన బాణీ పలికించేవారు.

అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్‌ నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు భలే జబ్బు చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ఆమ్యామ్య.. అప్పుం అప్పుం లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.

యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో ‘ పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత ‘ పద్మశ్రీ’ అందుకున్న హాస్యనటుడు అల్లునే. 2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ‘ రఘుపతి వెంకయ్య ‘ అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో అతను విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం ‘జై ‘ అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసారు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతను హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలా బిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.

ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి..
ఎందరో మహామహులతో అల్లు రామలింగయ్య కలసి అభినయించిన తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది… తెలుగు చిత్రసీమ ఎంతోమంది హాస్యనటులను చూసినా, అల్లువారిలాగా అల్లుకు పోయిన వారు మరొకరు కానరారు.తనకు లభించిన ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి జనం పెదాలపై నవ్వులు నాట్యం చేసేలా చూసేవారు అల్లు. కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా నటించినా వాటిలోనూ నవ్వులే పూయించేవారు. అదీ అల్లువారి బాణీగా నిలచిపోయింది. తరువాతి రోజుల్లో ఎందరో హాస్యనటులు ఆయన బాటలోనే పయనించి, తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు చిత్రసీమలో హాస్యం గురించిన చర్చ సాగిన ప్రతీసారి అల్లు రామలింగయ్య పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ నాటికీ బుల్లితెరపై కనిపించే ఆ నాటి అల్లువారి అభినయం చూసి జనం మురిసిపోతూనే ఉండడం విశేషం!

Scroll to Top