హాస్యానికి చిరునామా


చిత్రసీమలో హాస్యబ్రహ్మ జంధ్యాల ** జూన్ 19 ఆయన వర్ధంతి..
************
తెలుగు చిత్రసీమలో అవధులు లేని ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామా జంధ్యాల. హాస్యబ్రహ్మగా ఘనకీర్తి పొందిన ఆయన వర్ధంతి ఈనెల 19. ఈ సందర్భంగా ఆయనని గుర్తుచేసుకుందాం….

“నవ్వడం యోగం… నవ్వించడం భోగం… నవ్వకపోవడం రోగం…” అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి.

జంధ్యాల అన్నది ఆయన ఇంటిపేరు. అసలు పేరు వీరవేంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న జంధ్యాల నరసాపురంలో జన్మించారు. పండితుల ఇంట పుట్టడం వల్ల చిన్నతనంలోనే సాహిత్యాభిమానం నెలకొంది. తెలుగులో గొప్పకవుల రచనలన్నీ చదివారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి ప్రదర్శించేవారు. ఆయన రాసిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ తెలుగునేలలోనే కాదు, చుట్టుపుక్కల రాష్ట్రాల్లోనూ వేల ప్రదర్శనలు చూసింది. ఓ నాటక ప్రదర్శనలో మహానటుడు గుమ్మడితో పరిచయం కలిగింది. ఆ సమయంలో గుమ్మడి, జంధ్యాలను సినిమాల్లో రచయితగా ప్రయత్నించమని సూచించారు. ఆ సూచన పట్టుకొనే గుమ్మడి తనయుడు హీరోగా నటించిన ‘పుణ్యభూమి కళ్ళు తెరిచింది’లో ఓ పాట రాశారు. తరువాత ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రంతో మాటల రచయిత అయ్యారు. తరువాత కె.విశ్వనాథ్ “సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం” వంటి చిత్రాలకు మాటలు రాసి మురిపించారు. అలాగే “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు” చిత్రాల్లో జంధ్యాల పలికించిన పదాలు జనాల పెదాలపై చిందులు వేశాయి.

1976 లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టాడు. ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందాడు.

జంధ్యాల చేసి వడ్డించిన భాషాపరోటాలను ఆరగించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జంధ్యాల మార్కు మాటల తీరు వేరుగా ఉంటుంది. ప్రాస కోసం ప్రయాసపడి పరేషాన్ చేసేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ, ఏ భాషలోనైనా, ఏ యాసతోనైనా ప్రాసల పాయసాలు చేయగల నేర్పు ఓర్పు జంధ్యాల సొంతం. పదాలతో రిథమ్ సృష్టించగల దిట్ట జంధ్యాల. కావాలంటే “ఈస్ట్, పేస్ట్, టోస్ట్…” అంటూ ‘వేటగాడు’లో జంధ్యాల కలం పలికించిన పదవిన్యాసాలతో కాసేపు సాగండి. మళ్ళీ మళ్ళీ ఆ యాసతో సాగినా ఏ ఆయాసం మీ దరి చేరదు. పై పెచ్చు వీలుంటే మరోమారు ఆ పదవిన్యాసాలతోనే సాగాలనిపిస్తుంది.

‘విజయావారి’లాగా వినోదాలతోనే జనాన్ని మైమరపించాలని ఎందరో రచయితలు భావించేవారు. అలా రచనలు చేసి ఆకట్టుకున్న వారికి కొదవే లేదు. ఆ రీతినే ఎంచుకున్నారు జంధ్యాల. మెగాఫోన్ పట్టి తొలుత ‘ముద్దమందారం’ పూయించారు. తరువాత ఏకబిగిని సినిమాలు తీశారు. ఆ తీతలోనూ, ఆయన రాతలోనూ మనసులను కట్టిపడేసిన సన్నివేశాలూ ఉన్నాయి. గిలిగింతలు పెట్టిన మాటల కోటలూ ఉన్నాయి. వాటిలో ఒకసారి ప్రవేశిస్తే చాలు మళ్లీ రావాలనిపించదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ కోటలు బీటలు వారకుండా తెలుగువారికి నేటికీ వినోదాల విందు అందిస్తూనే ఉన్నాయి. ఇంతలా వినోదాలు పంచిన జంధ్యాల నటనలోనూ ఘటికుడే అనిపించుకున్నారు. కె. విశ్వనాథ్ తలపులో మెరసిన ఓ ఊహకు తన అభినయంతో జంధ్యాల ప్రాణం పోసిన తీరును ‘ఆపద్బాంధవుడు’లో చూసి తీరాల్సిందే.

జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు

వివాహ భోజనంబు చిత్రం నుంచి…

మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ– (ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే, వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే, ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు… (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.

వేటగాడు చిత్రం నుంచి….

రావు గోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా” అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు – ” రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా ఫస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా ఫీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ” అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి – ” ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు” అంటాడు.

జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద. ఆయన లేని లోటు ఇంతవరకూ ఎవరూ పూరించలేకపోయారు.

Scroll to Top