నమస్కారం అని పలకరించే సంస్కారం మనది. నోటి బుట్టలో పద పండ్లను తీసుకొని తెలుగుదనపు పంచదారనద్ది గౌరవపు గౌను తొడిగి అలంకారాల గాజులు వేసి ఛందో గజ్జెలు కాళ్ళకు పట్టించి పరభాషా మదగజంపై తెలుగు కన్యను ఊరేగింపుకు పంపిన ఘనత మనది. దిక్కులు పిక్కటిల్లేలా తెలుగు భాషను వినిపించిన గళం మనది. అరటితోటల సోయగంలా నిగనిగలాడే తెలుగు పదాల పోహలింపు మరే భాషకుంది. నుడికారాలు నానుడులు పదబంధాలు పడికట్టు పదాలు సామెతలు చిత్ర విచిత్ర పద్యాలు రసోపేత గద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనంత విశ్వం దాటి పోతాము.
ఎల్లలు దాటిన గొల్లని మాట భగవద్గీత గా పేరుపొంది కర్తవ్య నిర్దేశం చేసింది. పుట్ట దేవర కలంలో పుట్టిన రామాయణం జీవన పారాయణం అయింది. మంచె నెక్కిన పోతన మంచి మాట భాగవతమై పరిఢవిల్లింది. మనుచరిత్ర లో పుట్టిన ప్రబంధ వనిత వేంకటేశ్వర మహత్యము చే పరమ పవిత్రమైనది. శ్రీ రంగ రాజ చరిత్ర తో అడుగేసిన నవలామణి అత్యాధునిక కవిత్వ మార్గంలో నిత్య పఠణీయ మైంది. ఇలా తెలుగు భాష విరాట్ రూపమై వామన మూర్తి గా మారి అందరినీ ఆకట్టుకుంది.
తెలుగు ను ప్రేమించే వారి సంఖ్య చాలా ఎక్కువ. “ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము” అని రాయప్రోలు వారు అన్నట్లు నేను కర్ణాటకాంధ్ర సరిహద్దులో ఉన్న బిళ్ళూరు గ్రామంలో పుట్టి తెలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించి వృత్తి రీత్యా ఆస్ర్టేలియా వచ్చి స్థిరపడ్డాను. ఆంగ్లం ఉద్యోగ నిమిత్తమేనన్న సత్యాన్ని గ్రహించి తెలుగునే శ్వాస గా గుండె ఘోష గా మార్చుకున్నాను. ప్రవాస వాసంలో భారతీయతతో పాటు భాషా పరంగా కూడా మన ఉనికిని చాటాలని నిశ్చయించుకొని తెలుగు సంఘంలో స్థానం సంపాదించుకొని తెలుగు భాషా వికాసానికి తోడ్పడుతున్నాను.
సంపాదించిన సంపద కన్నా వ్యక్తిత్వాన్ని నిలిపిన భాష మిన్న. భాష కోసం తహతహలాడిన గిడుగు అంటే నాకు ఎనలేని అభిమానం. పాండిత్య ప్రతిభ అంతగా లేని నా లాంటి వారికి గిడుగు అడుగులే మార్గదర్శకం అంటే అతిశయోక్తి కాదు. స్వదేశంలో మాతృభాష నేర్చి విదేశంలో భాషా వ్యాప్తికి కృషి చేయటం నా పూర్వ జన్మ సుకృతం.
భాష గురించి చెప్పాలంటే ఒక యుగం తపస్సు చేయాలి. స్వదేశంలో భాష పట్ల నిజం చెప్పాలంటే పండితులకే పరిమితం అన్న నానుడి ఉంది. అందుకే చాలా మందికి వాడుక భాష మీద వ్యామోహం పెరిగింది. గిడుగు వారి పుణ్యమా అని అన్ని చోట్లా వాడుక భాష అమలు లోకి వచ్చింది. వాడుక భాషలో రచనలు రావటం వల్ల చాలా విషయాలు ఎంతో బాగా అర్ధం అవుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియాలో వాడుక భాషలోనే అందరిని నడిపించడం కోసం తెలుగు వాణి, తెలుగు వాహినీ, తెలుగు బడి అనే పేరుతో స్థాపించిన సంస్థలలో నావంతుగా తెలుగు అభివృద్ధికి తోడ్పడుతున్నాను.
తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి. ఇలాంటి రచనలన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి. ఇప్పుటి కాలంలో పిల్లలందరు తెలుగు భాషకి దూరం అవుతున్నారు. ఏ కళాశాలలో చూసినా, బడిలో చూసిన ఒక ఆంగ్ల భాషకే ప్రాధ్యానత ఇస్తున్నారు, తెలుగు భాషకి ప్రాధ్యానత ఇవ్వడం లేదు. రాబోయే కాలంలో తెలుగు అనేది కనుమరుగు అవుతుంది అని చాల మంది అనుకుంటున్నారు.
‘‘తెలుగుభాష తీయదనం.. తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం’’ అని సినీ గేయ రచయిత చంద్రబోస్ పాట అక్షర సత్యం. నిజానికి మనం చిన్నప్పుడే బడిలో ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’’, ‘‘తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా’’ అంటూ తేట తెలుగులో పాటలు పాడేవారం. కానీ, ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం బడులు వచ్చి పిల్లలకు ఇవన్నీ దూరమవుతున్నాయి. కనీసం తల్లిదండ్రులైనా ఇళ్ళ వద్ద పిల్లలకు మన తెలుగును బోధించి, మాతృభాష గొప్పతనాన్ని చెప్పాలి.
తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాషా వాజ్మయములో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్యను రాజరాజు ఆదరించాడు. తిక్కనను మనుమసిద్ది, ఎర్రాప్రగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాధిస్తారు. సాహితీ భోజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు.
తెలుగును పరిపాలనా బాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారాబాష గా ప్రవేశపెట్టిన బిల్లు చట్టం అయింది. ప్రబుత్వ శాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రబుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార బాషా సంఘం” ఏర్పడింది.
భాషా సంఘాలు ఉన్నా పాలనలో పారదర్శకత ఉన్నా తెలుగుకు సరైన గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం. తెలుగు వచ్చిన వారు కూడా ఇతర భాషలలో మాట్లాడటమే. ఈ విధానానికి స్వస్తి పలికిన నాడు మన తెలుగు తప్పక మరింత కీర్తిని పొందుతుంది. సాధ్యమైనంత వరకు పండితులు వ్యవహారిక తెలుగును వాడటం వలన తెలుగంటే భయం పోయి విద్యార్ధులలో ముఖ్యంగా యువతలో తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడుతుంది. అక్షర సాక్షాత్కారం పొందిన ఏ పండితుడయినా తాను పొందిన అనుభవాన్ని అతి సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా వివరించ గలిగితే తెలుగు భాష పెద్దలు అన్నట్లు అజంత భాషగా అమర భాషగా విరాజిల్లుతుంది.
పెద్దల మాటల్లో తెలుగు కవిత
ఆరుద్ర
1. తేనె కన్నా మధురం రా తెలుగు ,ఆ –తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగు గడ్డ పోతు గడ్డ ఎంత పచ్చన ,మా –తెలుగు గుండెలో స్నేహము ఎంత వెచ్చన !
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన ,మన
తరతరాల కధను పాడు గుండె ఝల్లన –పాటు పడిన వాళ్ళకే లోటు లేదని
చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి -లలిత కళలు సంగీతం సాహిత్యం
తెలుగుతల్లి జీవితాన దిన కృత్యాలు
గత చక్రిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి !-గర్వించదగ్గ జాతి తెలుగు జాతి
అయినా గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం –ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం ”
2. నండూరి రామ కృష్ణ మాచార్యులు
తరపి వెన్నెల ఆణి ముత్యాల సొబగు -పునుగు జవ్వాజి ఆమని పూల వలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు -కలసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష
3. కుందుర్తి
తీరి బంగారు పందేడు తెలుగు నేల -తేట నీటితో ప్రవహించు తెలుగు నదులు
తెలుగు వాసిని ప్రకటించు తెలుగు గిరులు -తలచు కొన్నంత నా మేను పులకరించు
4. త్యాగ రాజు
నన్నుగన్న తల్లి ! నా భాగ్యమా -నారాయణి ధర్మాంబికే!
నన్నుగన్న తల్లి ! నా భాగ్యమా -నారాయణి ! ధర్మాంబికే
కనకాంగి! రమా పతి సోదరి -కావవే నను కాత్యాయినీ !
నను గన్న తల్లి !నా భాగ్యమా -నారాయణి ! ధర్మాంబికే
కావు కావు మనినే మొర బెట్టగా -కమల లోచన !కరగు చుండగా
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? సదా వరం బొసగు త్యాగ రాజనుతే
నన్ను గన్న తల్లి ! నా భాగ్యమా !నారాయణీ!- ధర్మాంబికే!
5. శ్రీ శ్రీ
పదవోయి తెలుగు వాడా
అదే నీతెలుగు మేడా
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్ర శాల
6. దాశరధి
తెలుగు పులుగు చేరని దేశం లేదు
తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు
7. గురజాడ రాఘవ శర్మ
తెలుగు దేశమేనాయది ,తెలుగు వాడ –తెలుగు తల్లి యనుంగు చేతులను బెరిగి
తెలివి గొంటిని ,మంటని ,తెలుగు తల్లి –పేరు నిలుపుటే యాశ యూపిరి జెలంగ
8. రాయప్రోలు సుబ్బా రావు
పాల క్రోమ్మీగడల్ పచ్చి వెన్నయు నిచ్చి –తీయని నును పూసా లాయెనేమో
కమ్మని మకరంద కణములు స్నేహించి -చిన్నారి పలుకులి చిక్కే నేమో
పూల లావణ్యంబుపొంగి చక్కదనాల –పిందెలై రుచి లెక్కి పెరిగెనేమో
సెలయేటి యుయ్యాల కులుకు టొయ్యారముల్ -ముద్దు ముచ్చట లయి
పాటకును ,పద్యమునకును నబ్రముగా నొదిగి -చవికి చాతుర్యమునకు ,సాజముగా సాగి
పోరునకు ,పొత్తు నకు జాతి పొంది పొసగు –మా తెలుగు తల్లి మెడకిదే మల్లె దండ .
9. వేముల పల్లి శ్రీ కృష్ణ
చేయెత్తి జైకొట్టు తెలుగోడా -గత మెంతో ఘనకీర్తి కలవాడా
సాటి లేని జాతి -ఓట మెరుగని కోట -నివురు గప్పి నేడు –నిదుర పోతుండాది-
-జే కొట్టి మేల్కొలుపు తెలుగోడా–గత మెంతో ఘన కీర్తి కల వాడా
10. త్రిపురనేని రామ స్వామి చౌదరి
తేట మాటల దెలియ జెప్పుము –దిక్కు లన్నియు మారు మ్రోగిన
తెలుగు వారల పేరు పెంపును -దెలియ కుండగ నుండ బోకుము
తెలుగు బాలుడ !ఇంపు నింపుము –తెలుగు బాలుడ !పేరు పెంపుము
తరాలు మారిన తరగని ఆస్తి మన మాతృభాష. మాతృత్వం భాషాభిమానం ఎనలేని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే జై మాతృభాష అనే నినాదం అందరిలో ఉండాలి
కోడూరు రామమూర్తి, సిడ్నీ, ఆస్ట్రేలియా