
తెలుగు రంగస్థలంపై చెరగని ‘స్థానం’ – *సెప్టెంబర్ 23 స్థానం నరసింహారావు జయంతి
తెలుగునాట తన అద్వితీయమైన కళా కౌశలంతో నటనకు జీవం పోసిన ప్రతిభాశాలి స్థానం నరసింహారావు. రంగస్థలంపై చెరగని ‘స్థానం ఆయనది. ఈ సెప్టెంబర్ 23 స్థానం నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన జీవన విశేషాలను గుర్తుచేసుకుందాం…
కళారంగంలో అనితరసాధ్యమైన విజయాలను సాధించిన ఉత్తమ కళావేత్త స్థానం నరసింహారావు. పురుషులే స్త్రీ వేషాలు వేసే రోజుల్లో రంగస్థలం మెట్టి విభిన్నమైన పాత్రలను ధరించి, ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకత ను చూపించి ముప్ఫై సంవత్సరాలపాటు లక్షలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనది.
నటనావతంస, నటశేఖర, నాటక కళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదులు, పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సత్కారాలకు, అశేష ఆంధ్రావని నీరాజనాలు పలకడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి తాను చేస్తున్న పనిలో నిమగ్నత, రెండు ఆ పని మీద భక్తి ప్రపత్తులు. తన వృత్తి పట్ల అంతటి గాఢమైన మమకారం.
గురువులు చెప్పిన సూత్రాలను తన చిత్తవృత్తికి అనుగుణంగా మార్చుకొని మసలుకోవడం, ఏ పాత్ర చేస్తున్నా దాని పూర్వాపరాలు కూలంకషంగా అధ్యయనం చేయడం నటుని ప్రాధమికమైన అవసరాలుగా గుర్తించి పాత్రల కదలికలను, హొయలు, కోపాన్ని, తాపాన్ని – యిలా పాత్రోచిత భావ వైవిధ్యాన్ని మననం చేసుకుని అమలుపరచడం స్థానం నటజీవన విశిష్టత. నాటకరంగానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన.
స్థానం నరసింహారావు 1902, సెప్టెంబర్ 23 న హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. చిన్న వయసు నుంచే ఆయనకు నటనాభిలాష ఎక్కువ. 1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్ర లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభలో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతా పర్యటించి అపారమైన అనుభవం సంపాదించారు.
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీర రసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయ దేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు. వేషధారణ, వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థలం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారు. సినీ రంగంలో కూడా తన ప్రతిభను ప్రదర్శించారు. ఈ రంగంలో రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని సినిమాల్లో నటించారు. తన నటనా అనుభవాలను చేర్చి “నటస్థానం” అనే గ్రంథాన్ని ఆయన రచించారు.
అభినవ సత్యభామ గా గుర్తింపు పొందిన స్థానం నరసింహారావు వాచికాబినయనాలలో దివి నుండి సాక్షాత్తు సత్యభామ రంగస్థలానికి వచ్చిందా అన్నట్లు ప్రేక్షకులను మైమరపింప చేసేవారు. శ్రీకృష్ణతులాభారం’ రంగస్థల నాటకం లో స్థానం నరసింహారావు సత్యభామగా నటించేవారు. ఆయనే రాసుకుని పాడిన ‘‘మీరజాలగలడా నాయానతి’’ పాట పెద్ద హిట్టు. ఆయన నటనకీ, పాటకీ ప్రేక్షకులు వెర్రెత్తిపోయి, ఈలలు కొడుతూ, ‘వన్స్‌మోర్’ కొట్టేవారు. 1935లో తొలిసారిగా ‘శ్రీకృష్ణతులాభారం’ సినిమాగా తీశారు. అప్పటికి ఆ పాట పుట్టలేదు. 1955లో రాజరాజేశ్వరీ కంపెనీ అదే చిత్రం తీసినప్పుడు ఎస్.వరలక్ష్మి సత్యభామగా నటించి, అనుమతి తీసుకొని ‘మీరజాలగలడా’ పాడింది. అదే వరస. 1966లో సురేష్ వాళ్లు మళ్లీ ‘శ్రీకృష్ణ తులాభారం’ తీశారు. జమున సత్యభామ. అదే పాటని, అదే వరసతో పాడించారు. చీరకట్టులోని అతని నైపుణ్యం స్త్రీలనే అసూయ పరిచేదిగా ఉండేది. చీర కట్టటంలో మెళుకువలను అనేక మంది స్త్రీలు అతని వద్దే తెలుసుకునే వారని చెప్పుకునేవారు.
విశాఖ జిల్లా మాడుగుల ఒకసారి నాటకం వేశారు– శ్రీకృష్ణ తులాభారం. స్థానం వారు స్టార్ నటులు కాబట్టి ఒక ధనికుల ఇంట వేరే గది ఇచ్చి, అక్కడే వేషధారణ చేసుకొని రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయల్దేరుదాం అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. లోపల ఫ్యాను ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు స్థానం. అప్పుడే కొందరు ముత్తయిదువలు పేరంటం పిలుపు కోసం వచ్చారు. ఇల్లాలికి బొట్టు పెట్టి, అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యభామకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచారు. స్త్రీలే ఆయనను ఒక పురుషునిగా గుర్తించలేక పోయారంటే ఆ గెటప్‌లో ఆయన ఎంతగా ఒదిగిపోయే వారో…..అని ఈ సందర్భాన్ని చెప్పుకుంటూ ఉంటారు.
భారత ప్రభుత్వం 1956లో స్థానం వారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు, రంగస్థల కళాకారుడు కావడం విశేషం. ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం కూడా ఇచ్చింది. వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు. దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్న స్థానం వారు 1971 ఫిబ్రవరి 21 తేదీన మరణించారు.
