అధికారికంగా అరవై వేలు

ఆస్ట్రేలియా 2021 సార్వత్రిక గణాంకాల ప్రకారం తెలుగు మాట్లాడేవారి సంఖ్య సుమారు అరవై వేలకు చేరుకుంది.   ఇది నిజంగా ప్రతీ తెలుగువారూ హర్షించదగ్గ విషయం.  ఆస్ట్రేలియాలో  తెలుగు వారి అరవై ఏళ్ళ ప్రస్థానం సందర్భంగా అధికారికంగా ఈ సంఖ్యను చేరడం యాదృచ్చికమే అయినా ఇదొక మైలు రాయి.

2011 లో అధికారికంగా తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య  7,400 కంటే తక్కువ ఉండగా NAATI సంస్థకు తెలుగు సామాజిక భాషగా గుర్తింపునివ్వాలని కోరడం జరిగింది.  అయితే అప్పట్లో మన సంఖ్యా బలం తక్కువుగా ఉండడం వలన మరియు చాలామంది తెలుగువారికి ఆంగ్ల భాషానువాదం కానీ భాష్యకారుల అవసరం కానీ  లేదని మన విన్నపం తిరస్కరించడం జరిగింది.  తెలుగువారందరూ ముఖ్యంగా FTAA (Federation of Telugu Associations in Australia)  సంస్థ ద్వారా తెలుగు సంఘాలు, అనేక బృందాలు  2016 గణాంకాలలో, అప్పుడున్న సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు మాతృ భాషగా  నమోదు చేయాలని ఉధృతమైన ప్రచారం చేయడం మూలంగా ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 34,435 మందికి చేరుకుంది.  ఇది అత్యంత ఉత్సాహాన్నిచ్చింది.  దీని మూలంగా ప్రపంచంలో భారతదేశం వెలుపల సామాజిక భాషగా తెలుగు భాషను మొట్టమొదటిగా గుర్తించిన దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

గత 10 సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక గణాంకాలలో తెలుగువారి వివరాలు

2011 7,400 (సుమారు)
2016 34,435
2021 (రాష్ట్రాల వారీగా) 59,406
విక్టోరియా 24,677
న్యూ సౌత్ వేల్స్ 20,154
క్వీన్స్ ల్యాండ్ 5, 639
వెస్ట్రన్ ఆస్ట్రేలియా 3,089
ఆస్ట్రేలియన్ కాపిటల్ టెరిటరీ 2,752
సౌత్ ఆస్ట్రేలియా 2,385
నార్తర్న్ టెరిటరీ 362
తాస్మానియా 335

 

అయితే 2016 లో జరిగిన సార్వత్రిక గణాంకాలలో తెలుగు  మాతృ భాషగా నమోదు చేయాలన్న సందేశం  అందరికీ తగిన సమయంలో చేరలేకపోవడం మూలంగా  ఈ సంఖ్య  వాస్తవానికి దగ్గరగా లేదు.  అనధికార లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారు ఆస్ట్రేలియాలో 80,000 – 100,000  మధ్య ఉంటారని అంచనా.  2021 సార్వత్రిక గణాంకాల (Census)లో అదే సందేశాన్ని ఉధృతం చేసి   అందరూ సదవకాశాన్ని అందిపుచ్చుకొని “తెలుగు” మాతృ భాషగా నమోదు చేసుకోవాలని మరోసారి తెలుగుమల్లి మరియు FTAA సభ్యులు చేసిన  మనవి చక్కని ఫలితాలనిచ్చింది.  సుమారు మరో 25,000 మంది తెలుగు వారు అదనంగా నమోదు చేసుకున్నారని పై పట్టికలోని గణాంకాలు విశదపరుస్తున్నాయి.

పై పట్టికలోని వివరాలు పరిశీలించినట్లయితే న్యూ సౌత్ వేల్స్ కంటే విక్టోరియా రాష్ట్రంలో ఎక్కువమంది నమోదు చేసుకున్నారు.  ఈ రెండు రాష్ట్రాలలో మరో 20,000 నుండి 25,000 వరకూ నమోదయ్యే అవకాశం ఉంది.  అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా ఉండే అవకాశం ఉంది.  సంఖ్యా పరంగా మన అనధికార అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే అనుకోవచ్చు.  2026 లో జరిగే సార్వత్రిక గణాంకాల (Census)లో మన తెలుగువారందరికీ ఈ సందేశాన్ని అందించి మరింత ఎక్కువమంది తెలుగు మాతృ భాషగా నమోదు చేసుకునేలా ప్రోత్సహిద్దాము.  తెలుగువారి సత్తా చాటుదాం.

Scroll to Top