తెలుగువాకిట వెలుగు దివిటీ


“మన మాట గిడుగు మన పాట గిడుగు
తెలుగు వెలుగయ్యాడు తేట తెనుగయ్యాడు
ఆదివాసుల భాష మూలధనమని చాటి
సవరన్న చెలిమితో చరితకెక్కిన కీర్తి
సిక్కోలు సీమకే వన్నె తెచ్చిన ఘనుడు
తెలుగింటి తొలిచూపు తొలి గురువు గిడుగు
గిడుగు వారసులారా ! పిడుగు గర్జనలేవీ?
తెగులు సోకిన తెలుగు
రక్షణకు రారండీ…!!
పండితుల భేషజం యీసడించిన పిడుగు
గురజాడ తోడుగా వాద మాడిన జోడు
పత్రికల భాషకు జన్మనిచ్చిన దిట్ట
నార్ల నడిచిన తోవ సదును చేసిన పెద్ద”

ఇదీ…. గిడుగు రామమూర్తి గురించి కళింగ నేలలో ప్రజా గాయకులు ఆలపిస్తున్న పాటల చరణాలు. గిడుగు జయంతి సందర్భంగా మనం గుర్తుచేసుకోవడం చారిత్రక అవసరం.గిడుగు రామమూర్తి గారి జన్మదినమైన ఆగస్టు 29 ను ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిగణిస్తోంది. గిడుగు వారు తెలుగు వ్యావహారిక భాషకు పితామహుడిగా చరిత్రకెక్కారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగనుశాసనుడు అని బిరుదు కూడా వుంది.

చిరస్మరణీయుడు:
తెలుగు ప్రజలు గర్వించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికీ, వచన రచనకూ కావ్యభాష పనికిరాదనీ, సామాన్య జనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయిక పండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

వాడుక భాషోద్యమానికి ఆద్యుడు:
గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనా వైవిధ్యం, వైశిష్ట్యంతో సాహిత్య పుష్టి చేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాషకు ప్రాధాన్యత ఏర్పడింది. పత్రికలు వాడుక భాషలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. తెలుగు అధికార భాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడూ ఆద్యుడూ.గిడుగు రామమూర్తి గారి గురించి ఇంకా చెప్పాలంటే….గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.బహు భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.

శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు.గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు విస్తృతమై…. వ్యావహారిక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది.పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామమూర్తి గారు. ఈ వాడుకభాషా వాదాన్ని చేపట్టినందుకు గిడుగువారు పండితులతో యుద్ధం చేయవలసివచ్చింది. దీన్ని గ్రామ్యవాదమనీ, గిడుగువారు గ్రామాచార్యులనీ గ్రాంధికవాదులు హేళన చేస్తూ పద్యాలూ, వ్యాసాలు రాశారు. జయంతి రామయ్యపంతులు, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, వేదం వెంకటరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైన వాళ్ళతో ఢీకొనవలసి వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తు గ్రాంధిక భాషావాదానికి అండగ నిలిచింది. గిడుగువారు ‘తెలుగు’ పత్రిక ద్వారా గ్రాంధిక వాదాన్ని ఖండిస్తూ వ్యావహారిక వాదాన్ని బలపరిచారు. పండితులే తప్పులు లేకుండా రాయలేని గ్రాంధికం బలవంతాన రుద్దడం ఎందుకంటూ “ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజం” అనే పుస్తకం ప్రచురించారు గిడుగు.

సవర భాషాభివృద్ధికి కృషి:
కొండల్లో జీవిస్తున్న ఆదివాసీల ( సవరుల) కోసం జీవితాన్ని త్యాగం చేశారు గిడుగు. తమ కాలాన్ని, ధనాన్ని వినియోగించారు.

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు.
భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది.
“సవర” దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండా భాషలు. ఆర్య భాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు. తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన గారు 1940, జనవరి 22న కన్ను మూసిన గిడుగుకు ఈరోజు జయంతి సందర్భంగా తెలుగుమల్లి ఈ స్మృతి వ్యాసంతో నివాళులు అర్పిస్తోంది.

(వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా)

Scroll to Top