తెలుగువారి చెరగని చిత్ర శిల్పి

తెలుగువారి మదిలో చెరగని చిత్ర శిల్పి..బాపు

బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.
‘బాపు బొమ్మ’ అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!

ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.

ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే ‘బాల’ అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు ‘అమ్మమాట వినకపోతే’ అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. 1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు… కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ ‘కోతికొమ్మచ్చి’ ‘బుడుగు’లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు.
క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

బాపు గీత కు గురువు
బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతినిధి అయినట్టే, గోపు బొమ్మ తమిళిత్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రులు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు. బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇంతగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసాగింది.ముందుగా చెప్పక పోతే వీరిద్దరిలో ఎవరు గీసిన బొమ్మొ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే!

1986-88 వరకూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు ముళ్ళపూడి వెంకట రమణలు పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమం లోనికి మార్చారు.
విద్యారంగంలో ఒక వినూత్న ప్రయత్నంగా ప్రారంభించారు. బాపు వయోజన విద్య కోసం కూడా పాఠ్యాంశాలను సిద్ధపరచారు. బాలల దృష్టిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో బుడుగు పాత్రను సృష్టించారు, తెలుగు సాహిత్యం లోనే ఒక మకుటాయమానంగా నిలిచిపోయింది.

1964లో బెంగులూరులో జరిగిన యునెస్కో పిల్లల పుస్తకాలపై నిర్వహించిన సెమినారుకి ప్రతినిధిగా పాల్గొన్నారు.అదే సంవత్సరం చెన్నైలో యునెస్కో నే నిర్వహించిన పుస్తక ముఖచిత్ర రచన, అంతర్ చిత్రాలను గీసే తర్ఫీదు నిచ్చే కార్యక్రమాన్ని బాపు కే అప్పగించడం జరిగింది. 1960 లలో ఫోర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణభారత భాషల బుక్ ట్రస్ట్ కి చిత్ర రచనాసలహాదారుగా సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రచురణ సంస్థలకు అనేక గ్రంథాలకు అవసరమైన చిత్రాలను చిత్రించగా వాటిలో ఐదింటికి ప్రభుత్వం బహుమతులను అందుకున్నాయి. ఇదేవిధంగా పురాణ గాథలకు,జాణపద సాహిత్యానికి విస్తృతంగా బొమ్మలు గీశారు.
ప్రచురణకు వెళ్ళే ప్రతి తెలుగు రచయిత పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాధసత్యనారాయణ మొదలుకొని నూతన రచయితల వరకూ ప్రతి రచయితకు బాపు గీత అవసరమయ్యింది.దానిని వారు ఒక ఆధిక్యత గానే భావించారు, ఎందుకంటే అయన చేతి నుండి జాలువారిన చిత్రాలను విలువైనవెగానే కాక తెలివైన భావచిత్రాలుగా తీసుకొనేవారు.

బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా వేశాడు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ – అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు.

బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై – ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించాడు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.

పొదుపుగా గీతలు వాడటం.
ప్రవహించినట్లుండే ఒరవడి
సందర్భానికి తగిన భావము
తెలుగుదనము

బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పనిచేశాడు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణతో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ఇందులో బుడుగుతో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి.
ఈయన గీసే అమ్మాయిల బొమ్మలు అందానికి నిర్వచనంగా మారి అందమైన అమ్మాయి అంటే బాపు గీసిన బొమ్మ అనడం ఆనవాయితీగా మారింది.
ప్రతి తెలుగు ప్రారంభ పత్రిక ముఖచిత్రం బాపు గీసిందే కావాలనే ది ప్రతి ఒక్కరి కోరిక. ఆంధ్ర పత్రిక రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తుల పేర నిర్వహించిన శీర్షికకు రేఖా చిత్రాలను బాపు నే గీసారు.
మరో పత్రిక బాపు గీసిన బొమ్మ కు కథను రాసే పోటీని నిర్వహించింది. 1974 లో ఇంగ్లీషు,ఫ్రెంచి భాషలలో పిల్లల కోసం రామాయణాన్ని తనదైనశైలిలో బొమ్మలతో చెప్పారు. దీనికి కొనసాగింపుగా మహాభారతం ను, శ్రీకృష్ట్ణలీలలను కూడా తయారు చేసారు.

సినీరంగంలో
1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో ‘ముత్యాలముగ్గు’ సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976 లో వెలువడిన ‘సీతాకల్యాణం’ సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కించేవారు. ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవారు. ఆయన చివరి సినిమా శ్రీరామ రాజ్యం (2011).

పురస్కారాలు
బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అందులో ముఖ్యమయినవి కొన్ని:
– బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ బహుమతితో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి ఛాయగ్రాహకుడిగా బహుమతి.
-1986 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక బహుమతి మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి స్వీకారం.
– చెన్నై (తమిళనాడు) లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి బహుమతి 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది.
-1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహూకరణ.
– 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) వారిచే శిరోమణి బహుమతి అమెరికాలో స్వీకరణ.
– మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ బహుమతి. (1993 వ సంవత్సరం).
-1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (టాణా) వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల (గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకు గాను ఘన సన్మానం.
– బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
– 2001 జూన్ 9 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (ఈఈఛ్) వారిచే జీవిత సాఫల్య బహుమతితో సన్మానం.
– 2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట బహుమతి
– అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు బహూకరణ.[8]
– బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
– 2013 కు గానూ ప్రకటించిన పద్మ పురస్కారాలలో కళల విభాగంలో తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ బహుమతి.
చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు 2014 ఆగస్టు 31న చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనుమూసారు.

Scroll to Top