సెప్టెంబర్ 2 త్రిపుర జయంతి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసిన విశిష్ట కథకుడు త్రిపుర… ఆయన అసలుపేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత, సాహితీ వేత్తగా ప్రాచుర్యం పొందిన ఆయన జయంతి సెప్టెంబర్ 2. ఈ సందర్భంగా ఆయన జీవన రేఖలు … సాహిత్యాభిమానులకు కలం పేరు త్రిపురగా సుప్రసిద్ధులైన.. ఆయన అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు (ఆర్వీటీకే రావు). 1928, సెప్టెంబర్ 2 న ఒడిశాలోని గంజాం జిల్లా పురుషోత్తమపురంలో జన్మించారు.ఉన్నత పాఠశాల, కళాశాల విద్య విశాఖపట్నం లోని ఎవిఎన్ కళాశాలలో పూర్తి చేశారు. బెనారస్ యూనివర్శిటీలో 1950లో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేశారు. 1953లో ఎంఎ ఇంగ్లీష్‌లో యూనివర్శిటీకే అగ్రస్థానంలో నిలిచారు. 1960 వరకూ ఆయన వారణాసి, మాండలే (బర్మా), జోజ్‌పూర్, విశాఖపట్నంలో టీచర్‌గా పనిచేశారు. 1960లో త్రిపురలో మహారాజా వీర్ విక్రమ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరారు. 1987లో ఆయన పదవీ విరమణ చేశారు. త్రిపుర భార్య లక్ష్మీదేవి అనువాదకురాలు. ఆమె బెంగాలీ కథలను తెలుగులోకి అనువదించి..మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుమారుడు డాక్టర్ నాగార్జున అమెరికా లో, కుమార్తె నటాషా ఇంగ్లండ్‌లో, మరో కుమార్తె వింధ్య హైదరాబాద్‌లో ఉంటున్నారు.రచనలు-సాహితీ సేవ త్రిపుర 1963నుంచి రచనలు చేశారు. ‘త్రిపుర కథలు’ పేరిట ఆయన కథలు అచ్చయ్యాయి. తొలుత 13 కథలతో వచ్చిన సంకలనం.. ఆ తర్వాత రెండు కథలు చేర్చి 15 కథలతో మలి ముద్రణగా వచ్చింది. ఆయన కవిత్వం ‘త్రిపుర కాఫ్కా’, సెగ్మెంట్ (1975), ‘బాధలూ- సందర్భాలూ’ 1990లో సంకలనంగా వచ్చింది. ఆయన రచించిన భగవంతం కోసం, పాము, సుబ్బారాయుడి రహస్య జీవితం, వంతెన, సఫర్ వంటి కథలు తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన రచనల్లో మానవ జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరింప జేశారు. తెలుగు సాహితీ చరిత్రలోనే అత్యంత అరుదైన రచయితగా, కథకుల కథకుడిగా.. ఆయన విమర్శకులనుంచి ప్రశంసలు పొందారు. మ్యాజిక్ రియలిజాన్ని ఆయన తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు. ఆయన జెన్ బుద్ధిజం, క్రైస్తవాన్ని కథావస్తువుగా తీసుకునేవారు. మదనపల్లెలో పనిచేస్తున్నప్పుడు ఆయన జిడ్డు కృష్ణమూర్తి వద్ద శిష్యరికం చేశారు. తనను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జిడ్డు కృష్ణమూర్తిని ప్రత్యేకంగా త్రిపుర ప్రస్తావించేవారు. మార్క్సిజం, జెన్‌బుద్ధిజం తనను ప్రభావితం చేశాయని పేర్కొనేవారు. అర్థరాహిత్య శిల్పి..: జీవితానికి అర్థం ఇదీ అని చాలా రచయితలు చెప్పారు.. కానీ అర్థరాహిత్యం గురించి చెప్పిన ఏకైక రచయిత త్రిపుర. మన లోపలి చీకటిని.. సముద్రమంత చీకటిని, చిక్కటి చీకటిని పోగొట్టాలని ఆయన చాలా ప్రయత్నం చేశారు. గాఢమైన భాష త్రిపురది.. అది ఆయనకే ప్రత్యేకం. ఆయన రాసిన కథలు తక్కువే అయినా అవి ఒక్కోటి ఒక్కో మహా సంపుటమే. ప్రథమ ముద్రణ కోసం ఆయన తన ఒక్కో కథకు ఒక్కో వ్యాఖ్యానం రాయించారు. అంత సీరియస్ రచయిత ఆయన. అంత గాఢమైన కథకుడు తెలుగులో మరొకరు లేరు. ఆయన రచనల్లో త్రిపుర కథలు ప్రాచుర్యం పొందాయి. 1963-73, 1980-1990 మధ్య ఆయన ఈ కథల్ని రాశారు. 1975లో సెగ్మెంట్స్, 1990లో బాధలూ సందర్భాలూ – కవితలు, త్రిపుర కాఫ్కా కవితలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. జిడ్డు కృష్ణమూర్తి, మార్క్సిజం, జెన్ బుద్ధిజంపై వచ్చిన రచనలు తనను ప్రభావితం చేసినట్టు ఆయన పేర్కొనేవారు. అల్డస్ హక్సలేని ఇష్టమైన రచయితగా ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఇంకా గ్రాహం గ్రీస్, సాల్ చెల్లో, అల్బర్ట్ కామూ, సార్త్రే, శ్రీశ్రీ, జేమ్స్ జాయిస్, శామ్యూల్ బెకెట్ట్ తదితరులు తన అభిమాన రచయితలుగా ఆయన రాసిన పుస్తకాల్లో పేర్కొన్నారు. ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 24, 2013 శుక్రవారం నాడు మృతి చెందారు.