తెలుగు కథా దీపధారి కారా

తెలుగు కథా దీపధారి కారా(కాళీపట్నం రామారావు)
కథల చిరునామా ” కాళీపట్నం” కథానిలయం

“ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకుడుగా బాల్యము , 1940 – 1942 వరకు రాసేందుకు ఆసక్తి ప్రయత్నము .1943 నుండి ఐదేళ్ళు చిన్నచితకా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలు . 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రికలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగాను . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనము . అది ఫలించి 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెండు కథానికలు రాయగలిగేను . ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యయనము , అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అభిప్రాయాలు పదిమందితో పంచుకోవడమూ ఆగలేదు ”
—కాళీపట్నం రామారావు

కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు సుప్రసిద్ధాలు. తెలుగు కథకు శాశ్వత చిరునామాగా కథానిలయాన్ని స్థాపించి తీర్చిదిద్దిన కారా మాస్టారు శుక్రవారం (జూన్4) ఉదయం 97ఏళ్ల వయసులో కాలధర్మం చెందారు.

1966లో కారా రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

కారా మాస్టారు “కాళీపట్నం రామారావు” 1924, నవంబరు 9 న శ్రీకాకుళంలో జన్మించారు. శ్రీకాకుళంలో ఎస్ ఎచ్ ఎస్ సి వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల. స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగము. 1972 నుండి నేటివరకు పెన్షనరు గానే జీవితము గడిపారు. కాళీపట్నం రామారావు – ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా రిటైరయ్యారు.

ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. 2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.వై.లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాష్టారిని సన్మానించారు. ఆ సందర్భంగా లోక్ సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పారు – ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపారు. 1964లో వెలువడిన ‘యజ్ఞం’ కథ ఫ్యూడల్ దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైన కథానిలయం విశిష్టమైన యత్నం.

“యజ్ఞం” కథా రచయితగా కాళీపట్నం రామారావు సుప్రసిద్ధులు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడో ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించారు – బ్రహ్మానందరెడ్డి హయాంలో. ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు. కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళం పట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు – గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా – ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.

కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.

తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నారు.
1997లో ఆరంభమైన ఈ “కథా నిలయం”లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.

శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ఆ తర్వాత కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం తుదిశ్వాస విడిచేవరకూ శ్రమించారు.

ఇంకా కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో సుమారు 3,000 మంది కథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నారు కొద్దిపాటి కథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథా ఏదో ఒక దృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని కారా భావన.

కథా నిలయం క్రింది అంతస్తులో పుస్తకాలు చక్కగా అద్దాల బీరువాలో అమర్చబడ్డాయి. ఎందరో శ్రేయోభిలాషులు, సాహితీ ప్రియులు, ప్రభుత్వం కూడా ఈ భవన నిర్మాణానికి సహాయం అందజేశారు. క్రింది భాగం హాలు పఠనాలయంగానూ, సమావేశ స్థలంగానూ ఉపయోగపడుతుంది. 1998నుండి కథా నిలయ పర్యవేక్షణ ఒక ట్రస్ట్‌బోర్డ్ అధీనంలో ఉంది. నిత్యం ఈ కథానిలయం నిర్వహణలోనూ, రచయితను తమ రచనలు పంపమని కోరడంలోనూ కారా నిమగ్నుడై ఉండేవారు. కారా స్వీయ రచనలు వివిధ పుస్తకాలుగా 971 పేజీలలో ప్రచురించారు. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఈ కథానిలయానికే చెందుతుంది.

రచనలు :యజ్ఞం (నవల), అభిమానాలు, రాగమయి, జీవధార, రుతుపవనాలు (కథా సంకలనం), కారా కథలు

పురస్కారాలు:
ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్), కథాకథనం, కథాయజ్ఞం, బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం-2015

Scroll to Top