నూతన జీవితానికి నాంది…

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలలో ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం.
తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు.

పురాణాల్లో
పురాణాల ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

చరిత్రలో..
శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

ఉగాదికి ప్రతీ ఏడూ కొత్త పేర్లు
ఉగాదికి ప్రతీ ఏడూ కొత్త పేర్లు ఎందుకు? అవి ఎలా వచ్చాయంటే? శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదినాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్న దానికి కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని మరి కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని ఆ పేర్లు ఇవి అని చెబుతారు. ఇక ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అని పేరు రావడానికి వెనుక ఉన్న కారణాలను చెబుతూ ఉంటారు.
తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు.

 మార్చి 22న ఉగాది
ఇక ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 22వ తేదీన రాబోతుంది. ఉగాది పండుగ వసంత రుతువులో వచ్చే పండుగ. ఉగాది పండుగ వసంత రుతువులో వచ్చే పండుగ. ప్రకృతితో సమ్మిళితమైన పండుగ. కాబట్టి ఆ రోజు ఉగాది పచ్చడితో అందరూ పండుగ జరుపుకుంటారు. వేప పువ్వులు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం ఇలా ఆరు రుచులు తెలిసేలా షడ్రుచుల సంగమంగా ఉగాది పచ్చడిని తయారుచేసి ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగువారి లోగిళ్ళలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత..
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీకగా చెబుతారు.

Scroll to Top