మానవ జీవన కథా శిఖరం బలివాడ


మానవ జీవన కథా శిఖరం బలివాడ కాంతారావు

సుప్రసిద్ధ తెలుగు కథా, నవలా రచయిత బలివాడ కాంతారావు. ఆయన వర్ధంతి ఈనెల 6, ఈ సందర్భంగా ఆయన విశేషాలు గుర్తుచేసుకుందాం.

బలివాడ కాంతారావు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం గ్రామంలో జూలై 3, 1927న జన్మించారు. తండ్రి సూర్యనారాయణ వీరికి తొలి గురువు. పోలుమహంతి సూర్యనారాయణ దగ్గర ఇంగ్లిషు నేర్చుకున్నారు. తాతయ్య రామమూర్తి దగ్గర రామాయణ, మహాభారత కథలను తెలుసుకున్నారు. తర్వాత నేరుగా విశాఖపట్నంలో ఐదో తరగతిలో చేరారు. అక్కడ వారి అత్తయ్య, అమ్మాయమ్మ దగ్గర భేతాళ, విక్రమార్క కథలు, పంచతంత్రం కథలు విన్నాడు. అవే తర్వాత ఆయన రచలకు ఉపయోగపడ్డాయి. అప్పడే పాఠశాలలో స్కూలు మ్యాగజేన్ కు సంపాదకుడిగా కూడా చేశాడు. పదిహేనో ఏట విశాఖపట్నం ఆర్డినెన్స్ లో చేరాడు. బదిలీకి ఒప్పుకోక ఉద్యోగాన్ని మానేశాడు. తర్వాత నౌకాదళంలో చేరి వివిధ విభాగాల్లో పని చేశారు. 38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకి తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు. బలివాడ కథలన్నీ ‘చదువు-ఆగు-ఆలోచించు-సాగు ‘ అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కాంతారావుగారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకి వదిలేసి, వెల్లడి చేసినదానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి

తన నవలలు, కథలతో తెలుగు పాఠకులను ఆకట్టుకోవడమే కాదు, ఇతరభాషల్లోకి అనువాదాల ద్వారా వారి అభిమానాలను కూడా పొందిన రచయత బలివాడ కాంతారావు. నిత్యం సాహిత్యకారులతో జీవిస్తూ, తన రచనలకు పదును పెట్టుకున్నారు. సాధారణ జీవితాలను నుండి, జీవిత పాఠాలనే కాదు, సాహిత్య పాఠాలను నేర్చుకుని తన రచనల్లో పొందుపరిచారు. వాళ్లే నాకథలకు చిరునామా అని గర్వంగా చాటుకున్నారు బలివాడ కాంతారావు.

బలివాడ కాంతారావు ఆగస్టు5, 1947లో నేవల్ ఆర్మమెంట్ డిపోలో ఉద్యోగం చేరాక తొలి కథ పరివర్తన రాశారు. ఈ కథ అప్పటి ప్రజాబంధు పత్రికలో ముద్రితమైంది. తర్వాత రాసిన అమ్మ కథ ఆంధ్రసచిత్ర వారపత్రికలో, నేరస్థులు కథ భారతి పత్రికలోనూ అచ్చయ్యాయి. తర్వాత వీరి కథలు ఆనాటి వివిధ పత్రికల్లో వచ్చాయి. వీరు సుమారు 400ల వరకు కథలు రాశారు. ఈ కథలన్నీ ఆయన ప్రేరణ పొంది రాసినవే.
మనిషి-పశువు కథ- వీరు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక త్రాగుబోతు డ్రైవర్ కు ఛార్జిషీటు ఇచ్చాడు. మళ్లీ ఇతను తిరుగు బదిలీ అవుతుంటే అతను కన్నీరు కార్చాడు. ఆ సంఘటనే ఈ కథకు ప్రేరణ. అలానే ముంగిస కథ- మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు మువ్వల శబ్దంతో తిరుగుతున్న ముంగిసను చూశారు. దానిమీద కూడా కథ రాస్తావా అని వారి అత్తయ్య సరదాకు అన్నది. కానీ కాంతారావు కథ రాసి వినిపిస్తే ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగాయట.

బలివాడ కాంతారావు తనకు కథలు రాసేటప్పుడు ముగ్గురు వ్యక్తులు గుర్తుకు వస్తారు అంటారు. 1. వాళ్ల ఊరిలో మహాభారత గాథలు చెప్పిన గొల్ల రామస్వామి. అతనికి కథను రక్తికట్టించడం బాగా తెలుసంటారు. 2. చిన్నప్పుడు వీధిలో జరిగిన గొడవ గురించి ఒకరు అన్న మాటలు తప్పొప్పులు బేరీజు వేసి తీర్పు చెప్పాలంటే దూరంగా వుండి గమనించాలి కదా… 3. ఆఫీసు పెద్ద తన క్రింద సబార్డినేటు గురించి రాసిన రిపోర్టు- అడ్మినిస్ట్రేషనుకు లేబరుకు మధ్య యితను లింకులా వున్నాడు.. దీని ద్వారా కాంతారావు కథను సూటిగా క్లుప్తంగా చెప్పడం నేర్చుకున్నారట.

బలివాడ కాంతారావు కథలే కాకుండా 38 నవలలు కూడా రాశారు. ఇవి అనేక భాషల్లోకి అనువాదాలయ్యాయి. దగాపడిన తమ్ముడు నవలను నేషనల్ బుక్ ట్రస్టు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించింది. సంపంగి నవల హిందీ, కన్నడ భాషల్లోకి, ఇదే నరకం – ఇదే స్వర్గం హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం పొందాయి. వీరి అడవి మనిషి నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భాషల్లో ప్రసారమైంది. వీరి వంశధార నవల తన సొంత వూరు గురించి రాశారు. వీరు తమ రచయితలు, రచనల నేపథ్యం గురించి చెప్తూ- మెరుపులా వచ్చే భావాన్ని బీజంగా నాటి చెట్టులా పెరిగేటట్లు చేసే ప్రతిభ రచయితకుండాలని నమ్మని వాడిని. ఈ ప్రతిభ నిరంతరం కృషి లేనిదే రాదు. అంచేత రచయిత చివరి వాక్యం రాసేవరకు విద్యార్థే… విద్యార్థిగా రచయిత ఎవరి దగ్గర నేర్చుకుంటాడు. ప్రజ దగ్గరనించి, గురుత్వం పొందిన రచయితలు చెప్పినది, వాళ్ల సాహిత్యం చదివి నేర్చుకుంటారు.

వీరికి శ్రీపాద సుబ్రహ్మణ్యం, కొడవటిగంటి కుుటంబరావు, ముళ్లపూడి వెంకటరమణ… ఇలా ఎందరో రచయితలతో సాంగత్యం ఉండేది. భారతదేశంలో సిమ్లా నుంచి కన్యాకుమారి వరకు, కలకత్తా నుంచి ద్వారకు వరకు తిరిగి ఆయా ప్రదేశలలో తనకు కలిగిన అనుభవాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని రచనలు చేసేవారు. తన వ్యక్తిత్వం గురించి చెప్తూ- ఈ విశాల విశ్వంలో యెక్కడ చెడు జరిగినా బాధపడ్తాను, ఏ మంచి జరిగినా ఆనందిస్తాను అంటారు. కాంతారావు ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా పనిచేశారు. 1972లో పుణ్యభూమి నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్టు వచ్చింది. 1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం బహుమతి లభించింది. 1988లో సాహిత్యంలో ఉన్నత సేవకుగాను గోపీచంద్ అవార్డు కూడా వరించింది.

నిజాయితీ, నిక్కచ్చి, జాలి, దయ, కరుణ వీరి రచనల్లో తొణికిసలాడుతాయి. అవి మానవ సహజాతాలను, హృదయ స్పందనలను ప్రభావితం చేస్తాయి. తెలుగు వారు గర్వించదగిన రచయితల్లో ఒకరైన బలివాడ కాంతారావు మే 06, 2000న కాలధర్మం చెందారు. బలివాడ కాంతారావు రచనలపై సిద్ధాంత వ్యాసాలను రాసి పలువురు పి.హెచ్.డి. డిగ్రీలు, కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు సంపాదించారు.

Scroll to Top