‘మిథునం’ రచయిత శ్రీ రమణ అస్తమయం
ఎస్పీ బాలసుబ్రమణ్యం.. లక్ష్మీ ప్రధాన పాత్రలో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిథునం’ సినిమా కు కథను అందించిన శ్రీ రమణ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో బుధవారం (జూలై19) తెల్లవారుజామున చనిపోయినట్టు కుటుంబ సభ్యులు దృవీకరించారు. బాపు.. రమణ తో కలిసి సుదీర్ఘ కాలంగా పని చేసి పేరడి రచనలకు ప్రసిద్దిగాంచిన శ్రీ రమణ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరు మండలం అగ్రహారంలో జన్మించారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేసిన శ్రీ రమణ పలు పత్రికల్లో శీర్షికలు రాయడం ద్వారా రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. నవ్య వార పత్రిక కు సుదీర్ఘ కాలం పాటు ఎడిటర్ గా శ్రీ రమణ విధులు నిర్వర్తించారు. బాపు రమణలు చేసిన పలు ప్రాజెక్ట్ ల్లో భాగస్వామ్యం అవ్వడంతో పాటు ఇంకా పలు సినిమాలు.. ఇతర కథల్లో తన వంతు భాగస్వామ్యంగా ఉన్నారు.
ప్రముఖ రచయిత , సంపాదకులు , ‘మిథునం’ కథతో సుప్రసిద్ధులు శ్రీరమణ ( కామరాజు రామారావు ) 21 సెప్టెంబర్ 1952 లో వరాహ పురం అగ్రహారంలో జన్మించారు .అసలుపేరు వంకమామిడి రాధాకృష్ణ .దత్తత కు వెళ్లారు . శ్రీరమణ పుట్టినప్పుడు… వంకమామిడి రాధాకృష్ణ దత్తతకు వెళ్లినప్పుడు… కామరాజు రామారావు రచయితగా రూపాంతరం చెందినప్పుడు… శ్రీరమణ శ్రీరమణ ప్రముఖ కథకులు .వ్యంగ్య వ్యాస రచయిత.పేరడీ రచనలతో ప్రసిద్ధులు .బంగారు మురుగు వంటి కథలు రాసి పాఠక హృదయాలకు చేరువయ్యారు సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయితగా సుప్రఖ్యాతులు .ఆ కథను ఆసాంతం బాపు తన చేతి వ్రాతతో రాసి బొమ్మలు వేసి ఆనందపడ్డారు .శ్రీ తనికెళ్ళ భరణి దర్శకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ,లక్ష్మి పాత్రధారులుగా చలనచిత్రం గా రూపొందించారు ,మిథునం కథను పుస్తకరూపంలో వాహిని ప్రచురణల రచన శాయి వెలువరించగా ఎందరో తమ షష్టిపూర్తి వేడుకలలో బంధుమిత్రులకు పంచుకున్నవారున్నారు .ఆ ఒక్క కథే శ్రీరమణ కు అంత ఖ్యాతి తెచ్చింది.
వారు గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం గ్రామానికి చెందినవారు. ఇది వేమూరు మండలం తెనాలికి చాలా సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు అనసూయ, సుబ్బారావులు. వారి తండ్రి పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ప్రాథమిక విద్యను స్థానికంగా ఉన్న శ్రీరామ హిందూ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేసారు. ఫస్ట్‌ఫారమ్‌లో అంటే హైస్కూలులో అడుగుపెట్టాలంటే జరిగే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై కవిరాజా జిల్లా పరిషత్ హైస్కూల్, వేమూరులో ఫస్ట్‌ఫారమ్‌లో చేరారు. ఆ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు. స్కూలు రోజుల్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఆయనకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇలా వరసగా ఆరేళ్ళు ప్రథముడిగా నిలిచారు. పన్నెండేళ్ళ వయసులో విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వూ వచ్చింది. బాపట్ల వారి మాతామహుల ఊరు. అప్పుడే బాపట్లలో కళాశాల స్థాపించారు. బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పి.యు.సిలో చేరారు. వారి తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.సిలో వుండగా ఆయనను దత్తత చేసుకున్నారు. వారి జన్మనామం “వంకమామిడి రాథాకృష్ణ”. దత్తతకు వెళ్ళిన తరువాత నామం “కామరాజు రామారావు”గా మారినది. రెండు పేర్లు, రెండు ఇంటిపేర్లు — ఈ తికమక నుంచి బయటపడాలని ఆయన తన పేరును “శ్రీరమణ”గా మార్చుకున్నారు. తెలుగులో పేరడీ రచయితగా శ్రీరమణ సుప్రసిద్ధులు. అనేకమంది ప్రసిద్ధ రచయితల శైలిని అనుకరిస్తూ పేరడీలు రాసి స్వయంగా ఆయా రచయితల అభినందనలనూ పొందారు. వీరి పుస్తకాలను వసుధేంద్ర, అజయ్ వర్మ అల్లూరి గార్లు కన్నడలోకి,గౌరి కృపానందన్ తమిళంలోకి అనువదించారు.
పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించారు. ఆయన “పత్రిక” అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించారు. ఆంధ్రప్రభ, నవ్య వారపత్రికలలో పనిచేసారు. బాపు రమణ లకు అత్యంత సన్నిహితులు. చాలామంది ముళ్ళపూడి వెంకటరమణ, శ్రీ రమణ ఒకటే అనుకునేవారు. ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.
మిథునం వంటి ఒక అద్భుతమైన కథను అందించిన శ్రీ రమణ గారు ఇక లేరు అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.