రంగులరసరాజు వడ్డాది

చిత్రకళాలోకంలో రంగులరసరాజు వడ్డాది పాపయ్య
-ఈ నెల 10 వడ్డాది పాపయ్య శతయంతి

తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ, చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడుగా నిరాడంబరంగా జీవించిన వడ్డాది పాపయ్య తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు. ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి ఆయన పొట్టిగా ఉన్నా గీసిన గట్టి చిత్రాలు ఎన్నో ఆయన నిరాడంబరుడే కానీ ఆయన చిత్రాల్లో నాయకి, నాయకులంతా ఆడంబరులే. ఆయన చిత్రకళా యోగే కాదు, భోగి కూడా ఆయన వాస్తవం కంటే – ఊహల్లో ఎక్కువ జీవిస్తారు. ఆయనకు పగలే రాత్రి, రాత్రే పగలు. ఆయనకు పగలు విశ్రాంతి –నిశీధి నిశ్శబ్దంలో కళాసాధన. ఆయన జీవికకు సరిపడా ‘సిరి ’లేని, కళా శ్రీమంతుడు. ఆయన ఎవరికీ అభిమాని కాదు కానీ, దేశ విదేశాల్లో ఆయనకు అసంఖ్యాకంగా కళాభిమానులున్నారు. ఆయన చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతీకలు. అవి అభిమానులకు రసగుల్లాలు ! అభిమానుల గుండెల్లో అమరుడు.

తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళను స్వయం కృషితో సాధన చేసి మహా చిత్రకారుడు కావచ్చునని వడ్డాది పాపయ్య నిరూపించారు. చిత్ర కళా జగత్తును మకుటం లేని మహారాజులా నాలుగు దశాబ్దాల పాటు ఏలారు. ఆయన 1992 డిసెంబర్‌ 30న కశింకోటలోని పావని నిలయంలో తనువు చాలించారు. వ.పా.గా వినుతికెక్కిన వడ్డాది పాపయ్య 1921 సెపెంబర్‌ 10న శ్రీకాకుళంలో మధ్య తరగతికి కుటుంబంలో జన్మించారు. అత్త వారి గ్రామమైన కశింకోటలో స్థిరపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఐదో ఏట నుంచే చిత్ర కళకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి రామ్మూర్తికి చిత్రకళలో ప్రవేశం ఉంది. ఆయన చిత్రాలు గీస్తున్నప్పుడు దగ్గర ఉండి చిత్రకళలో మెళకువలను తెలుసుకొని అభ్యసించి స్వయం కృషితో సాధన చేశారు. ఐదవ ఏటనే ఆంజనేయస్వామి చిత్రాన్ని మొదటిసారిగా గాశారంటే అతిశయోక్తి కాదు. పాపయ్య కుంచె పట్టిన తొలి నాళ్లలో ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ, దురంధర్‌ల ప్రభావం ఉండేది. తర్వాత కాలంలో తనదైన శైలిలో ‘వ.పా. శైలి అనితర సాధ్యం’ అనే రీతిలో ఇతరులెవరూ అనుకరించడానికి అవకాశం లేని విధంగా చిత్రాలే గీసేవారు. చిత్ర కళా ప్రియుల హృదయాలను దోచుకున్నారు. వ.పా.కుంచె నుంచి జాలువారేది చిత్ర కళ కాదు సాక్షాత్తూ మహిళా సౌందర్య స్వరూపమే.

పత్రికా ప్రపంచానికి వ.పా.గా సుపరిచితుడైన పాపయ్య అనేక మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. చందమామ, ఆంధ్రజ్యోతి, భారతి, రేరాణి, అభిసారిక, యువ, స్వాతి వంటి పలు మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. ఆయన గీసిన చిత్రాలు పత్రికల్లో ప్రచురితం అయి తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన గీసిన చిత్రాల కోసమే కొన్ని పత్రికలు అమ్ముడయ్యేవంటే అతిశయోక్తి కాదు. పాపయ్యకు సంగీతం అంటే ప్రత్యేక అభిమానం. ఎన్నో రాగాలకు సంబంధించిన చిత్రాలను గీయడం ఇందుకు నిదర్శనం. నవ రసాల్లో శృంగారానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే రసానికి ఇవ్వలేదు. శృంగార పరమైన గ్రామీణ మహిళల చిత్రాలు గీసి యువతను రస డోలలో గిలిగింతలు పెట్టారు. కళా దేవులపల్లి, పోతన, శ్రీశ్రీల సాహిత్యమంటే ఆయన అభిమానించేవారు. పాపయ్య చిత్రకారుడే కాదు మంచి రచయిత, ఫొటోగ్రాఫర్‌ కూడా. పొగడ్తలంటే గిట్టేవి కాదు.

ఇంటర్వ్యూలన్నా, కళా ప్రదర్శనలన్నా ఆమడ దూరంలో ఉండేవారు. ఎవరైనా కళను గౌరవించాలిగాని వ్యక్తులను కాదని అభిప్రాయపడేవారు. పాపయ్య ఎక్కువగా నీలి రంగు చిత్రాల పట్లే మక్కువ చూపేవారు. తైల వర్ణాల కంటే నీలి రంగు చిత్రాలు అయితే అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా సత్వరమే చిత్రాలను పూర్తి చేయవచ్చునని అభిప్రాయపడేవారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు వర్ణ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ.పా. నిరాడంబర జీవితాన్ని సాగించి ఇక్కడ తనువు చాలించారు. ఆయన చిత్రాలతో వ.పా. ఆర్ట్సు గ్యాలరీని ప్రదర్శనకు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. అలాగే వ.పా. జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ప్రతిభా పాటవాలను నేటి తరానికి తెలిసే విధంగా చాటాలని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు.

వ.పా., పావనం, వడ్డాదిపాపయ్య అనేపేరు తెలుగు చిత్రకళారంగంతో పరిచయం వున్న వారికీ, పత్రికా పాఠకులకీ సుపరిచితం. 1940-90ల మధ్య కాలంలో పిల్లల పత్రిక ‘చందమామ’, పెద్దల పత్రిక ‘యువ’ తర్వాత స్వాతి పత్రికల్లో వేలాది వర్ణచిత్రాల్ని గీసి, అటు సాహితీ అభిమానుల్ని, ఇటు కళాభిమానుల్ని అలరించిన ఆంధ్రుల అభిమాన చిత్రకారుడు వడ్డాదిపాపయ్య. ఆయన చిత్రాల గురించి తెలిసినంతగా ఆయన్ని గురించి ఎవరకీ తెలియదు. పొగడ్తలకు, ప్రశంసలకు, సన్మానాలకు, ప్రచారాలకు ఆమడ దూరంగా ఉండేవారు.

శ్రీకాకుళం/కశింకోటలో ఆయన్ని చూడటానికి ఎవరైనా వెళ్ళినా నిర్మొహమాటంగా తిప్పి పంపేవారు. అది ఆయన తత్వం. ఆయన బొమ్మలను గాని, ఆయన స్టూడియోని గాని ఎవరికీ చూపించడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి వ.పా. కు స్నేహితులు ఎవరూ లేరా! అంటే… ఉన్నారు. వారు కూడా బహు తక్కువ. అలాంటి వారిలో ముఖ్యులు విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు, చిత్రకళావిమర్శకులు, శ్రీ సుంకరచలపతిరావు. వపాతో వీరిది పాతికేళ్ల స్నేహం. ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, ఇంటర్యూలు తీసుకోవడం, వ.పా. వేసిన చిత్రాలు వీలున్నప్పుడల్లా కశింకోట వెళ్లి చూసి వచ్చేవారు. వ.పా. ఒరిజినల్ చిత్రాలు చూసి తరించే భాగ్యం లభించడం తన అదృష్టం అని చలపతిరావు ఇప్పటికీ గర్వంగా చూసుకుంటారు. వ.పా.లతో స్నేహం జీవితంలో తనకో మధురస్మృతి అంటారు. వ.పా. గొప్ప చిత్రకారుడే కాదు, అంతకు మించిన సాహితీపరుడు కూడా. పోతన భాగవతం ఆయనకు అత్యంత ఇష్టమైన గ్రంధం. 1944లో ‘కథాంజలి’ అనే మాసపత్రికకు దిగంతరేఖ, నాగ కథలు రాసారు. శకుంతల కథ, బుద్దుడుపై రేఖాచిత్రాలతో కథలు రాసారు. అవినీతిపై రాష్ట్రపతి, ప్రధానీ, సర్పంచ్ అనే వర్ణచిత్రాలు గీసారు. జంబూలోకచరిత్ర కథ ద్వారా అవినీతిని ఎండకట్టారు. పురాణాలు, ఇతిహాసాలు, రాగాలు, రుతువులు, సమకాలీన సమస్యలపై ఆయన గీయని చిత్రం లేదని చలపతిరావు చెప్పారు.

వ.పా.తో వున్న పరిచయం పురస్కరించుకొని రంగులరాజు (తెలుగు) ది వేకింగ్ డ్రీమర్ ఇన్ కలర్స్ (ఇంగ్లీషు) గ్రంథాన్ని రచించి ప్రచురించారు. అంతేకాక వ.పా. ‘లేఖల్ని’ పుస్తకంగా ప్రచురించారు చలపతిరావు. యువ, చందమామలో ప్రచరించిన సుమారు 500 చిత్రాలను ఈయన బద్రపరిచారు. 1992లో వ.పా. మరణించినప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఆయన వర్ధంతి’ సభలను నిర్వహిస్తున్నారు. ఇటీవల వ.పా. పై వీరు రాసిన ‘వ.పా.’ జీవితచరిత్ర’ పుస్తకాన్ని హైదరాబాద్ కు చెందిన సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు ప్రచురించారు. ఇందులో వ.పా. జీవిత చరిత్రతో పాటు 30 రంగుల చిత్రాలు కూడా ఉన్నాయి. వ.పా.తో ముఖాముఖి జరిపిన ఇంటర్యూ ‘ఆడియో కేసెట్’ (40 నిమిషాలు) కూడా వీరి వద్ద ఉంది. తెలుగుదనానికి ప్రతీకమైన వ.పా. చిత్రాల్ని ‘తెలుగు విశ్వవిద్యాలయం’ సేకరించి బద్రపర్చాలని చలపతిరావుగారి సూచన. వ.పా. స్నేహితునిగా తెలుగుజాతి గర్వించదగ్గ చిత్రకారుని అజరామరం చేసేందుకు చలపతిరావుగారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పవచ్చు.

Scroll to Top