విశ్వహిందు పరిషత్ సంక్రాంతి బొమ్మలకొలువు



వనితలందరు గూడి రంగవల్లులు దిద్ద
గొబ్బమ్మ పాటలూ గుమ్మడి పూలూ
రావమ్మ మహాలక్ష్మి సాదరమ్ముగ మాఇంట
హరిదాసు గానాల గంగిరెద్దులు గూడి
నట్టింట తారాడు ధాన్యలక్ష్మి సిరులు
వాకిట్లో సింగారి జోడెడ్ల బండ్లు

భోగిమంటల తోడు చలికాచుకుంటుంది
సంకురేతిరి నాడు సంబరపడిపోతుంది
కనుమ పండగ రోజు కధ కంచి కెళ్తుంది
నా పల్లె నిండుగా తెలిగింటి సాక్షిగా

తెలుగు దేశంలో మన పల్లె ఇంత అందంగా ఉంటుందా? ముక్కుమీద వ్రేలు వేసుకోనివారు లేరు. ఇంటి ముంగిట మునివ్రేళ్ళతో ముగ్గులేసి తలుపులు, ద్వారబందాలకు రంగుల హంగులద్ది గంగిరెద్దు ప్రక్కనే గంతులేస్తుంటే, గాలిపటం ఎగురుతూ తెలుగు పలుకులతోడ పలకరిస్తుంటే మురిసిపోనివారు లేరు.

పల్లె వాతావరణం సృష్టించారు అనే కంటే పల్లెనే ఇక్కడికి తీసుకొచ్చారంటే బాగుంటుంది. వేదిక ప్రాంగణమే కాకుండా చుట్టుప్రక్కల కూడా పల్లె వాతావరణంతో కూడిన హంగులు, అలంకరణలు చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల మన్నలను చూరగొన్నారు.

గత నాలుగు నెలలు అహోరాత్రులు కష్టపడి బొమ్మలతోనే రామాయణం కథను రంజింపజేసిన చిత్రకారులు చరిత్రలో నిలచిపోయారంటే అతిశయోక్తి కాదు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంతోమంది చిన్నారులు మరియు పెద్దవారు రామ భక్తి కీర్తనలు ఆలపించి, నృత్య రూపకాలు ప్రదర్శించారు.

విక్టోరియా రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి బొమ్మలకొలువు కనులపండువుగా జరిగిందంటే చాలా తక్కువుగా చెప్పినట్లు. చిత్రాలలో మీరే చూడండి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్టోరియా రాష్ట్ర పార్లమెంటు సభ్యులు (మౌంట్ వావెర్లీ) శ్రీ జాన్ ముల్లాయ హాజరై ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి బహుళ సంస్కృతికి పట్టంగట్టే విక్టోరియా రాష్ట్రానికి మరింత శోభను చేకూరుస్తున్నారని, భావితరాలకు ఇదెంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మొనాష్ సిటీ మేయర్ నికీ లౌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి ఎంతోమంది స్వచ్చంద సేవకులు గత నాలుగైదు నెలలుగా పనిచేశారని వారందరికీ విస్వహిందు పరిషత్ విక్టోరియా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి గీత మద్దిపట్లగారు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

శ్రీమతి మహిత చెరుకువాడ గారు ఈ కార్యక్రమానికి కళాత్మక సమన్వయకర్తగా వ్యవహరించి బొమ్మలకొలువుని ఎంతో శ్రద్దగా తీర్చిదిద్దారు.

శ్రీ వడ్డిరాజు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ధ్వని సంబంధిత ఏర్పాట్లు చేసారు.

Scroll to Top