వెల్లువెత్తిన భారతీయ సంగీత తరంగం

‘పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డుపెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను’ అని శంకరాభరణం సినిమా చివరలో శంకర శాస్త్రి సభాసదులతో చెప్పే మాట ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం ఎంతైనా సమంజసం.

పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకొని ముందు తరాలవారికి అందీయాలన్న సత్సంకల్పంతో అంతరించిపోతున్న భారతీయ సంగీత కళను జీవనాడిగా చేసుకొని ఆరేళ్ల పసిపిల్లల నుండి అరవయ్యేళ్ల నడి వయస్కుల వారికి సుహృద్భావంతో నేర్పించి మరొక తరానికి బాట వేస్తున్నారు. ఈ కళ సజీవకళగా అజరామరమైనదని నిరూపిస్తున్నారు. మన పల్లవికి ఎల్లలు లేవని చాటి చెబుతున్నారు. సరిగమలతో కూడిన సంగీతంలో ఇమిడియున్న మన సంస్కృతికి నీరాజనం పడుతున్నారు.

మెల్బోర్న్ లోని ‘స్వర సాధన’ సంగీత కళాశాల గత ఒకటిన్నర దశాబ్దాలుగా శాస్త్రీయ సంగీతంలో ఎంతోమందికి శిక్షణనిచ్చి సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. త్యాగరాజ కృతులు, రామదాసు కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు మొదలైన దక్షిణ భారతదేశపు పలువురు వాగ్గేయకారుల గీతాలను, గేయాలను నేర్పిస్తున్నారు. ఈ కళాశాలలో నేర్చుకున్నవారు తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాళ సంతతికి చెందినవారు.

ఈ నెల ఒకటవ తేదీన ఈ సంస్థ పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో ఏభైమంది విద్యార్థులు సుమారు ఐదు గంటలకు పైగా జరిగిన కార్యక్రమంలో వీనులవిందైన సంగీత కృతులు, కీర్తనలు పాడి మరో ప్రపంచానికి తీసుకెళ్ళారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగతంగా కొందరు, సమూహంగా మరికొందరు సంగీత తరంగాలలో ఓలలాడించారు. ‘స్వర సాధన’ ఆ చల్లని సంగీతాంబుధిలో ఒక భారతీయ సంగీత కెరటంగా ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ‘పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు’ అన్నట్లు భావితరాలకు ఒక వెలుగు దివ్వెలా కనిపిస్తోంది.

సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అందరికీ తెలిసినవారే. ‘తుళు’ వంశానికి చెందిన రాయలవారు తమిళ గోదాదేవి కథను తెలుగులో “ఆముక్తమాల్యద”గా వ్రాసారు. ఇది జాతీయ సమైక్యతకు ప్రతీక. అలాగే ఈ కార్యక్రమంలో తిరుప్పావై కీర్తనలు తెలుగులోనూ, తమిళం లోనూ మూడు భాషలకు చెందిన పిల్లలచేత పాడించి ఇక్కడ భారతీయ సంస్కృతికి, ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనమని నిరూపించారు.  గోదాదేవి ఆండాళ్ తమిళం రచించిన “తిరుప్పావై ” ను తమిళంలో పాటుగా ఆ కీర్తనలకు సుప్రసిద్ధ తెలుగు వాగ్గేయకారులు అయిన కీ.శే . శ్రీ శిష్ట్లా సత్యరాజశేఖరం గారి సంగీతపరమైన తెలుగు సేతను కూడా పాడడమైనది.  శ్రీ శిష్ట్లా రాజశేఖరం గారు శ్రీమతి సుందరి గారి ప్రధాన ప్రథమ సంగీత గురువులు

ఈ కార్యక్రమానికి తెలుగుమల్లి సంపాదకులు, భువనవిజయ సాహితీ సంవేదిక సమన్వయకర్త శ్రీ మల్లికేశ్వర రావు కొంచాడ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక నూతన సంగీత కళాకారుల తరాన్ని సృష్టిస్తున్న ‘స్వర సాధన’ వ్యవస్థాపకులు శ్రీమతి సుందరి సరిపల్లె గారు మరియు శ్రీ సూర్యనారాయణ సరిపల్లె గారికి శుభాభినందనలు తెలిపారు.

చివరిగా విద్యార్ధులందరికీ బహుమతులందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయసహకారాలందించిన ఎంతోమంది స్వచ్చంద సేవకులు, కళాభిమానులకు శ్రీమతి సుందరి గారు కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top