శ్రీరాముని దయచేతను…


దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటారు.

శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటారు. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.

ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి.

శ్రీ రామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి.
చివరగా సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి

Scroll to Top