సాహితీ సేవలో దశవసంతాలు

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో సాహిత్యానికి రెండు కళ్ళులా గత పదేళ్లుగా అహర్నిశలూ పని చేస్తున్న అనుబంధ సంస్థలు తెలుగుమల్లి మరియు భువనవిజయం. తెలుగుమల్లి (www.telugumalli.com) అంతర్జాల పత్రిక ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని తెలుగువారి సంక్షేమము కోరి ఇక్కడ ప్రముఖంగా తెలుగు వారు జరుపుకునే పండగలు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు, వార్తా విశేషాలు, ప్రముఖులతో ముఖాముఖి మరియు స్పూర్తిదాయకమైన కథనాలు ప్రచురిస్తుంది. భారత దేశంలోని రెండు తెలుగు రాష్టాలు మరియు ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాలలోని తెలుగువారికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇదే కాకుండా తెలుగు భాషా సంస్కృతులపై అనేక వ్యాసాలు కూడా ప్రచురించడం జరుగుతుంది. తెలుగుమల్లి ప్రతీ ముఖ్య నగరంలోనున్న తెలుగు సంఘాలతో కలిసి పనిచేస్తుంటుంది.

“కవితాస్త్రాలయ” శీర్షికన ఈ రెండు దేశాల తెలుగు భాషాభిమానులు మరియు సాహితీపరులు వ్రాసిన కవితలు, కథలు, కథనాలు, వ్యాసాలు కూడిన మూడు సంకలనాలు ప్రచురించి తెలుగు భాష అభివృద్ధికి ఎంతో తోడ్పడింది. తోటి భాషాప్రియులకు ప్రోత్సాహాన్నందించే దిశగా ఎంతోమంది భాషాభిమానులకు తమ స్వీయ రచనలు ప్రచురించడానికి చేయూతనిచ్చాయి.

ఈ రెండు సంస్థలు కలిసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో వంగూరి ఫౌండేషన్ వారి 6వ ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. అందునా ఆస్ట్రేలియా దేశంలో ఒక ప్రపంచ స్థాయి సాహితీ సదస్సు తొలిసారిగా నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. దీని పర్యవసానంగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగు వారి భాషాభిమానానికి ప్రతీకగా ప్రతీ ఏటా ఇక్కడి ముఖ్య నగరాలలో ఒక సాహితీ సదస్సును నిర్వహించాలని తీర్మానం చేస్తూ మొదటి సమావేశం 2019 నవంబరు నెలలో ఆక్లాండ్ నగరంలో న్యూ జిలాండ్ తెలుగు సంఘం అధ్వర్యంలో దిగ్విజయంగా జరగడానికి పెద్ద ఎత్తున సన్నాహ సహకారాలందించి అద్వితీయమైన రీతిలో సదస్సు నిర్వహించడానికి ప్రణాళికలు రచించడంలో తెలుగుమల్లి మరియు భువన విజయం కృతకృత్యులయ్యాయి.

పద్య నాటకాలు
తెలుగు భాషకు ఆయువు పట్టువులైన పౌరాణిక నాటకాలు ఆస్ట్రేలేషియా ప్రాంతంలో మొదటిసారిగా రంగస్థల ప్రదర్సనలు నిర్వహించిన ఘనత ఈ రెండు సంస్థలకు చెందుతుంది.

నాడు-నేడు (తెలుగు భాష వెయ్యేళ్ళ చరిత్ర పద్య రూపకం)

శ్రీకృష్ణ రాయబారము

శ్రీ పార్వతీ కళ్యాణం

శ్రీ మహాకవి కాళిదాసు
https://youtu.be/Uqaoxp-8zI0

ఇవే కాకుండా తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన ప్రక్రియ ఆస్ట్రేలియాలో పలుమార్లు నిర్వహించడం కూడా జరిగింది.
ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని తెలుగు నేర్చుకొనే పిల్లలకు ప్రోత్సాహకంగా 4,000 “పెద్ద బాల శిక్ష” పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ రెండు దేశాలలోని ముఖ్య నగరాలలో తెలుగు సంఘాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు బడులు అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. ఇప్పుడు సుమారు 600 మందికి పైగా పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు.

సామాజిక భాషగా తెలుగు
ప్రపంచంలో భారత దేశం బయట తెలుగు భాషకు గుర్తించిన మొదటి దేశంగా ఆస్టేలియా వాసికెక్కింది. అంతర్జాతీయ భాషగా తెలుగు ఎదగాలని కలలుగనే ఎంతోమంది తెలుగువారికి ఇదొక ఆశాజనక సూచకంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA) వారితో కలిసి ఆరేళ్ళు నిర్విరామంగా పనిచేసి ఈ లక్ష్య సాధనలో సఫలీకృతులవ్వడంలో తెలుగుమల్లి మరియు భువన విజయం ఎంతో కృషి చేసాయి.

ఆస్ట్రేలియా బడులలో తెలుగు
ఆస్ట్రేలియా బడులలో తెలుగు ప్రవేశపెట్టే దిశగా ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్యతో కలిసి ప్రస్తుతం ప్రణాళికలు రచించడంలో కీలక పాత్రను ఈ రెండు సంస్థలు పోషిస్తున్నాయి. మరో రెండు సంవత్సరాలలో కొన్ని బడులలో తెలుగు భాష ఒక పాఠ్యాంశముగా బోధించబడుతుందన్న ఆశాభావం కలుగుతోంది. తద్వారా తెలుగు భాషా బోధకులకు ఉద్యోగావకాశాలు ఎక్కువౌతాయాన్నది మరో ఆశాభావం.
అవధానాలు:
అవధాని “శారదామూర్తి” తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారు ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుండి వారు అవధాన ప్రక్రియ మొదలుపెట్టిన తదుపరి ఇప్పటి వరకూ వందకు పైగా అవధానాలు జరగడం ఈ రెండు దేశాలలో తెలుగు భాష సేవ తారా స్థాయికి చేరిందనడంలో సందేహం లేదు. అవధాన ప్రుచ్చకులుగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగువారే కాకుండా భారత, సౌత్ ఆఫ్రికా, సింగపూర్, ఇంగ్లండు, జర్మనీ, ఉత్తరమెరికా దేశాల తెలుగువారు కూడా పాల్గొనడం ఎంతో ఆనందదాయకం.

భాగవత పద్యాలు:
భాగవత పద్యాలు పిల్లలందరూ నేర్చుకోవాలని ఉత్తరమెరికా సంస్థ iBAM వారు గత మూడేళ్ళుగా అక్కడి పిల్లలకు పద్యాలు నేర్పించి ప్రతీ ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలను ఇతర దేశాలలో నివసిస్తున్న పిల్లకు నేర్పించి వారిని కూడా ఈ పోటీలలో భాగస్వాములను చేయాలన్న తలంపుతో రెండేళ్ల క్రితం మరో ఏడు దేశాలకు ఈ ప్రక్రియను విస్తరించారు. ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఈ కార్యక్రమం ‘తెలుగుమల్లి’ అధ్వర్యంలో జరిగింది. ఇందులో 45 మంది పిల్లలు పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. అలాగే న్యూ జిలాండ్ నుండి 23 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది.

ఛందోబద్ధమైన పద్య రచన:
గత మూడేళ్ళుగా కరోనా పుణ్యమాయని ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని కొంతమంది ఔత్సాహికులు ఛందోబద్ధమైన పద్య రచనను నేర్చుకొని కొంతమంది శతకాలు కూడా వ్రాయడం జరిగింది. ఈ పద్యరచన ఆస్ట్రేలియా అవధాని శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి మరియు కావ్య కళా ప్రపూర్ణ డా. చింతలపాటి మురళీ కృష్ణ గారి నేతృత్వంలో నిరాఘాటంగా జరుగుతుంది. ఆటవెలది, తేటగీతి, కందం, సీసం ఛందస్సులే కాకుండా ఇప్పుడు వృత్తాలు కూడా చాలామంది వ్రాయడం శ్లాఘనీయం. తెలుగుమల్లి ఈ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించింది.

పంచకావ్యాల ప్రవచనం:
తెలుగుమల్లి అధ్వర్యంలో తెలుగు పంచకావ్య ప్రవచనాలు డా. చింతలపాటి మురళీ కృష్ణ గారు 6 నెలలుపాటు ప్రతీ వారం రెండు గంటలు సమయం కేటాయించి అందరికీ వివరించడం జరిగింది. కావ్య విశేషాలు వివరించడమే కాకుండా వారు పద్య రచనలోని మెళుకువలు, ఈ కావ్యకవుల అంతరంగంలోని భావాలు ఎంతో వివరంగా చెప్పి కావ్య శిల్పం అర్ధం చేసుకోవడానికి దోహదపడ్డారు.

ఆస్ట్రేలియాలో 60 తెలుగు వసంతాలు:
తెలుగువారు ఆస్ట్రేలియా వచ్చి ఈ సంవత్సరం 60 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుమల్లి దసవసంతాల కానుకగా ఒక సమగ్రమైన సంకలనం రూపొందించి త్వరలో ఆవిష్కరించబోతోంది. ఈ ప్రక్రియ అన్ని రాష్ట్ర రాజధానులలో నిర్వహించి తెలుగువారందరికీ ఈ సంకలనం అందజేయాలన్న ఆలోచనకు చేయూతనిస్తున్న వారందరికీ కృతజ్ఞతాభివందనాలు.

తెలుగుమల్లి చేస్తున్న సాహితీ సేవలకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2018లో అంతర్జాతీయ తెలుగు కేంద్రం వారు ఇచ్చే శ్రీ మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం “తెలుగుమల్లి” కి ఇవ్వడం జరిగింది.

Scroll to Top