సుదూరతీరాల్లో పరిమళిస్తున్న తెలుగుమల్లి

సుదూరతీరాల్లో పరిమళిస్తున్న తెలుగుమల్లి
*ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి
*విజయవంతంగా జరిగిన ప్రవాస సాహిత్యం అంతర్జాతీయ సదస్సు
*ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు
*కొంచాడ మల్లికేశ్వరరావు కృషికి వక్తల ప్రశంసలు

(విశాఖపట్నం మార్చి1,2)
తెలుగు భాషనీ, సంస్కృతినీ పరిరక్షించుకోవడానికి ఆస్ట్రేలియాలోని తెలుగుమల్లి వంటి సంస్థలు ప్రవాసాభారతీయ దేశాల్లో అంకితభావంతో కృషిచేస్తున్నాయని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె శుక్ర, శనివారాల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయం. తెలుగుమల్లి (ఆస్ట్రేలియా)ల సంయుక్తనిర్వహణలో జరిగిన ప్రవాస సాహిత్యం అంతర్జాతీయ సదస్సుకు ప్రత్యేక అతిధిగా తొలిరోజు హాజరయ్యారు. ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం జేంస్ స్టీఫెన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సాహిత్యంలోనూ, సంస్కృతీ వికాసంలోనూ ప్రగతిశీలమైన పరిణామాలతోనే భాష సజీవంగా మనగలుగుతుందని అన్నారు. విశ్వవ్యాప్తమైన సాంకేతిక సౌలభ్యంతో వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి, ఆయా భాషల వారికి మన తెలుగు ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయన్నారు. వాటన్నింటినీ వినియోగించుని భాషని మరింత పరిపుష్టం చేసుకోవాలన్నారు. ఇంటువంటి కృషిని ఆస్ట్రేలియాలో తెలుగుమల్లి ద్వారా కొంచాడ మల్లికేశ్వరరావు ఎన్నో ఏళ్ల నుంచీ అంకితభావంతో నిర్వహిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కొంచాడ మల్లికేశ్వర రావు రచన ‘తూర్పుతీరంలో తెలుగురేఖలు” పుస్తకాన్ని ముఖ్య అతిధి వైస్ చాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర విశ్వకళాపరిషత్ వచ్చేయేట కొత్త శతాబ్దంలోకి అడుగుపెడుతుందని ఈ సమయంలో ఇటువంటి చారిత్రాత్మక సదస్సు ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత సాంకేతిక విద్యలను కూడా ఏయూ పరిధిలో బోధిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఏయూ విశిష్ట విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిందని, ఈరోజు ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా భాషాభిమానులు పాలుపంచుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి డి లిట్ అందుకున్న సందర్భంగా ఆమెకు ఆత్మీయాభినందన నిర్వహించారు.

విశిష్ట అతిధి కొంచాడ మల్లికేశ్వరరావు మాట్లాడుతూ ఆస్ట్రేలియాకు మొట్టమొదట తెలుగువారు వలసవెళ్ళి ఇప్పటికి ఆరు దశాబ్దాలు అయ్యిందన్నారు. అది కూడా ఈ ప్రాంతం నుంచే అక్కడికి వెళ్లడం విశేషమని చెప్పారు. చింతపండు దొరకని ఆ రోజుల్లో వెనిగర్ ని వంటల్లో వాడుకునేవారని అన్నారు. తెలుగు ప్రజల జీవితాల్లో ఈ ఆరు దశాబ్దాల పరిణామక్రమాన్ని రికార్డు చేయాలనే లక్ష్యంతోనే ఈ పుస్తకాన్ని రూపొందించామని అన్నారు. దీనిని త్వరలోనే ఇంగ్లీషులో కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో వంగూరి ఫౌండేషన్ (అమెరికా) వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, కీనోట్ స్పీకర్ ఓలేటి పార్వతీశం, ప్రొఫెసర్ అయ్యగారి సీతారత్నం, సాహితీవేత్త కె మలయవాసిని తదితరులు ప్రసంగించారు.

రెందవ సదస్సులో ఆదికవి నన్నయ యూనివర్శిటీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ తటవర్తి సత్యనారాయణ, యోగివేమన యూనివర్శిటీ నుంచి ప్రొఫెసర్ రామప్రసాద్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి ప్రొఫెసర్ ఎం రాం ప్రకాష్, ప్రొఫెసర్ ఆర్కె జయలక్ష్మి, కృష్ణా యూనివర్శిటీ నుంచి ప్రొఫెసర్ ఎన్ ఉష తదితరులు ప్రసంగించారు.

శనివారం సదస్సులో దేశ విదేశాల లోని వివిధ యూనివర్శిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు దార్ల వెంకటేశ్వరరావు, తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, చల్లా శ్రీరామమూర్తి, డి విజయలక్ష్మి, సాగి కమలాకర్ శర్మ, సుదర్శన్ కుమార్ పౌడెల్, దేవేంద్ర కుమార్ సింగ్, ఆష్మా షమైల్, అలెగ్జాండర్ కూరే, హరి సింగపాల్ తదితరులు ప్రసంగించారు. అనంతరం వేలిడిక్టరీ ఫంక్షన్ నిర్వహించారు.

Scroll to Top