హృద్యమైన పద్యము…

హృద్యమైన పద్యము భాషా వికాసానికి మూలం.

-ఆస్ట్రేలియా జూమ్ వేదికపై మాజీ సభాపతి బుద్ధప్రసాద్

నేటి ప్రపంచంలో నలుమూలలా తెలుగు భాష వృద్ధిచెందుతున్న పరిణామం మంచి భవిష్యత్తును సూచిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంస్థ “తెలుగుమల్లి” ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ప్రారంభమయిన ‘తెలుగు కావ్యసౌరభాలు” జూమ్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ రోజుల్లో రచయితలు విరివిగా రచనలు చేయటం ముదావహమే అయినా తెలుగు కావ్యాలను, పూర్వసాహిత్యాన్ని చదివే పాఠకులు మళ్ళీ రావాలని పద్య సాహిత్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

వెయ్యేళ్ళ తెలుగుసాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు, పద్య ప్రాముఖ్యత సజీవంగా అర్థమవుతాయని ఒక్కాణించారు. ఈ విషయంలో విదేశాల్లోని తెలుగువారి కృషిని ఆయన ప్రశంసించారు. ఆస్ట్రేలియాలోని “తెలుగుమల్లి” సంస్థ ద్వారా నిర్వాహకులు కొంచాడ మల్లికేశ్వరరావు తెలుగు పద్యప్రచారానికి పూనుకొని అవధానాలు, పద్యకావ్యరచనలు, కావ్యసమీక్షలు కరోనా బాధితసమయంలో కూడా నిర్వహించటాన్ని బుద్ధప్రసాద్ ప్రశంసించారు.

ఆస్ట్రేలియాలో సాహిత్య ప్రక్రియలకు కొదవలేదని, ఇక్కడ కథలు, కవితలు, పద్యాలు వ్రాసే శతక కర్తలు కూడా చాలామంది ఉన్నారని గత సంవత్సరం తెలుగు భాష ప్రపంచ దేశాలలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో సామాజిక భాషగా గుర్తించడం, అందులో ఇక్కడి తెలుగువారందరూ పాలుపంచుకోవడం శ్లాఘనీయమని చెప్పారు.

ఈ సందర్భంగా తెలుగు పంచకావ్యాలను వారానికొకటి చొప్పున విశ్లేషించటానికి పూనుకున్న డా. చింతలపాటి మురళీకృష్ణ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ నెలనెలా అవధానాలు నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తి సేవలను ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రావిపాటి శ్రీకృష్ణ, డా. చారి ముడుంబి, డా.వేణుగోపాల్ రాజుపాలెం, డా.ఉష శ్రీధర్, డా.శనగపల్లి కోటేశ్వరరావు, సునిల్ పిడుగురాళ్ళ, విశ్వనాధశర్మ, పిలుట్ల ప్రసాద్ ప్రభృతులు జూమ్ ద్వారా పాల్గొన్నారు. సింగపూర్, మలేసియా, అమెరికా, ద.ఆఫ్రికా దేశాలవారు కార్యక్రమాన్ని ఆసక్తితో వీక్షించారు. ప్రతీ శుక్రవారం రాత్రి 6:45 – 8 గంటల మధ్య ఈ కార్యక్రమం మరో 10 వారాలు కొనసాగుతుంది.

యుట్యూబ్ లింకు

Scroll to Top