NATA ఉగాది మరియు శ్రీరామనవమి

యువకులే రథసారథులై, రాసాస్వాదకులై, యువతే నటులై, యువతకే ప్రాధాన్యమిచ్చి ఉగాది మరియు శ్రీరామనవమి రెండు పండగలు నిర్వహించారు కాన్బెర్రా నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్.  సుమారు 500 మంది ప్రేక్షకులు విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇండియన్ హై కమిషన్ ప్రతినిధిగా శ్రీ సునీత్ మెహతా, సెనేటర్ డేవిడ్ పోకాక్, ACT ముల్టీ కల్చరల్ మంత్రి గారి ప్రతినిధిగా మైఖేల్ పేటర్సన్ MLA, సూజన్ ఆర్ MLA, ఎలిజబెత్ కిక్కెర్ట్ MLA ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు.

“మన యువత మన భవిష్యత్తు. నాటా యుగాది వేదిక మీద యువతకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించడానికి ఈసారి అవకాశమిచ్చి కావలసిన సహాయ సహకారాలతో వారిని ప్రోత్సహించాము” అని నాటా అధ్యక్షురాలు సాహితీ పాతూరి తెలిపారు.

మనదైన సాంప్రదాయ కూచిపూడి, భరతనాట్యంతో పాటు సమకాలీన కళలు, కర్నాటక మరియు సినీ సంగీత గీతాలు ఆలపించారు.  ఈ ఏడాది ఆస్కార్ అవార్డు పొందిన “నాటు నాటు”  పాటకు ఎనెర్జీ డాన్సు స్కూల్ పిల్లలు చేసిన  నృత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  చాలామంది పిల్లలు రామాయణంలోని పాత్రలకు వస్త్రధారణ, ఆహార్యం  అంశం పలువురిని ఆకట్టుకుంది.  ఇందులో 2-10 సంవత్సరాల వయసు గల పిల్లలు పాల్గొన్నారు.

జీవితంలోని పలు రసాలను ప్రతిబింబించే షడ్రుచుల ఉగాది పచ్చడితో ఉగాది పాటను ఆలపించి ఆహూతులను ఆహ్వానించిన పధ్ధతి వినూత్నంగా ఉంది.

నాటా (NATA) ప్రతీ ఏటా సమాజాభివృద్ధికి కృషి చేసిన మన సమాజంలోని కొంతమంది నిష్ణాతులను సత్కరిస్తుంది.  ఈ ఏడాది శ్రీ బోయపాటి  కృష్ణమూర్తిగారికి ఇంజనీరింగ్ లో వారి సాంకేతిక నైపుణ్యానికి మరియు హిందూ కౌన్సిల్ అఫ్ ఆస్ట్రేలియా ద్వారా సేవలందించిన శ్రీ ప్రకాష్ మెహతా గారికి సత్కరించారు.

NATA, 2015లో డాక్టర్ ప్రసాద్ తిపిర్నేని మరియు అతని బృందం మన భారతీయ సంస్కృతిని సంరక్షించడం, ప్రోత్సహించడం, భావితరాలకు అందివ్వడం, మన సంఘంలో మరియు సమాజ శ్రేయస్సులో ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టిని కేంద్రీకరించాలన్న ఆశయంతో స్థాపించడం జరిగింది.  NATA కార్యక్రమాలలో సింహభాగం కాన్బెర్రా గాట్ టాలెంట్, కేరమ్స్, చెస్, స్పెల్లింగ్ బీ, విమెన్ ఇన్స్పిరేషన్ నెట్వర్క్, బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మరియు మహిళలు మరియు సమాజ ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఉన్నాయి.  “చేయి చేయి కలుపుదాం మన భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు , విలువలు నిలుపుదాం అందరికీ తెలుపుదాం అనేది నాటా నినాదం”. నాట కార్యక్రమాలు లో భారతీయులందరు పాల్గొనటానికి అవకాశం ఉన్నది.

ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహకరించిన స్వచ్చంద సేవకులు, అనేక కుటుంబాలు, వ్యాపార సంస్థలకు NATA సంస్థ కార్యవర్గం తరఫున అధ్యక్షులు శ్రీమతి సాహితీ పాతూరి గారు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

Scroll to Top