నేటి తరం కన్నా .. ఒకప్పటి తరానికి బాగా తెలిసిన చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల సంపూర్ణారోగ్యాన్ని సమకూర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Alternate grains
ఇప్పుడు ప్రజలందర్నీ వేధిస్తున్న వ్యాధులు షుగర్, బిపి, థైరాయిడ్, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, ఊబకాయం మొదలైనవి. వీటికి జీవనశైలి వ్యాధులని అంటారు. ప్రతి ఇంట్లో ఈ రోగాలతో ఎవరో ఒకరు ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగానే.. జీవితాంతం మందులు తీసుకోవడమే పరిష్కారమని డాక్టర్లూ చెప్తున్నారు. అయితే, ఇవన్నీ చిరుధాన్యాలు వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం అనారోగ్యాలకు అసలు కారణం మనం తీసుకుంటున్న ఆహారమే. ఆహారాన్ని వాణిజ్యీకరణ చేసి, అందరూ కంపెనీ ఆహారాన్ని తినడమే సమస్యకు మూలం. వరి, గోధుమ, పాలు, పంచదార, గుడ్లు, మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్నే అందరూ తింటున్నారు. వీటివల్లే రోగాలు వస్తున్నాయి. దండిగా లాభాలు చేసుకోవాలనే ఆశతో ప్రమాణాలను పక్కన పెట్టి, బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మన సాంప్రదాయ పంటలను వదిలేసి, పాశ్చాత్యుల ప్రభావంతో వారు ఉత్పత్తి చేసిన ఆహారమే సంపూర్ణ ఆహారమంటూ మనమూ తింటున్నాం. కంపెనీల దురాశతో ఆహారం కల్తీ అవుతోంది. వీరికి శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా తోడయ్యారు. కంపెనీలు చెప్పే ఆహారమే అసలైన ఆహారమని చెప్తున్నారు. కల్తీ ఆహారం తిని, రోగాలపాలయితే జీవితాంతం మందులు వాడండీ అంటూ.. ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున వ్యాపారం చేసుకుంటున్నాయి. ఆహారంలోనూ, ఫార్మాలోనూ లక్షల కోట్ల రూపాయల లాభాల పంట పడుతోంది. ఆ కంపెనీల లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు.
పాలల్లో కల్తీ
గతంలో మన దేశంలో ఆవులు, గేదెల ద్వారా వచ్చిన పాలను తోడేసి, పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని తినేవారు. పాలను ఆహారంగా తీసుకోవడం పాశ్చాత్యులు మొదలుపెట్టారు. తరువాత దాన్నొక వ్యాపారంగా మార్చారు. పాలు అధికంగా ఇచ్చేలా పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపారం. ఆ తర్వాత ఆ పాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఇతర కెమికల్స్ కూడా వ్యాపారమే. ఇందులోని లాభాల కోసమే పాలను సంపూర్ణ ఆహారం అంటూ పెంచి, పోషించారు. పాల ఉత్పత్తి పెరుగుదలకు పశువులకు ఇచ్చిన స్టెరాయిడ్స్… అవి ఇచ్చే పాలల్లో కూడా ఉంటున్నాయి. ఆ పాలు తాగిన మనుషులకు రోగాలు వస్తున్నాయి. 14 ఏళ్లకు మెచ్యూర్ (పుష్పవతి) కావాల్సిన ఆడపిల్లలు 8, 9 ఏళ్ల వయస్సుకే మెచ్యూర్ కావడం ఈ స్టెరాయిడ్స్ ఉన్న పాలను తాగడం వల్లనే. ఆడపిల్లలకు పెదాలపై అవాంఛిత రోమాలు రావడానికి కారణమూ ఈ పాలే! పాలతో మనుషుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, హార్మోన్లు అసమతుల్య మవుతాయి. పాల వల్ల వచ్చే శక్తి కన్నా దానివల్ల కలుగుతున్న అనారోగ్యం చాలా ఎక్కువ. ఈ పాలకు తోడు కాఫీ, టీ పొడి, పంచదార కలిసి ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం చేస్తున్నాయి. గేదె, ఆవు పాలు బదులు కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు, సజ్జల పాలు చాలా ఆరోగ్యకరం. గ్లాసు పాలల్లో దొరికే క్యాల్షియం కన్నా పది గ్రాముల నువ్వుల్లో దొరికే క్యాల్షియం చాలా ఎక్కువ. పాలు, టీ, కాఫీలు మానేసి వారానికి రెండు నువ్వుల లడ్లు తింటే చాలా ఆరోగ్యం.
పంచదారతో ప్రమాదం
తీపికి ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువ మంది ప్రాణాలను హరిస్తున్నది పంచదార. రోజుకు మనిషి శరీరానికి ఐదు గ్రాములు గ్లూకోజ్ అందితే సరిపోతుంది. కానీ కాఫీ, టీ, స్వీట్లు, వరి, గోధుమల ద్వారా చేసిన ఆహారం తినడం ద్వారా దాదాపు 150 నుండి 170 గ్రాముల గ్లూకోజ్ మన శరీరంలోకి వెళ్తోంది. దీన్ని కాలేయం అరిగించ లేకపోవడంతో అది కాస్తా చెడు కొవ్వుగా, ఆ తర్వాత ట్రైగ్లయిడ్స్గా మారుతోంది. ఇది మనిషి శరీరం మొత్తాన్ని సర్వనాశనం చేస్తోంది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెజబ్బులు, క్యాన్సర్, ఊబకాయం వీటన్నింటికీ ఈ చెడు కొవ్వే కారణం. చెరకుతో వచ్చే ఏ తీపి అయినా ప్రమాదమే. తెల్ల పంచాదార అయితే మరింత విషం. ప్రజలు తీపి కావాలనుకుంటే తాటి బెల్లం, ఈత బెల్లం తినడం ఉత్తమం. వీటి ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకపోగా, ఆరోగ్యాన్ని అందించే చాలా పోషకాలు శరీరానికి అందుతాయి.
చిరు ధాన్యాలతో ఆరోగ్యం
వరి, గోధుమలతో అనారోగ్యమే. వీటికి బదులుగా మూల ఆహారంగా తృణ ధాన్యాలైన కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఈ ధాన్యాల్లో పిండి, పీచు పదార్థాల నిష్పత్తి ఐదు నుంచి ఎనిమిది శాతం లోపే ఉంది. ఈ నిష్పత్తి తొమ్మిదిలోపు ఉన్న పదార్థాలన్నీ అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తారు. వీటికి రోగాలు రాకుండా పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించే శక్తి లభిస్తుంది. అంతమాత్రమే కాకుండా ఉన్న రోగాలనూ తగ్గించే శక్తి ఉంది. వీటిల్లో అధిక మొత్తంలో పీచు పదార్థంతో పాటు విటమిన్లు, మినరల్స్, పోషకాలు కూడా భారీగా ఉన్నాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఒరిగలు కూడా తృణధాన్యాలే అయినప్పటికీ వీటికి రోగాలను తగ్గించే శక్తి లేదు. రోగాలను రాకుండా మాత్రం ఆపగలవు.
‘నాసిరకం’ అనే భావన
millets hyderabad1960 లెక్కల ప్రకారం భారత దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 32.9 కిలోల చిరుధాన్యాలు తినేవాడు. 2010కల్లా ఈ వినియోగం పట్టణ ప్రాంతాలతో కలిపి 4.2 కిలోలకు తగ్గింది. ప్రజల పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణ వల్ల గోధుమ ఉపయోగం పెరిగింది. ఇది శ్రేష్టమైన తిండిగా భావిస్తున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గింది. వీటిని నాసిరకం తిండిగా భావిస్తున్నారు. 1960 మధ్యలో ఒక భారతీయ పట్టణవాసి సగటున సంవత్సరానికి 27 కిలోల గోధుమలు తినేవాడు. ఇది 2010లో రెట్టింపై 52 కిలోలయింది. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమలు, బియ్యానికి రాయితీలిస్తోంది. అందువల్ల ప్రజల్లో ప్రత్యేకించి పట్టణ జనాభాలో వీటి ఉపయోగం పెరిగింది. చిరుధాన్యాల వాడకం తగ్గింది. ప్రభుత్వం చిరు ధాన్య పంటలకు రాయితీలు ఇవ్వాలి.
వంటలు – చిరుధాన్యాలతో అనేక రకాల తిండి పదార్థాలు తయారు చేస్తారు. రొట్టెల తయారీలో జొన్న ప్రధానమైనది. తర్వాతి స్థానం రాగులది. కొర్రలతో అన్నం వండుతారు. అచ్చం కొర్రలతోనూ, వరి బియ్యం – కొర్ర బియ్యం సగం సగం కలిపి కూడా వంటచేస్తారు. కొర్రలతో అరిశలు, చక్కిలాలు చేస్తారు. జొన్నలతో సంగటి (ముద్ద) చేస్తారు. సంగటి నాలుగు రకాలుగా చేయొచ్చు. జొన్నల్లో జొన్నపిండి కలిపి చేస్తారు. జొన్నల్లో రాగి పిండి కలిపి తయారు చేస్తారు. వరి బియ్యానికి రాగి పండి కలిపి చేస్తారు.
రాగి సంగటి – ఈ మధ్య కాలంలో కార్పొరేట్ హోటళ్ళు రావడం అందులో ఎక్కువగా రాగి సంగటితో పాటు కోడి పులుసు బహుళ ప్రచారానికి వచ్చింది. శాఖాహారులు వేరుశనగ, నల్లేరు, కుసుమల ఊరుమిండి (రోటి పచ్చడి) కలుపుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇటీవలి కాలంలో ఆహారంపై అవగాహన పెరగటం, మధుమేహులు అన్నానికి ప్రత్యామ్నాయంగా వాడటం వలన ఇదివరలో రాయలసీమలో ఎక్కువగా వాడుకలోనున్న రాగి సంగటి ఇప్పుడు ఆంధ్ర, తెలంగానాలలో కూడా ప్రాచుర్యం పొందింది.
జొన్న, సజ్జ రొట్టెల రుచి చెప్పనవసరం లేదు. ఇవి నెలల తరబడి నిలవుంటాయి. సజ్జలతో బూరెలు చేస్తారు. రాగి పిండితో దోశలు, రొట్టెలు, బూరెలు, లడ్డూలు చేయొచ్చు. ఆరికె అన్నంలో కంది పప్పు కలుపుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వంటల్లో బియ్యం, గోధుమలకు బదులు చిరు ధాన్యాలను వాడుకోవచ్చు. చిరుధాన్య వంటలతో మధుమేహ (షుగర్) వ్యాధిని నియంత్రించొచ్చని వైద్యులు చెపుతున్నారు.
పశుగ్రాసంగా – పశుగ్రాసంగా చిరుధాన్య పంటలు బాగా ఉపయోగపడతాయి. గింజలు రాల్పుకున్న తర్వాత మిగిలిన చెత్త, ఆకులు, పొట్టు, కంకులు మంచి పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి రాగి చెత్త, కొర్ర గడ్డి, ఆరికె గడ్డి, లేత చొప్ప (జొన్న గడ్డి)ను పశువులు చాలా ఇష్టంగా తింటాయి. పశుగ్రాసం పెరిగితే పశుపోషణలో ఉన్న కష్టాలు తొలగి పాడి పరిశ్రమకు, వ్యవసాయానికి ఊతం లభిస్తుంది.
ప్రకృతిని కాపాడుకోవాలి
గోధుమ, వరి, చెరకు పంటల కోసం భారీ మొత్తంలో నీరు అవసరమౌతోంది. దీంతో భూమిపై నీరు తగ్గిపోతోంది. మాంసం తయారీకీ పెద్ద మొత్తంలో నీళ్లు ఖర్చు చేస్తున్నారు. కాఫీ, తేయాకు, చెరకు తోటల కోసం విపరీతంగా చెట్లను నరికేస్తున్నారు. దీంతో భూ తాపం పెరిగిపోతోంది. నీలి రంగులో ఉన్న భూగ్రహం కాస్తా గోధుమ వర్ణంలోకి మారుతోంది. అనారోగ్యకరమైన ఈ ఉత్పత్తులను వదిలేసి, చిరుధ్యానాలను తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. చిరుధాన్యలకు వరి పంటలో 28 శాతం నీరు చాలు. మెట్టప్రాంతంలో రెండు వానలు పడితే చాలు చిరుధాన్యాలు బాగా పండుతాయి. వీటికి పురుగు మందులు, రసాయనిక ఎరువుల అవసరం కూడా లేదు. దీంతో మెట్ట రైతులకు ఆదాయాలు లభిస్తాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. భూ తాపం కూడా తగ్గుతుంది. మనుషులతో పాటు పక్షులు, జంతువులూ ఆనందంగా జీవిస్తాయి.
మాంసాహారం మితిమీరితే వ్యాధులే
ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ఉండే మాంసం వినియోగం కూడా అనేక జబ్బులకు కారణం. మనిషికి రోజూ తినే ఆహారంలో ఆరు శాతం ప్రోటీన్లు ఉంటే సరిపోతోంది. కానీ మాంసం అధిక వాడకం వల్ల అది 30 నుంచి 50 శాతానికి పెరిగిపోతోంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. నాలుగు నెలల్లో పెరగాల్సిన కోళ్లను ఫారాలలో ఎక్కువగా దాణా వేసి, రోజంతా తినిపించి, రెండు నెలలకే సిద్ధం చేసి, మార్కెట్కు తరలిస్తున్నారు. దీంతో వీటిలో ఎముకలు, కండరాలు సరిగ్గా పెరగకుండా కేవలం కొవ్వు మాత్రమే ఉంటోంది. పందులు, మేకలు, చేపల విషయంలోనూ ఇంతే జరుగుతోంది. అందువల్ల వీటికి బదులు చిరుధాన్యాలను విరివిగా వాడడం వల్ల మనకి ఆరోగ్యలాభం…రైతులకు ఉపాధి కూడా పెరుగుతుంది. చిరుధాన్యాలతో పిండి పదార్థాలతో పాటు శారీరక పెరుగుదలకు ఉపయోగపడే మాంసకృత్తులు, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉండటం వల్ల ఎముకలు దృఢత్వానికి సహకరిస్తాయి. ఇనుము తగు మోతాదులో ఉండటం వల్ల రక్తహీనతకు గురికాకుండా కాపాడుకోవచ్చు చిరుధాన్యాలతో విలువాధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు.