మధుమేహం నుంచి బయటపడాలంటే?

మధుమేహ వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ అని వ్యవహరిస్తుండగా, సాధారణ వ్యవహారిక భాషలో షుగర్‌ వ్యాధి, చక్కెర వ్యాధి అంటుంటారు. వైద్య విజ్ఞానం ఎంత ఎదుగుతున్నా ఇంతవరకూ ఈ వ్యాధి నివారణకు సరైన మందు కనుగొనలేదు. కానీ సరైన ఆహార నియమాలు, తగిన జాగ్రతలు పాటిస్తే కచ్చితంగా దీనివల్ల ఎలాంటి భయం లేకుండా నియంత్రణలో ఉంచుకుని పూర్తి జీవితకాలాన్ని పొందవచ్చు. మధుమేహం అంటువ్యాధి కాదు. ఇది రావడానికి జీవనశైలి ప్రధానమైన కారణం. ముఖ్యంగా పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్‌ ఫుడ్‌ తినడం, సమయపాలన లేని భోజనం వంటివి ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. కొంతమందిలో ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమిస్తోంది

ఈ వ్యాదికి మూల కారణం క్లోమ గ్రంథిóలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోజ్‌ స్థాయిని అరికట్టడానికి సరిపడే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల మెటబాలిజంలో మార్పులు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతుంది. ఇది రకరకాల రుగ్మతలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మనదేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. కానీ జీవన విధానాన్ని మార్చుకుని, జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

మూడు రకాలుగా వర్గీకరించిన మధుమేహంలో మొదటిరకం డయాబెటిస్‌ని పరిశీలిస్తే.. సాధారణంగా బీటా కణాలను మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ స్వయంగా నాశనం చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీగా పేర్కొంటారు. రెండోరకం డయాబెటిస్‌లో ఇన్సులిన్‌ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్‌ కావాల్సి వస్తుంది. బీటా కణాలు ఈ డిమాండ్‌ తట్టుకోలేనప్పుడు అది డయాబెటిస్‌కి దారితీస్తుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌లోనూ ఇన్సులిన్‌ నిరోధకత కనపడుతుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్‌ అవసరమవుతుంది. బీటా కణాలు ఈ డిమాండ్‌ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్‌ కలుగుతుంది.

టైప్‌ 1 డయాబెటిస్‌ చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్సులిన్‌ తయారీ తగ్గిపోవడం వల్ల వారిలో ఈ రకమైన వ్యాధి వస్తుంది. టైప్‌ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్‌ ఉత్పత్తి జరిగినా, దానిని శరీరం వినియోగించుకోలేదు. 90 శాతం మందిలో ఈ రకం డయాబెటిస్‌ కనిపిస్తోంది. గర్భిణుల్లో కొంతమందికి ప్రసవం ముందు జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వస్తుంది. వారిలో ప్రసవం తరువాత గ్లూకోజ్‌ స్థాయిలు మామూలు స్థితికి వస్తాయి.

లక్షణాలు
diabetesమధుమేహం ఉన్నవారిలో కొన్ని సాధారణ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అతిగా దాహం వేయడం, ఆకలి ఎక్కువగా అవడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు బరువు కూడా తగ్గుతారు. శరీరంలో పెరుగుదల లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. చర్మవ్యాధులు తరచూ వస్తుంటాయి. శరీరంపై గాయమైన చోట తొందరగా తగ్గకపోవడం ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైన అంశం.

నిర్ధారణ
మధుమేహం ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఉదయాన్నే పరగడుపుతో రక్త పరీక్ష, ఆహారం తీసుకున్న తర్వాత రక్త పరీక్ష చేయించాలి. భోజనం చేయక ముందు లభించిన నమూనాలో విలువ 126 కన్నా తక్కువగా ఉండాలి. తిన్న తరువాత కూడా అదేవిధంగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు లేవని చెప్పవచ్చు. గర్భిణులు తప్పనిసరిగా మధుమేహ వ్యాధి పరీక్ష చేయించుకోవాలి. తినకముందు 100 కన్నా తక్కువ, తిన్న తరువాత 140 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. వీరికి ముందుగా 75 గ్రాముల గ్లూకోజ్‌ తినిపించి, మూడుసార్లు నమూనాలని తీసుకుంటారు. జీరో అవర్‌లో 90 కన్నా తక్కువ, గంట తరువాత 180 కన్నా ఎక్కువ, రెండు గంటల తరువాత 150 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇన్సులిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మందిలో డెలివరీ తరువాత గ్లూకోజ్‌ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. కానీ కొంతమందిలో మాత్రం మధుమేహ వ్యాధి పెరిగే ప్రమాదం ఉంది.

గ్లూకోజు పరీక్ష చేస్తే చాలదు
చాలామంది మధుమేహం వచ్చినవారి రక్తంలో గ్లూకోజు ఒక్కటే చూసుకుంటూ.. ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్‌, హైబీపీ వంటివేమీ పట్టించుకోవటం లేదు. కానీ ఇది సరికాదు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజు నియంత్రణలోనే ఉంటున్నా (అంటే పరగడుపున రక్తంలో గ్లూకోజు 125 కంటే తక్కువగానే ఉంటున్నప్పటికీ) వారి రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, హైబీపీ వంటివి ఎక్కువ ఉంటే మధుమేహం కారణంగా వచ్చే దుష్ప్రభావాలన్నీ ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రక్తంలో గ్లూకోజు మాత్రమే తగ్గించుకుంటే సరిపోదని తెలుసుకోవాలి. రక్తంలో గ్లూకోజుతో పాటు ఊబకాయం, హైబీపీ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు.. ఈ నాలుగింటినీ కూడా కచ్చితంగా పట్టించుకోవాలి. వీటిలో ఏవి ఎక్కువగా ఉంటే వాటిని నియంత్రించడానికి మందులు వాడాలి. ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్‌, హైబీపీల మీద కొంతమందికి అవగాహన బాగానే పెరిగిందిగానీ.. ఇప్పటికీ ట్రైగ్లిజరైడ్ల గురించి చాలామందికి తెలియదు. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ ఉన్నా వాటిని అసలు పట్టించుకోవటం లేదు. కానీ ట్రైగ్లిజరైడ్లు 200లోపు ఉండాలి. 200లకు మించి 600 లోపు ఉంటే – మందులు వాడటం అవసరం. ఆ పరిమితి దాటితే ఇన్సులిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్స
మధుమేహాన్ని ఒకేసారి పూర్తిగా నిర్మూలించడానికి ఎలాంటి చికిత్సా లేదు. మధుమేహం ఉందని నిర్ధారణయితే జీవితాంతం మందులు, ఇన్సులిన్‌ ఇంజక్షన్లు వాడాల్సి ఉంటుంది. రోగి పరిస్థితిని బట్టి ఏ ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలనేది వైద్యుడు నిర్ణయిస్తారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తుంటే మాత్రల డోస్‌ పెంచాల్సిన అవసరం ఉండదు. అవేమీ పాటించకపోతే మందుల డోస్‌ పెంచాల్సిందే.

అప్రమత్తత దినచర్యలో భాగం కావాలి
జీవనశైలిలో ఏమరుపాటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా దినచర్యలో భాగంగా మార్చుకోవాలి.
– ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవాలి.
– వారంలో నాలుగైదు రోజులైనా వ్యాయామం చేయాలి.
– దుంపకూరలు తినకూడదు. కొబ్బరినీళ్లు తాగకూడదు.
– ఆపిల్‌, బత్తాయి, జామ, బొప్పాయి, కమలాపండ్లు తినొచ్చు.
– ట్రైగ్లిజరైడ్లను అదుపులో ఉంచడానికి పిండి పదార్థాలను తినడం తగ్గించాలి.
– అన్నం తినడాన్ని మానెయ్యాల్సిన పనిలేదుగానీ.. తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు అంటే బ్రెడ్లు, బిస్కెట్లు, జామ్‌, చిప్స్‌ వంటివి తినడం మానెయ్యాలి.
– మద్యం కూడా ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండాలి.
– గోధుమలు, రాగులు, జొన్నలు, ఆకుకూరలు, వంకాయ, బెండ, కాకర, పొట్ల, కాబేజి, దొండకాయ, మునగకాడలు, టమాటా, క్యాలీఫ్లవర్‌ వంటివి ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి.
– ఉదయం పూట రాగి జావ తాగడం మంచిది.
– ధూమపానం వంటి అలవాట్లు మానెయ్యాలి.
– డాక్టర్‌ సూచించిన విధంగా మందులు వేసుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు.

వచ్చే ఆరోగ్య సమస్యలు
మధుమేహం ఎక్కువకాలంగా కొనసాగుతున్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. గుండె సమస్యలు, కంటి సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో తరచుగా కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఇలాంటి వారు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహ నియంత్రణలో ఉన్నా సరే సమస్యలు రావచ్చు. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి. ఈ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా రక్తసరఫరా తగ్గిపోయి, అవయవాలు దెబ్బతింటాయి. కాళ్లకు రక్త సరఫరా తగ్గిపోతే కిందిభాగం నల్లగా మారుతుంది. కణాలన్నీ చనిపోయి ఆ ప్రదేశంలో ‘గాంగ్రిన్‌గా’ మారుతుంది. ఈ పరిస్థితుల్లో కాలు తీసేయక తప్పదు. డయాబెటిస్‌ రోగులకు కాలుకు, ఇతర శరీర భాగాలకు ఏదైనా గుచ్చుకున్నా స్పర్శ, బాధ తెలియవు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలు రోజూ పరీక్షించుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నవారికి రక్తనాళాల్లో గ్లూకోజ్‌ పెరిగి, డయాబెటిక్‌ రెటీనోపతి వల్ల కంటిచూపు మందగిస్తుంది. మూత్రపిండాల పనితీరుపైనా ఈ వ్యాధి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

Scroll to Top