మాయమైపోయే జ్ఙాపకాలకు అప్రమత్తతే మందు
జ్ఞాపకాలే జీవితాన్ని నిత్యనూతనం చేస్తుంటాయి. అసలు జ్ఞాపకాలే లేకపోతే మనసంతా శూన్యమై బతుకే భారమైపోతుంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మెదడుపొరల్లో నిక్షిప్తమై.. ఎన్ని సమస్యలు ఎదురైనా బతుకు మీద కొత్త ఆశలను చిగురింప చేస్తాయి. అలాంటి జ్ఞాపకాలనే కాదు, వాటికి మూలమైన జ్ఞాపకశక్తినీ కోల్పోతే ఆ జీవితమంతా అస్తవ్యస్తంగా మారుతుంది. ఇలా జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోవడాన్నే వైద్య పరిభాషలో అల్జీమర్స్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి లక్షణాలేమిటి? ఎలా వస్తుంది..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స.. తదితర విశేషాలు తెలుసుకుందాం!
ప్రపంచంలో ప్రతి వెయ్యిమందిలో 10 నుంచి 17 మంది, మనదేశంలో ప్రతి వెయ్యిమందికి నాలుగు నుంచి పదిహేడు మంది అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్నారు. అల్జీమర్ డిమెన్షియా అనేది నయం కాని మెదడు సంబంధ వ్యాధి. అయితే తొలిసారిగా అలెస్ అల్జీమర్ అనే వైద్యుడు 1906లో మెదడులోని కణాలు నశించి, నరాలు దెబ్బతిని జ్ఞాపకశక్తి, ఆలోచన, జీవన విధానంలో రోజూ చేసే పనులలో తేడా వస్తుందని కనుగొన్నాడు. అందుకే ఆయన పేరుపైన ఈ వ్యాధిని ‘అల్జీమర్స్’ అని పిలుస్తున్నారు.
ఎవరికైనా వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు, వినికిడి శక్తి తగ్గడం వంటి మార్పులు కనిపిస్తాయి.ఈ మార్పులు మెదడులో కూడా ఉంటాయి. కానీ వేగం, తీవ్రత మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పో క్యాంపస్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్ కణాల సంఖ్య, సామర్థ్యం తగ్గడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. దీన్ని వయసుతో వచ్చిన మామూలు మతిమరుపే అనుకుంటే పొరపాటే. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా న్యూరాలజీ వైద్యనిపుణులతో చికిత్స ప్రారంభించి, నియంత్రించ వచ్చు. జబ్బు బాగా ముదిరిన తర్వాత వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు.
ఇలా వస్తుంది
ఇది మెదడుకు, వాటిలోని నరాలకు సంబంధించిన సమస్య. దీనివల్ల మనిషి అలవాటుపడ్డ పనులలో చాలా తేడా కన్పిస్తుంది. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, మాట్లాడే విధానంలో మార్పును తీసుకువస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ సమస్య తీవ్రత ఎక్కువవుతుంది. ఒక్కోసారి రకరకాల కారణాల వల్ల యుక్తవయస్సు, మధ్యవయస్సు వారిలోనూ అల్జీమర్స్ కనిపిస్తుంది. చాలామంది వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్ వ్యాధికి దారి తీయవు. సంబంధిత విషయంపై ఆసక్తి లేకపోయినా తాత్కాలికంగా మతిమరుపు రావచ్చు. ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి ఈ అల్జీమర్స్. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధానలక్షణం. ప్రస్తుతం ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్‌కీ, ఒత్తిడికీ అవినాభావ సంబంధముంది. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో విషయగ్రహణ చర్యను అడ్డుకునే అల్లోప్రెగనోలోన్ అనే స్టెరాయిడ్స్ స్థాయులు అధికమవుతున్నాయి. ఇది ఎక్కువకాలం కొనసాగితే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పు అధికమవుతుంది. అల్జీమర్స్ వ్యాధిలో మెదడు కణాలు దెబ్బతింటాయి. అందుకని ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి.
లక్షణాలు
Alzheimers Diagnosis
– దీర్ఘకాలిక, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోవటం వల్ల తీవ్రమైన చిత్తవైకల్యం ఏర్పడుతుంది.
– పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్ట లేకపోవడం.
– పేర్లు మరచిపోవడం, వెళ్ళవల్సిన సమయం మర్చిపోవడం, దారి మర్చిపోవడం, వస్తువులు గుర్తు పెట్టుకోలేకపోవడం వంటి సమస్యలుంటాయి.
– ఆలోచన, తార్కికంలో ఇబ్బంది. అక్షరాలూ, అంకెలూ గుర్తుపట్టడంలో ఇబ్బందిపడటం.. లెక్కలు చేయడం కష్టమవడం. స్వంత ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో ఇబ్బంది ఏర్పడటం జరుగుతుంది.
– వంట చేయడం, బండి నడపడం, ఇంటిపనులు చేయడం కష్టమౌతుంది.
– చిత్తవైకల్యం ఎక్కువైనప్పుడు.. ప్రతిరోజూ చేసే స్నానం, బట్టలు వేసుకోవడం, తయారుకావడం, తినడం, ఎవరి సాయం లేకుండా టాయిలెట్‌ను వాడటం వంటివీ చేయడం అసాధ్యమౌతుంది.
– దేనినీ సరిగా అంచనా వేయలేకపోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
– ప్రస్తుత సమయం, తేదీ, రోజులను మర్చిపోవడమే కాక, ప్రజలను, స్థలాలనూ గుర్తుపట్టకపోవచ్చు. తమ ఇంటి చిరునామా మర్చిపోవచ్చు.
– తాము ఉండే చోటు లేదా పనిచేసే చోటు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా మర్చిపోవచ్చు.
– మాట్లాడేటప్పుడు భాషను సరిగ్గా ఉపయోగించ లేకపోవచ్చు, పదాలు సరిగ్గా చెప్పలేకపోవచ్చు.. లేదా మాట్లాడిన, రాసిన పదాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
– కారణం లేకుండానే మితిమీరిన కోపం, ఆత్రుత లేదా అనుమానాస్పదంగా మారతారు. అందరిలో కలిసే మనస్తత్వం ఉన్నప్పటికీ ముడుచుకుపోయి, దూరంగా, నిశ్శబ్ధంగా ఉంటారు. ప్రవర్తన మారుతుంది. ఆలోచనలు హఠాత్తుగా మారిపోవడం వంటి మార్పులు వస్తాయి.
– కోపంతో చెడుగా ప్రవర్తించవచ్చు. భ్రాంతులు, భ్రమలు అక్కడ లేని ప్రజలను, జంతువులను చూడటం, వినడం మొదలైనవి జరగవచ్చు. భ్రమలు, భ్రాంతులను కల్గించవచ్చు.
– ఇతరుల ఉద్దేశాలపై నిరాధారంగా తీవ్ర అనుమానాలు ఏర్పరచుకుంటారు.
– మానసిక రుగ్మతలు పెరుగుతాయి. అధిక ఆత్రుత, భయం వలన కలుగుతుంది. అంతర్ముఖులుగా మారి పట్టువదలని, అసూయ, స్వార్థంతో, కఠిన మనస్కులుగా మారుతారు.
– తక్కువగా ఉపయోగించే పదాలు మొదట మరిచిపోతారు. చెప్పిన మాటలే పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఐదు నిమిషాల ముందు జరిగిన విషయాలూ మరిచిపోతారు. రానురాను ఒకటి రెండు రోజుల ముందు విషయాలు మరిచిపోతారు. పాత విషయాలు మాత్రం చివరి వరకూ గుర్తుంటాయి. దీనినే ‘రిబోట్ లా ఆఫ్ మెమెరీ’ అంటారు.
– ఉదయ సాయంకాలాలకు తేడా కనుక్కోలేరు. వేళ్ల మీద అంకెలు లెక్కించటమూ కష్టమవుతుంది.
– వయసుతో పాటు పెద్దవారిలో వచ్చే ఈ సమస్యలను ఇంట్లోవారు అర్థం చేసుకోవాలి.
– అల్జీమర్స్ వ్యాధి ముదిరాక తమపనులు చేసుకోవడమే కాక లేచి ఎలా నడవాలో తెలియక మంచానికే పరిమితమవుతారు. మల, మూత్రాలు వస్తున్నాయన్న విషయం గమనించకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ వీటిని విసర్జిస్తారు. ఈ జబ్బులో ఫిట్స్ అనేది అరుదుగా వస్తుంది. ఇది చిట్టచివరి దశ.
కారణాలు
brain– వయసు పైబడిన వారిలో అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరైనా అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్లయితే వంశపారపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశమూ ఉంది. కొన్నిరకాల జీన్స్ వల్ల ఇది వస్తోందని పరిశోధనల్లో తేలింది.
– వయసు పైబడని వారిలో ముఖ్యంగా మెదడులో కొన్ని ప్రొటీన్లు రక్తంలో కొలెస్టరాల్‌ను పెంచి అల్జీమర్స్ రావడానికి దోహదం చేస్తున్నాయి.
– ఏదైనా ప్రమాదంలో తలకు దెబ్బ తగిలినపుడు మెదడులో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినపుడు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
– గుండె కొట్టుకుంటున్నప్పుడు 20 శాతం రక్తం గుండె నుంచి మెదడుకు రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది. మెదడులోని కణాలకు అవసరమైన ఆక్సిజన్ దీని ద్వారానే అందుతుంది. రక్తనాళాలలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినపుడు, మెదడుకు జరిగే రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినపుడు అక్సిజన్ అందదు. దీనివలనా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది.
– ముఖ్యంగా గుండెజబ్బులు, స్ట్రోక్, రక్తపోటు ఎక్కువగా ఉండటం, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల అల్జీమర్స్ రావచ్చు.
– ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలవల్ల రక్తనాళాలు దెబ్బతిని, అల్జీమర్స్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.
నియంత్రణే.. నివారణ లేదు
అల్జీమర్స్ వ్యాధికి గురైతే పూర్తిగా నివారణ వీలుకాదు. నియంత్రణ మాత్రమే చేయవచ్చు. వయసు మీరకపోయిన వారికి తలలో రక్తం గడ్డకట్టడం, తలకు తీవ్రగాయమైనపుడు ఈ లక్షణాలు కనిపిస్తే అల్జీమర్స్ వ్యాధి అని నిర్ధారణ చేయకూడదు. రక్తంలో సోడియం, క్రియాటీన్, థైరాయిడ్ హార్మోను మోతాదు తగ్గితే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాధారణ రక్తపరీక్ష ద్వారా వీటి మోతాదును తెలుసుకుని, మందులతో పూర్తిగా నయం చేయొచ్చు. ఇదేకాక ఎంఆర్‌ఐ, సిటీస్కాన్ చేయడం వల్ల నిర్ధారణ చేయవచ్చు. వెన్నులోని కొంత నీరు తీసుకుని, సిఎస్‌ఎఫ్ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు.
మొదట్లో గుర్తిస్తేనే …
అల్జీమర్స్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే మందులతో నియంత్రణ సాధ్యపడుతుంది. మందుల వల్ల జబ్బు తీవ్రత, వేగాన్ని నియంత్రించవచ్చు. వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడితే మూడు నుంచి ఆరు నెలల్లో మంచి ఫలితాలు వస్తాయి. మందులే కాకుండా రోగికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం. రోగి రోజూ చేసే పనులు గుర్తుచేస్తుండాలి. జబ్బు తొలిదశలో ఉన్నప్పుడు మతిమరుపు తగ్గించుకోవడానికి తాము చేసే పనులను ఒక పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేయాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రోగి ఉండే గది దగ్గరే బాత్‌రూమ్ ఉండాలి. అల్జీమర్స్‌కు గురైనవ్యక్తిని ఒంటరిగా బయటకు పంపకూడదు. జ్ఞాపకశక్తి లేదని అవహేళన చేయకూడదు. ఒంటరిగా ఉండకుండా టీవీ, పత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల వారు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. ఒత్తిడి పెరిగితే దీని తీవ్రత పెరుగుతుంది. అందుకని ప్రశాంత వాతావరణం కల్పించాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అల్జీమర్స్ జబ్బు గురించి ఒక అపోహ ఉంది. ఒక వయసు వచ్చాక (50 ఏళ్ళ తరువాత) ఎలాగైనా మతిమరుపు సహజమని. ఇదే ఆ జబ్బు అని భావిస్తారు. ఇది వాస్తవం కాదు. వయసొచ్చిన వాళ్ళలో వ్యక్తిపరమైన, సాంఘికపరమైన ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని అల్జీమర్స్‌గా గుర్తిస్తారు. జబ్బును న్యూరాలజిస్ట్ మాత్రమే నిర్ధారిస్తారు. అల్జీమర్స్ వ్యాధి ఉందని నిర్ధారించిన తరువాత ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పెరుగుతుంది. అల్జీమర్స్ వల్ల మరణాలు రావు, కానీ, దీంతో తలెత్తే సమస్యలతో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
అల్జీమర్స్ డిమెన్షియాతో బాధపడుతున్న రోగి మెడకు ట్యాగ్ కట్టాలి. అందులో రోగి పేరు, వయసు, ఆరోగ్య పరిస్థితి, చిరునామా, సంప్రదించాల్సి ఫోన్ నెంబర్లు ఉండాలి. రోగి గురించి చుట్టుపక్కల ఉన్నవారికి, బంధువులకు, స్నేహితులకు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇంట్లో పనిచేసివారికి, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్‌కు… ఇలా ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఒకవేళ తప్పిపోయినపుడు వీరికి కనిపిస్తే ఇంట్లో వారికి సమాచారం ఇచ్చే అవకాశముంది. ఒంటరిగా ఎప్పుడూ వీరిని ఉంచకూడదు. వీరితోపాటు ఎవరో ఒకరుండాలి. అల్జీమర్స్ అసోసియేషన్ ఆఫ్ యుఎస్ 24 గంటల జాతీయ అత్యవసర సేవలు అందిస్తోంది. దీనిపేరు ‘మెడిక్ అలర్ట్ అండ్ సేఫ్‌రిటర్న్’. దీనికోసం రోగి బంధువులు రోగిపేరును ఇందులో నమోదు చేసుకోవాలి. చాలా కంపెనీల్లో ధరించేందుకు సిద్ధంగా ఉన్న జిపిఎస్ ట్రాకింగ్ డివైసెస్, జిపిఎస్ ఉన్న గడియారాలూ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో అల్జీమర్స్‌కు గురైన వారిని అనుక్షణం అప్రమత్తంగా గమనిస్తుండాలి.