సంతానలేమికి కారణమౌతున్న గర్భాశయ క్షయ
సంతానలేమి సమస్యతో బాధపడే మహిళల్లో చాలా మందికి గర్భాశయానికి సోకిన క్షయ వ్యాధి కారణమౌతుండడం ఆందోళన కల్గించే అంశం. సాధారణంగా క్షయవ్యాధి శరీరంలోని ప్రధాన భాగాలైన ఊపిరితిత్తులపై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియా రక్తం ద్వారా ఇతర అవయవాలకు, పునరుత్పత్తి అవయవాల వరకు ప్రయాణిస్తుంది. దీంతో ఫెలోపియన్ నాళాలు, గర్భాశయం, గర్భాశయ పొరలకు ఇన్ఫెక్షన్ ఏర్పడుతోంది. జననాంగాలలో, ఈ బ్యాక్టీరియా గుప్త భాగాలలో ఎక్కువగా ఉంటుంది. ఇలా దీని ఉనికి ఉన్నప్పటికీ కొన్నిసార్లు 20 సంవత్సరాలు గడిచాక కూడా ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు.
గర్భాశయ క్షయ లక్షణాలు
అపక్రమ రుతుస్రావం, కటి వలయంలో నొప్పి మొదలైనవి దీని ముఖ్య లక్షణాలు. కొన్నిసార్లు నిరంతరంగా రక్తంతో కూడిన లేదా దుర్గంధమైన వాసనతో రక్తం లేకుండా ఉన్నటువంటి స్రావాలు వెలువడతాయి. ఈ వ్యాధికి గురైన అనేకమంది మహిళలు లైంగిక చర్య తరువాత రక్తస్రావం జరుగుతున్న అనుభవాన్ని పొందుతారు.
గర్భ విచ్ఛిత్తికి కారణం
గర్భాశయంలో క్షయవ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల పది మంది మహిళల్లో ఇద్దరు సంతానలేమి సమస్యకు గురవుతున్నారు. తీవ్రమైన సందర్భాల్లో గర్భాశయంలోని పొర సన్నగా మారి, పిండం ప్రవేశం భరించలేకపోతుంది ఫలితంగా గర్భస్రావం జరుగుతుంది.
తొలిదశలోనే గుర్తిస్తే
సాధారణంగా గర్భాశయ క్షయని 15 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలలో గుర్తించాలి. ఇది మహిళలు ఆరోగ్యకరమైన గర్భం కోసం ఎదురుచూసే సరైన సమయం. మొదట్లోనే ఈ వ్యాధిని గుర్తించి, సమయానికి సరైన ప్రామాణిక చికిత్సను అందించినట్లయితే సమస్యని పరిష్కరించవచ్చు. రోగి 6 నుండి 9 నెలల వరకు మందులు పూర్తిగా వాడితే గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. ఒకసారి ఒక మహిళ గర్భం ధరించగానే ఆరోగ్యకరమైన పిండం, అవయవాల సరైన అభివృద్ధిని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తుండాలి.
చాలాసార్లు గర్భస్రావాలు జరిగిన కొంతమంది మహిళలకు ప్రత్యేకంగా మొదటి మూడు నెలల్లో పిండం గర్భాశయంలోని పొరలో సరైన విధంగా అంటిపెట్టుకొనేటంత వరకు శారీరక కార్యకలాపాలను తక్కువగా లేదా అసలు చేయకూడదని సూచిస్తారు. గర్భాశయ క్షయవ్యాధి చికిత్స అనంతరం ఆరోగ్యకరమైన గర్భం కోసం మందులు వాడుతూ డాక్టర్ సలహాలను చాలా కఠినంగా పాటించాలి.