చిన్నపిల్లల్లో పళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే వారు పెద్దయ్యాక మొండి సమస్యగా మారుతుంది. దంతాల ఆరోగ్యం మిగిలిన శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్నపిల్లల పళ్ల సమస్యలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు విద్య విస్తరించిన తర్వాత స్కూలుకు వెళ్లే హడావిడిలో సరిగ్గా బ్రష్ చేసుకోలేకపోతున్న చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వారికి హోమ్‌వర్కులు చేసి పెట్టడం, మధ్యాహ్నం భోజనానికి లంచ్ బాక్సులు రెడీచేయడం వంటి పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారేగానీ, వారు శుభ్రంగా పళ్లు తోముకుంటున్నారా? లేదా? అని పట్టించుకోవడం లేదు. దీని ఫలితంగా పిల్లల్లో దంత సమస్యలు మొదలై వారి ఆరోగ్యాన్నీ, వాటి వల్ల ఏర్పడే తీవ్రమైన బాధతో చదువుల్నీ దెబ్బతీస్తున్నాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే పిల్లల్లో దంత సమస్యలను దూరంగా ఉంచొచ్చు. పిల్లల్లో వచ్చే దంత సమస్యలు, వాటి లక్షణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలివీ
చిన్నపిల్లల్లో ఆరు నెలల నుంచి రెండున్నర ఏళ్ల వయసు వరకూ వచ్చే మొదటి దంతాలను ప్రాథమిక దంతాలు లేదా పాలపళ్లు అంటారు. ఆరు సంవత్సరాల వయసు నుంచి 12 సంవత్సరాల మధ్యలో శాశ్వత దంతాలు వస్తాయి. పాలపళ్లు (ప్రాథమిక దంతాలు)కు శాశ్వత దంతాలకు మధ్య సమయాన్ని మిక్సిడ్ డెంటిషన్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో పిల్లలు రెండురకాల దంతాలను కలిగి ఉంటారు. అంటే పాలపళ్లు రాలుతూ, శాశ్వత దంతాలు ఏర్పడుతుంటాయి. పిల్లలకు ప్రాథమిక దంతాలు రాగానే సమస్య ఉన్నా లేకున్నా ఒకసారి దంత వైద్యుడిని కలవాలి. పిల్లల్లో దంత సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఆ సమయంలో వచ్చే దంత సమస్యలను కూడా ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లల్లో వచ్చే దంత సమస్యలు
పిల్లలకు ఎక్కువగా దంత క్షయం, చిగుళ్ల సమస్యలు, పంటికి చీము పట్టడం, నోటి కురుపులు, హెర్పిస్ వైరస్ వ్యాధి, డెంటల్ ఫ్లోరోసిస్, దంతాలను ప్రమాదవశాత్తు కోల్పోవడం, ఎదుగుదలలో వంకర, ఎగుడు, దిగుడు పళ్లుప్రమాదంలో దవడ ఎముక విరగడం, దవడ కీలుకు దెబ్బ తగలడం, నోటి అలవాట్లు, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వంటివి కన్పిస్తుంటాయి. ఈ సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్నట్లు గమనించినా వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి. ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా పిల్లలను దంత వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి ప్రాథమిక దంత పరీక్షలు చేయించాలి.
చిగుళ్ల వాపు
చాలా మంది పిల్లలు తమ పళ్లను బ్రష్‌తో సరిగ్గా శుభ్రం చేసుకోలేరు. దీనివల్ల నోట్లో చిగుళ్ల చుట్టూ పాచి పేరుకుపోతుంది. ఈ కారణంగా చిగుళ్లు వాయటం, ఎర్రబడడం, వాటి నుంచి రక్తం కారడం లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇవన్నీ చిగుళ్ల జబ్బును సూచించే లక్షణాలే. చిగుళ్ల సమస్య చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై దంతాలను పట్టి ఉంచే కండరాలకు, అక్కడి నుంచి దంతం అడుగునున్న ఎముకకు వ్యాపిస్తుంది. దానివల్ల ఎముక క్రమంగా క్షీణిస్తుంది. దాంతో దంతం పట్టు కోల్పోయి వదులుగా మారుతుంది. ఈ చిగుళ్ల సమస్యల్లో మూడు దశలుంటాయి. మొదటి దశలో పన్ను వదులై, దాని స్థానం నుంచి ఒక మి.మీటరు వరకూ కదులుతుంది. ఈ దశలో చిగుళ్లను శుభ్రం చేసి, మందులు వాడితే చాలు. రెండో దశలో పన్ను రెండు మి.మీటర్ల మేర కదులుతూ ఉంటుంది. ఈ దశకు చేరుకున్నప్పుడు చిగుళ్లను కోసి లోపలున్న ఇన్ఫెక్షన్‌ని క్లీన్ చేసి, క్షీణించిన ఎముక స్థానంలో కృత్రిమ ఎముకను అమర్చాలి. దీన్నే ‘ఫ్లాప్ సర్జరీ’ అంటారు. ఈ రెండు దశల్లో తగిన చికిత్సనందించి పన్నును కాపాడుకోవచ్చు. కానీ ఇన్ఫెక్షన్ మూడో దశకు చేరుకుంటే పన్నును కాపాడటం చాలా కష్టం. సర్జరీ చేసినా ఫలితం లేదు. పన్నును పీకేయటం తప్ప మరో మార్గం లేదు. వదులైన పన్నును అలాగే వదిలేస్తే పక్క పళ్లకూ ఇన్ఫ్‌క్షన్ సోకుతుంది.
ఎగుడు దిగుడు, ఎత్తు పళ్లు
బాల్యంలో వచ్చిన పాలదంతాలు ఊడిన ప్రదేశంలోనే శాశ్వత దంతాలు రావడం సహజం. అయితే కొంతమందిలో రక్తహీనత, హార్మోన్లలో లోపాల వల్ల కొన్నిసార్లు పాలపళ్లు ఊడకుండానే శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. దాంతో ఆ పన్ను పెరుగుదలకు పాలదంతం అడ్డుగా ఉండటంతో శాశ్వత దంతం ముందు లేదా వెనుక వైపుకు వంగి పెరుగుతుంది. అలా కింది దవడలో ఒక పన్ను అపక్రమంగా ఎదిగితే పై దవడలో అదే ప్రదేశంలో వచ్చే పన్ను కూడా అపక్రమంలోనే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పళ్ల కారణంగా మిగతా పళ్లూ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి పర్మనెంట్ టీత్ సక్రమంగా పెరగాలంటే ఆ పళ్లు ఎదిగే సమయానికి పాలపళ్లు ఊడక పోయినా వైద్యుల చేత పీకించేయాలి. దవడ ఉండాల్సిన పరిమాణం కంటే చిన్నదిగా ఉన్నా ఎగుడుదిగుడు పళ్లు వస్తాయి. నోట్లో వేళ్లు పెట్టుకునే చిన్న పిల్లల దవడలు ఎత్తుగా తయారవుతాయి. ఫలితంగా దంతాలూ ఎగుడుదిగుడుగా పెరుగుతాయి. కాబట్టి ఈ దంత క్రమాన్ని ప్రారంభంలోనే గుర్తించి, అప్రమత్తమై డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి.
నోటి అల్సర్లు, పూతలు
శరీరంలో రక్తహీనత, బీ కాంప్లెక్స్ విటమిన్ల లోపం ఉంటే నోటిపూత ఏర్పడుతుంది. నోరు ఎర్రగా మారి, ఏ ఆహారం తిన్నా నోరు మండుతుంది. ఇలాంటి నోటి పూతలు, నోటి అల్సర్ల అసలు కారణాన్ని గ్రహించి, చికిత్స తీసుకుంటేనే ఈ సమస్యలు తగ్గుతాయి. నాలుక మీద పుళ్లు, పొక్కుల వచ్చే సమయాన్ని ఎప్పటికప్పుడు గమనించాలి. ఎంత తరచుగా వస్తున్నాయి? ఎన్ని రోజులపాటు అవి వేధిస్తున్నాయి? అనే విషయాలను గమనించాలి.ఎలాంటి బాధ లేదనుకుని ఆ పుళ్లను అశ్రద్ధ చేస్తారు. అలా కొన్ని వారాలు, నెలలు డాక్టర్‌ని సంప్రదించకుండా ఊరుకుంటే ఆ వ్యాధులు ముదిరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నోటిపుళ్లు పది రోజులు దాటినా తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి.
పిప్పి పళ్లు
అత్యంత సూక్ష్మమైన బ్యాక్టీరియా ఎనామిల్, డెంటిన్, పల్లైన్ అనే మూడు పొరలతో తయారైన దృఢమైన దంతాల్లోకి కూడా చొచ్చుకుపోయి రంధ్రాలు చేసేస్తుంది. ఇలా పళ్లు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం తీపి పదార్థాలే. వీటిలోని కృత్రిమ చక్కెరలు నోట్లో యాసిడ్‌ని తయారుచేస్తాయి. దాంతో దంతాల పైపొరలు కరిగిపోయి, పంటి మీద చిన్న గుంత ఏర్పడుతుంది. తిన్న పదార్థాలన్నీ దాన్లో ఇరుక్కుంటాయి. వాటిలో మరింత ఎక్కువ యాసిడ్ తయారై, బ్యాక్టీరియా చేరి, ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల పన్ను మరింత పుచ్చిపోతుంది. పిప్పిపన్ను ప్రారంభదశలో దంతం పైన ఎనామిల్ మాత్రమే పోతుంది. ఈ దశలో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. కానీ రెండో దశలో రెండోపొర డెంటిన్ కరగటం మొదలవుతుంది. అప్పుడు చల్లని లేదా వేడినీళ్లు తాగినప్పుడు దంతాలు జివ్వుమంటాయి. ఈ సమస్యలు కూడా కొద్దిసేపే ఉండి, మిగతా సమయాల్లో బాధించవు.. కాబట్టి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ దశలో డాక్టర్‌ని సంప్రదిస్తే పంటిలోని ఇన్ఫెక్షన్‌ను తొలగించి, రంధ్రాన్ని శుభ్రంచేసి ఫిల్ చేస్తారు. దాంతో సమస్య అక్కడితో పరిష్కారమవుతుంది. కానీ దాన్ని పట్టించుకోకపోతే ఇన్ఫెక్షన్ మరింత పెరిగి మూడోదశకు చేరుకుంటుంది. ఈ దశలో ఇన్ఫెక్షన్ రక్తనాళాలు, నరాలు కలిగి ఉండే దంతపు మూడోపొర పల్ప్‌కు విస్తరిస్తుంది. ఆ సమయంలో రక్తనాళాలు, నాడులు దెబ్బతిని ఆ ప్రదేశంలో చీము తయారవుతుంది. ఈ దశలో భరించలేనంత తీవ్రమైన పంటినొప్పి ఉంటుంది. రాత్రివేళ నొప్పి తీవ్రత పెరుగుతుంది. దీనికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌తో వైద్యులు దంతాన్ని కాపాడతారు. అందువల్ల దంతంలో క్యావిటీ ఏర్పడిన తొలి దశలోనే డాక్టర్‌ని సంప్రదించి, ఫిల్లింగ్‌తోనే సమస్యను పరిష్కరించుకోవాలి.
పయోరియా
తీవ్రమైన నోటి దుర్వాసనను పయోరియా అంటారు. చిగుళ్లు, దంత సమస్యలు చివరిదశకు చేరుకున్నప్పుడు ఈ లక్షణం అధికంగా కనిపిస్తుంది. చిగుళ్లు ఇన్ఫెక్షన్‌కు గురై, అక్కడి ఫైబర్లు వదులై చీము చేరుతుంది. అయితే ఈ చిగుళ్ల సమస్యను అందరూ నిర్లక్ష్యం చేసి, నోటి దుర్వాసన వల్ల కలిగే అసౌకర్యానికి మాత్రమే చిట్కాలు వాడుతుంటారు. పయోరియా పూర్తిగా పంటి చిగుళ్లకు సంబంధించిన సమస్య. వాటిలోని ఇన్ఫెక్షన్‌ను, చీమును తొలగిస్తే నోటి దుర్వాసన మటుమాయమవుతుంది.
పన్ను విరిగినప్పుడు…
ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నోటిని ఎంత ఆరోగ్యంగా ఉంచుకున్నా ఆటలు ఆడే సమయంలో, ప్రమాదాల్లో, ఘర్షణల్లో ముఖానికి దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ సమయంలో దంతాలు విరిగి, ఊడిపడిపోతే, ఇక అది ఎందుకూ పనికిరాదని అక్కడే వదిలేసి నోటి నుంచి రక్తస్రావాన్ని ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. ఒకటి ఊడిపోతే మరో పన్ను పెట్టించుకోవచ్చు అనే ఆలోచన చేస్తారు. కానీ పెట్టుడు దంతం కంటే శాశ్వత దంతం ఎంతో దృఢమైనది, విలువైనది. ఊడిపోయిన దంతాన్ని తిరిగి యథాతథంగా దాని స్థానంలో బిగించే వీలుంది. అయితే దంతం ఊడిన రెండు గంటల్లోపే దానితో డాక్టర్‌ని సంప్రదించాలి. అప్పుడు తగిన చికిత్స చేసి, పన్నును బిగిస్తారు. ఇలా బిగించిన పన్ను శాశ్వత దంతంగానే ఉంటుంది. కాబట్టి దంతం ఊడిన వెంటనే దాన్ని శుభ్రం చేసి, నీళ్లు లేదా పాలతో నింపిన గ్లాసులో ఉంచి డాక్టర్‌ని కలవాలి. అప్పటివరకూ దంతం ఆరిపోకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి. పన్ను విరిగినప్పుడూ వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసి పైన క్యాప్ వేస్తారు. దాంతో సమస్య శాశ్వతంగా పరిష్కారమౌతుంది.
నిర్ధారణ – చికిత్స
దంత సమస్యలను నిర్ధారించడానికి డిజిటల్ ఎక్స్‌రే (ఆర్.వి.జి), డిజిటల్ ఒపిజి (ఫుల్ మౌత్ ఎక్స్‌రే) వంటి పరీక్షలు చేస్తారు. వీటి ఆధారంగా చికిత్సలుంటాయి. వాటిలో ముఖ్యమైనది రూట్ కెనాల్ చికిత్స.
దంత సమస్యలు తీవ్రమైనప్పుడు వాటి నివారణకు చివరగా రూట్‌కెనాల్ చికిత్స చేస్తారు. పళ్లపై ఏర్పడిన గారను, పంటి మధ్య గుజ్జులో బ్యాక్టీరియాను కూడా రూట్ కెనాల్ చికిత్సతో నివారిస్తారు. దంత, నోటి సమస్యలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్స లేజర్ చికిత్స. ఇది తక్కువ ఖర్చుతోనే జరుగుతుంది. ‘లేజర్ డెంటిస్ట్రీ’ అనే ప్రత్యేక పరికరం ద్వారా ఈ చికిత్స చేస్తారు. దంతాలను మెరిసేలా చేయడంలోనూ, చిగుళ్ల సమస్యలను నివారించడంలోనూ, సున్నిత దంతాలకు ఉపశమనం కల్గించడంలోనూ లేజర్ డెంటిస్ట్రీ మంచి ఫలితాలను ఇస్తుంది.
దంత సంరక్షణ కోసం
పళ్లని శుభ్రం చేసుకోవాలంటే టూత్ బ్రష్‌ని వాడాలన్న విషయం అందరికీ తెలుసు. బ్రష్ సక్రమంగా చేసుకుంటూనే, కొన్ని రకాల కూరగాయలు, పళ్లు తింటే దంతాలు శుభ్రమై నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. క్యారట్, జామ కాయలు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, పైనాపిల్, నారింజ వంటివి తింటే దంతాలు శుభ్రమౌతాయి. ఇక మరి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
– తీపి పదార్థాలు తినడాన్ని తగ్గించాలి.
– దంతాల చుట్టూ అంటుకుపోయే కేకులు, స్వీట్లు, చాక్లెట్లు వంటి అతి మెత్తని పదార్థాలను తినకూడదు.
– ఆహారం తిన్న వెంటనే నోరును నీటితో పుక్కిలించాలి. ఇంకా ఆ పదార్థాలు పళ్లను అంటి ఉన్నాయనిపిస్తే బ్రష్ చేయాలి.
– నిర్ణీత సమయాల్లో క్రమం తప్పకుండా రోజుకి రెండుసార్లు ఉదయం, రాత్రి బ్రష్ చేయాలి.
– ప్రతి ఆరుమాసాలకోసారి ఓరల్ చెకప్ చేయించుకోవాలి.
– ప్రతి రెండేళ్లకు దంతాల మీద పేరుకునే గారను ‘స్కేలింగ్’తో తొలగించుకోవాలి.