గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడాలంటే?


ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి పొట్టలో గ్యాస్ సమస్య వేధిస్తోంది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ పట్టేయడం వంటి సమస్యలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఆహారపు అలవాట్లలో ఉండే పొరపాట్ల వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతుంటాయి. పొట్టలో ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. పొట్ట ఉబ్బరం, మంటతో కూడిన త్రేన్పులు.. ఇలా గ్యాస్ ట్రబుల్ రకరకాలుగా వేధిస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో గ్యాస్ సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

*రోజూ ఒకేటైంకి భోజనం చేయడాన్ని అలవాటుగా పెట్టుకుంటే కొంతవరకూ గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా పొట్టలో అదనంగా యాసిడ్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. తద్వారా పొట్టలో గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది.

*రోజూ తినే పరిమాణంలో కొంత తగ్గించి తినడం ద్వారా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. పొట్టలో కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్‌గా తినేస్తే గ్యాస్ సమస్యతో పాటు పొట్ట కూడా పెరుగుతుంది.

*తింటున్నప్పుడు నీళ్లు తాగడం, తిన్న వెంటనే నీళ్లు తాగడం వంటి అలవాట్లు మానుకోవడం ద్వారా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే భోజనానికి ముందు, తర్వాత ఎలాంటి శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. కావాలంటే తేలికపాటి వాకింగ్ చేయొచ్చు.

*భోజనం తర్వాత సోంపు నమలడం అలాగే భోజనంలో జీలకర్ర, అల్లం వాడడం వంటి చిట్కాల ద్వారా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే తినేటప్పుడు బాగా నమిలి తింటే పొట్టలో యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు.

*పొట్ట ఉబ్బరం ఎక్కువగా వేధిస్తున్న వాళ్లు అల్లం తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అల్లం, నిమ్మరసం కలిపిన టీ తాగడం ద్వారా గ్యాస్ సమస్య తగ్గుతుంది.

*తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా అజీర్తి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం త్వరగా ముగించుకుని కనీసం తిన్న రెండు గంటల తర్వాత నిద్రపోయేలా చూసుకోవాలి.

Scroll to Top